టెక్కలి (కోటబొమ్మాళి) : స్టేట్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో కల్తీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టయింది. మద్యం తయారీదారుడి నుంచి స్వాధీనం చేసుకున్న 572 మద్యం సీసాల్లో 123 పూర్తిగా కల్తీ మద్యంగా గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన అధికార బృందం కోటబొమ్మాళి మండలంలో దాడులు చేయడం మద్యం దుకాణదారులను ఠారెత్తించింది. క్షేత్రస్థాయిలోని ఎక్సైజ్ అధికారుల పనితీరుకు శుక్రవారం జరిగిన దాడులు చెంపపెట్టులా ఉన్నాయి.
కోటబొమ్మాళిలో ఒక మద్యం దుకాణం ప్రధాన కేంద్రంగా పరిసర ప్రాంతాల్లోని బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేయడంతో పాటు నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాష్ట్ర డెరైక్టర్ సూర్యప్రకాశ్‌కు సమాచారం అందింది. దీంతో శుక్రవారం ఎక్సైజ్ రాష్ట్ర అధికారులు కోటబొమ్మాళి పరిసర ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఎస్టీఎఫ్ (స్టేట్ టాస్క్‌ఫోర్స్) డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, ఎస్సై బి.శ్రీహరిలతో పాటు సిబ్బంది పాకివలస గ్రామంలో సాహుకారి శ్రీధర్‌కు చెందిన బెల్టు షాపుపై మెరుపు దాడి చేశారు. దుకాణంలో 572 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
అందులో 123 సీసాల్లో నకిలీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. కోటబొమ్మాళిలోని సూర్య రత్నం వైన్స్ నుంచి శ్రీధర్ రోజూ సుమారు 8 బాక్స్‌ల చీప్ లిక్కర్ మద్యాన్ని తీసుకువచ్చి, శ్రీకాకుళం నుంచి ఖరీదైన మద్యం బ్రాండ్‌లకు చెందిన ఖాళీ సీసాలు, కప్పులను కొనుగోలు చేసి వాటిలో చీప్ లిక్కర్‌ను పోసి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిసింది. దీంతో శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని నకిలీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో సూర్యరత్నం వైన్స్ నిర్వాహకులు దుకాణాన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదే మండలం చీపుర్లపాడు గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టు దుకాణంలో 60 మద్యం సీసాలు, జర్జంగిలో 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ మద్యం తయారీ చేస్తున్న శ్రీధర్‌పై రెండు కేసులు నమోదు చేసామని, వాటిలో నకిలీ మద్యం తయారీ, లెసైన్స్ లేకుండా మద్యం అమ్మకాలు వంటి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దీనికి సహకరిస్తున్న సూర్యరత్నం వైన్స్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ అధికారి ప్రసాద్ తెలిపారు.
మంత్రి సొంత మండలంలో..
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడి సొంత మండలం కోటబొమ్మాళిలో బెల్టు షాపుల జోరుతో పాటు నకిలీ మద్యం తయారు కావడం గమనార్హం. ఎక్సైజ్ రాష్ట్ర అధికార బృందాలు నేరుగా రంగంలోకి దిగే వరకు స్థానిక అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ పలుకుబడికి భయపడుతున్నారా లేక మద్యం ‘మామూలే’నని పట్టించుకోవడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన మండలాల్లో కూడా ఈ విధమైన దాడులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
కల్తీ మద్యం గుట్టు రట్టు
Published Sat, Jan 10 2015 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement
Advertisement