కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం | Neglect of adulterated alcohol excise | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం

Published Fri, Aug 22 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం

కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం

  •       వరంగల్ సర్కిల్‌లో మరీ.. ఉదాసీనత
  •      113 వైన్స్‌లుంటే రెండింటిలోనే తనిఖీలు
  •      90 బార్‌షాపుల్లో ఒక్కదాంట్లోనే సోదాలు
  •      నగర పరిధిలో ఊసేలేని పరీక్షలు
  • సాక్షిప్రతినిధి, వరంగల్ : కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తోంది. ఇష్టారాజ్యంగా కల్తీ మద్యం విక్రయించి మద్యం ప్రియులను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దోపిడీ చేస్తున్న మద్యం వ్యాపారులకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. మద్యం షాపులు, బార్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించకుండా మారుమూల ప్రాంతాల్లో తక్కువ మద్యం వినియోగమయ్యే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    ఎక్సైజ్ శాఖకు సంబంధించి జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ సర్కిళ్లు ఉన్నాయి. వరంగల్ సర్కిల్‌లో మొత్తం 100 బార్లు, 113 వైన్‌షాపులు ఉండగా.. మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 118 వైన్‌షాపులు ఉన్నాయి. వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలోనే 88 బార్లు, 40 వైన్‌షాపులు ఉన్నాయి. మొత్తంగా వరంగల్ సర్కిల్‌లో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.

    ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్‌షాపులో మద్యాన్ని సీసాల నుంచి తీసి విక్రయించవద్దు. అలాగే బార్లలో సీల్ బాటిల్ అమ్మకూడదు. ఎక్సైజ్ శాఖ అధికారుల ఉదాసీనతతో బార్లలో ఎక్కువగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. వరంగల్ ఎక్సైజ్ సర్కిల్‌లో కల్తీ మద్యాన్ని నియంత్రించే తనిఖీలే జరగడం లేదు.

    ఎక్కడో ఒక చోట తనిఖీలు నిర్వహించినా కల్తీ మద్యం కాదనే ఫలితాలు వస్తున్నాయి. సాధారణంగా ఎక్సైజ్ శాఖ సేకరించే శాంపిల్స్ తక్కువగా ఉంటాయి. ఫిర్యాదులు, అనుమానాలు వస్తేనే సేకరిస్తారు. ఇలాంటివి కచ్చితంగా కల్తీగానే నిర్ధారణ అవుతాయి. అరుుతే, వరంగల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మాత్రం శాంపిల్స్ ఫలితాలు కల్తీగా రావడం దాదాపు లేదనే చెప్పొచ్చు. కొత్తగా వైన్‌షాపులు అనుమతులు వచ్చిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారు.

    ఏ కంపెనీకి చెందిన మద్యం సీసాలో అయినా ప్రమాణాల ప్రకారం మద్యం మోతాదు(ఆల్కహాల్ స్టెంత్) 25 శాతం ఉంటుంది. వాతావరణంలోని మార్పులను బట్టి ఈ మోతాదు శాతం 24.5 నుంచి 25.5 వరకు ఉండవచ్చు. సీసాను ఓపెన్ చేసి నీళ్లు కలిపితే ఇది తక్కువగా ఉంటుంది. ఇలా అయితే కల్తీగా నిర్ధారిస్తారు. అలాగే ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం కలిపి విక్రయిస్తారు. దీని వల్ల మద్యం మోతాదులో తేడా రాదు. ఇది.. బార్లలో ఎక్కువగా జరుగుతుంటుంది.
     
    నగరంలో తనిఖీలే లేవు
     
    కల్తీని నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాల్సిన అధికారలు మాత్రం వరంగల్ నగరం పరిధిలో అస్సలు ఆ చర్యలే చేపట్టడం లేదు. ఈ ఏడాది జూలై నుంచి జిల్లా వ్యాప్తంగా ఆరు వైన్‌షాపులలో శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా.. అన్నీ కల్తీ అని నిర్ధారించారు. ఇందులో వర్ధన్నపేటలోని వైన్ షాపులో సేకరించిన శాంపిల్ మాత్రమే వరంగల్ సర్కిల్ పరిధిలోకి వస్తుంది.

    వారం క్రితం వరంగల్ నగర పరిధిలోని ఒక వైన్స్‌లో, ఒక బార్‌లో ఒకటి చొప్పున శాంపిల్స్ సేకరిస్తే అదీ కల్తీ కాదని నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా మద్యం సీజనులో పరిశీలిస్తే మహబూబాబాద్ సర్కిల్‌లో ఐదు వైన్స్‌షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తే... వరంగల్ సర్కిల్‌లో ఒకే వైన్‌షాపులో తనిఖీలు నిర్వహించడాన్ని చూస్తే ఎక్సైజ్ శాఖపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ సర్కిల్ పరిధిలో ముఖ్యంగా వరంగల్ నగర పరిధిలోని వైన్స్‌లు, బార్లలో మద్యం కల్తీ నియంత్రణకు తనిఖీలు ఉండడం లేదు.

    2012 నుంచి 2014 వరకు రెండు మద్యం సీజన్లలోనూ వరంగల్ పరిధిలో కేవలం కేవలం 38 నమూనాలు మాత్రమే సేకరించారు. దీంట్లో ఒక శాంపిల్ మాత్రమే కల్తీగా తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో సేకరించే ప్రతి శాంపిల్ కల్తీ మద్యంగా తేలుతుండా... నగరంలో మాత్రం అలా జరగకపోవడానికి కారణాలు ఏమిటనేది అంతుపట్టడం లేదు. ‘ప్రస్తుత మద్యం సీజను జూలై 1 నుంచి మొదలైంది. ఈ నెల మొదటివారంలో నగర పరిధిలోని ఒక వైన్‌షాపు, ఒక బారులో శాంపిల్స్ సేకరించాము. రెండు కల్తీ లేనట్లుగానే ఫలితాలు వచ్చాయి’ అని ఎక్సైజ్ శాఖ వరంగల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మీ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement