samples
-
చంద్రునిపై చైనా ల్యాండర్
బీజింగ్: చైనాకు చెందిన లూనార్‌ల్యాండర్ చాంగే-6 చంద్రునిపై మనకు కనిపించని అవతలి వైపు ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చైనా కాలమానం ప్రకారం ఆదివారం(జూన్2) ఉదయం అయిట్కిన్ బేసిన్ అనే పేరుతో పిలుచుకునే ప్రాంతంలో చాంగే-6 సురక్షితంగా దిగినట్లు తెలిపింది. చాంగే-6 అక్కడి శాంపిల్స్ తీసుకున్న తర్వాత తిరిగి భూమికి బయల్దేరనుండటం విశేషం. మే3వ తేదీన చాంగే-6 భూమి నుంచి బయలుదేరి 53 రోజులు ప్రయాణించి చంద్రున్ని చేరింది. రోబోల సాయంతో చంద్రునిపై తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టి శాంపుల్స్ తీసుకోనుంది. తర్వాత లూనార్ ల్యాండర్‌లోని అసెండర్ మాడ్యూల్ చంద్రుడిపైకి లేచి చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్‌తో అనుసంధానమవతుంది. ఆర్బిటర్ మళ్లీ భూమి దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది. ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్ శాంపుల్స్ తీసుకుని భూమిపైన దిగుతుంది. చంద్రుడి అవతలివైపు మొత్తం గోతులతో నిండి ఉండటం వల్ల అటువైపు ల్యాండ్ అయి వ్యోమనౌకలు తిరిగి రావడం అంత సులువు కాదు. అయితే చైనా ఈ ఫీట్‌ను సాధిస్తే 2030లో చంద్రునిపై వ్యోమగాములను పంపేందుకు మార్గం సుగమం అయినట్లే. -
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో నిందితుల డ్రామాలు!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అధునాతన డ్రగ్స్ టెస్టులకు సైతం చిక్కకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని చూసి అధికారులు నివ్వెరపోతున్నట్లు తెలుస్తోంది. హెయిర్ శాంపిల్స్ టెస్టు.. యూరిన్ టెస్ట్.. రెండింటిలోనూ నెగెటివ్ ఫలితం గచ్చిబౌలి పోలీసులను కంగుతినేలా చేస్తోంది. ఈ క్రమంలో ఇక చివరగా నిందితుల బ్లడ్ శాంపిల్స్ నివేదికలపైనే పోలీసులు ఆధారపడుతున్నారు. అయితే.. అలా ఎలా?.. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో.. నీల్ అనే నిందితుడు మినహా మిగతా 12 మంది విచారణకు హాజరయ్యారు. అయితే వాళ్లకు నిర్వహిస్తున్న టెస్టుల్లో నెగెటివ్ రావడంతో దర్యాప్తు అధికారులు కంగుతింటున్నారు. వాస్తవానికి.. డ్రగ్స్ పార్టీ జరిగిన మరుసటి రోజే ముగ్గురు నిందితుల శాంపిల్స్‌లో పాజిటివ్‌గా తేలింది. అయితే వారం రోజుల గడువుతో మళ్లీ విచారణకు వచ్చారు నిందితులు. ఈలోపు పూర్తి డైట్ పాటించడంతోనే ఇప్పుడు ఫలితం నెగెటివ్‌గా వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హెయిర్‌శాంపిల్స్‌లోనూ నెగెటివ్ ఫలితంపై అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. హెయిర్ శాంపిల్స్ టెస్టుల్లో బయటపడకుండా ఉండేందుకు డై వేసుకుని వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరగా.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. త్వరలోనే వాటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో పాజిటివ్ వచ్చినా కన్జూమర్స్ పేరుతో వాళ్లు బయటపడేందుకు యత్నాలు చేసే అవకాశం లేకపోలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. -
ఇక కల్తీనీ ఇట్టే పసిగట్టొచ్చు
సాక్షి, అమరావతి: పాలు, పాల ఉత్పతుల్లో విషపూరిత రసాయనాలు, ఆహార పదార్థాలు, మంచినీరు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీని ఇక ఇట్టే పసిగట్టవచ్చు. ఇందుకోసం రూ.11 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన దేశంలోనే తొలి అతిపెద్ద స్టేట్ సెంట్రల్ లేబోరేటరీ అందుబాటులోకి వచ్చింది. పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్‌స్టాక్ (ఏపీ కార్ల) ప్రాంగణంలో ఈ అత్యాధునిక లేబరేటరీని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. దీంతో పాలల్లో నాణ్యతను అంచనా వేసేందుకు రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాల డెయిరీల్లో హై ఎండ్ ఎక్యూప్మెంట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసినట్లయింది. 100కు పైగా పరీక్షలు చేసే వెసులుబాటు రాష్ట్ర పరిధిలోని శాంపిల్స్‌ను పరీక్షించేందుకు ఇప్పటి వరకు కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు పంపేవారు. దూరాభారం కావడంతో ఒక్కో శాంపిల్‌కు రూ.2,500 నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యేది. కాగా రూ.3కోట్లతో నిర్మించిన పులివెందుల లే»ొరేటరీలో రూ.8 కోట్లతో ఇందుకు సంబంధించి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వందకుపైగా పరీక్షలు నిర్వహించేలా ఈ ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. సుమారు 15 మంది నిష్ణాతులైన సిబ్బందిని నియమించారు. వీరిలో 8 మంది శాస్త్రవేత్తలతో పాటు జూనియర్, సీనియర్ ఎనలిస్ట్‌లు ఉంటారు. కాగా, ఆర్నెల్ల తర్వాత నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్‌ఎబీఎల్) నుంచి ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తారు. నిర్దేశిత గడువులోగా ఫలితాలు.. పాలు, పాల ఉత్పత్తులతో పాటు తేనె, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, ప్యాక్డ్ ఫుడ్, స్వీట్స్, జెల్లీ, కాన్పెక్టనరీస్, మాంసం, రొయ్యలు, గుడ్లు, గ్రాస్ సీడ్స్‌లలో కొవ్వు, ప్రొటీన్, ఎస్ఎన్ఎఫ్, నాన్ ప్రొటీన్ నైట్రోజెన్, పెస్టిసైడ్స్, యాంటిబయోటిక్స్, హెవీ మెటల్స్, కల్తీలు (అడాల్టరెంట్స్) ఇతర కలుషితాల (కంటామినెంట్ ఎలిమెంట్స్)ను 36–48 గంటల్లోపే పరీక్షిస్తారు. కాగా వీటిల్లో బ్యాక్టీరియల్ అవశేషాలను 4–5 గంటల్లో గుర్తిస్తారు. అదే మాంసం, రొయ్యలు, గుడ్లతో పాటు గ్రాస్ సీడ్స్, ఎరువులు, వేస్ట్ వాటర్‌లో ప్రొటీన్, నాన్ ప్రొటీన్ నైట్రోజెన్ అవశేషాలను 4–6 గంటల్లోనూ పసి గట్టవచ్చు. తాగునీరులో పోషక లోపాలు, కలుషితాలను 1–2 గంటల్లోనూ, ఫార్మా మందుల్లో 24గంటల్లో, ఇన్ప్యూరిటీ ఎనాలసిస్ (మలినాలు)ను 25 గంటల్లోనూ, ఖనిజాలు, పోషక లోపాలను 36 గంటల్లోనూ, ప్రీ క్లీనికల్, క్లినికల్ ఎనాలసిస్ను 15 రోజుల్లోనూ పరీక్షిస్తారు. తనిఖీల్లో గుర్తించిన శాంపిల్స్‌ను ఆయా డిపార్టుమెంట్లు ఈ లే»ొరేటరీకి పంపితే నిర్ధేశిత గడువులోగా విశ్లేషిoచి ఫలితాలతో కూడిన నివేదికలను అందజేస్తారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు సైతం ఈ లేబోరేటరీ సేవలను ఉపయోగించుకోవచ్చు. అవశేషాలను గుర్తించడం ఇక సులభం అత్యాధునిక స్టేట్ సెంట్రల్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, ఎరువులు,తాగునీరు, మందులు, మాంసం, గుడ్లు, రొయ్యల్లో పురుగు మందుల అవశేషాలు, యాంటీబయాటిక్, పశువైద్య అవశేషాలు, భారీలోహాలు, మైక్రో టాక్సిన్లు, వ్యాధి కారకాలను నిర్ధేశిత గడువులోగా గుర్తించొచ్చు. భౌతిక, రసాయన, జీవ నాణ్యతను విశ్లేషిoచి ద్రువీకరణ పత్రాలు పొందొచ్చు. కల్తీలకు ఇక పూర్తిగా చెక్ పెట్టొచ్చు. – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
వింత వ్యాధితో 4వేల కోళ్లు మృతి!
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వింతవ్యాధి సోకి 4వేల కోళ్లు మృతి చెందిన సంఘటన కాల్వశ్రీరాంపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. కాల్వశ్రీరాంపూర్‌లో పెద్దంపేట మాజీ సర్పంచ్ దాసరి స్వామి నాటుకోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. మార్కెట్లో అమ్మేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో వింత వ్యాధి సోకి చనిపోతున్నట్లు బాధితుడు తెలిపాడు. వీటి విలువ రూ.8 లక్షలు ఉంటుందని పేర్కొన్నాడు. ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ సురేశ్‌గౌడ్‌ను సంప్రదించాడు. కాగా కోళ్లకు రానిఖేట్ వ్యాధి సోకిందని, మృతి చెందిన కోళ్లను గుంత తీయించి పూడ్చి పెట్టాలని సూచించామని చెప్పారు. మృతి చెందిన కోళ్ల శ్యాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించినట్లు వివరించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. చదవండి: తెలంగాణ సచివాలయంలో నాగుపాము కలకలం -
చంద్రుడి మట్టిని పట్టిన చాంగె–5
బీజింగ్: చైనాకు చెందిన అంతరిక్ష నౌక చాంగె–5 చంద్రుడి మీద మట్టిని సేకరించిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు బుధవారం వెల్లడించారు. చంద్రుడి మీద మట్టిని సేకరించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చంద్రుడి మీద ఉన్న ఓసియానుస్ ప్రొసెల్లారమ్ అనే ప్రాంతంనుంచి చాంగె–5 మట్టిని సేకరించింది. ఈ సేకరణలో భాగంగా ల్యాండర్ రెండు మీటర్ల లోతులోని మట్టిని సేకరించిందని చెప్పారు. మరికొన్ని శాంపిళ్లను కూడా సేకరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. దాదాపు రెండు కేజీల మట్టిని సేకరించిందని తెలిపారు. చంద్ర ఉపరితలం నుంచి, అలాగే లోతుల్లోంచి కూడా మట్టిని సేకరించామని తెలిపారు. మొదటిసారే విజయం సాధించడం గమనార్హం. దీనిపై అమెరికా స్పేస్ ఏజెన్సీ చైనా స్పేస్ ఏజెన్సీకి అభినందనలు తెలిపింది. అంతర్జాతీయ పరిశోధనా కమ్యూనిటీ ద్వారా కొన్ని శాంపిళ్లపై పరిశోధన చేసే అవకాశం తమకూ రావచ్చని అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సైన్స్ కమ్యూనిటీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పింది. చంద్రుడి నుంచి శాంపిళ్లను సేకరించిన మూడో దేశంగా అమెరికా, రష్యాల సరసన చైనా నిలిచింది. మట్టిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు పటిష్టమైన కంటెయినర్‌ను వాడాల్సి ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. -
కరోనా : భార్య శాంపిల్స్ పనిమనిషి పేరుతో..
భోపాల్ : మధ్యప్రదేశ్‌కు చెందిన అభయ్ రాజన్ సింగ్ సింగ్రౌలీలోని ఖాతుర్ హెల్త్ సెంటర్లో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కాగా అభయ్ భార్యకు కరోనా వచ్చింది. అయితే అతడు ఎవరికి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో టెస్టుల కోసం భార్య నమూనాల్ని ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరుతో పంపాడు. దీంతో అసలు విషయం ఆ తర్వాత బయటపడటంతో అభయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కరోనా విధులు నిర్వహిస్తున్న అభయ్ రాజన్ సింగ్ సెలవు తీసుకోకుండానే తన కుటుంబంతో కలిసి జూన్ 23న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తన బంధువుల పెళ్లికి వెళ్లాడు. తర్వాత రాజన్ కుటుంబం జూలై మొదటి వారంలో సింగ్రౌలికి తిరిగి వచ్చారు.(24 గంటల్లో.. 28వేలకు పైగా కేసులు) అయితే ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అభయ్ భార్యకు దగ్గుతో పాటు జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో అనుమానం కలిగి తన భార్య నమూనాలను పనిమనిషి పేరుతో పంపాడు. ఆ శాంపిల్స్ పరీక్షించడంతో.. కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఈ క్రమంలో పనిమనిషి పేరుతో శాంపిల్స్ పంపిన అడ్రస్ కు వైద్యాధికారులు, పోలీసులు వచ్చారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. కరోనా సోకింది తాను పని చేస్తున్నడాక్టర్ భార్యకని తేలింది.అభయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అభయ్‌తో పాటు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.(కరోనా రోగి పట్ల అమానుష ప్రవర్తన) కాగా అధికారులు డాక్టర్‌ను కలిసిన వారందరిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో జులై 1 తర్వాత అభయ్‌ను కలిసిన 33 మంది ప్రభుత్వ ఉద్యోగులు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. వీరిలో ఒకరు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కూడా ఉన్నారు. త్వరలోనే వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. తప్పుడు పేరుతో నమూనాలు పంపినందుకు డాక్టర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరోనా నుంచి అభయ్ రాజన్ కోలుకున్న తర్వాత ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
‘రోజుకు 2000 శాంపిల్స్ పరీక్షిస్తాం’
ముంబై : కరోనా మహమ్మారి ముంబైలో విస్తృతంగా వ్యాప్తిస్తున్న క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం నగరంలో మహమ్మారి కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముంబైలోని ప్రతిష్టాత్మక జేజే ఆస్పత్రిలో నెలాఖరు నాటికి రోజుకు 2200 శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యాన్ని పెంచుతామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో రోజుకు 100 శాంపిల్స్‌ను టెస్ట్ చేస్తున్నారు. పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో(ఎన్ఐవీ) రోజుకు 800 నమూనాలను పరీక్షిస్తున్నారు. ముంబైలోని మరో రెండు ప్రభుత్వ ఆస్పత్రులు జీటీ, సెంట్ జార్జ్ ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. అత్యధిక పరీక్షలు చేపట్టేందుకు వీలుగా జేజే ఆస్పత్రిలో ఆర్టీ-పీసీఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, మరో రెండు మూడు రోజుల్లో ఇక్కడ రోజుకు 2200 శాంపిల్స్‌ను పరీక్షించేలా అప్‌గ్రేడ్ చేస్తామని వైద్య శాఖ అధికారి వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి లక్ష మందికి పైగా తాము పరీక్షించామని చెప్పారు. వైరస్‌ను నేరుగా గుర్తించే పీసీఆర్ టెస్ట్‌లపైనే తాము దృష్టికేంద్రీకరించామని, దీంతో సత్వరమే వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు. చదవండి : ముంబై నుంచి కాలినడకన.. -
హమ్మయ్యా! రిపోర్ట్లన్నీ.. నెగెటివ్
సాక్షి, నల్లగొండ : జిల్లాలో కరోనా అనుమానితుల నుంచి సేకరించి పంపిన శాంపిల్స్ రిపోర్ట్లన్నీ నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బుధవారం సేకరించిన తొమ్మిది శాంపిల్స్ సహా మొత్తం రిపోర్ట్లన్నీ గురువారం సాయంత్రం అందాయి. కాగా సెకండరీ కాంటాక్ట్ శాంపిల్స్ తీయొద్దని ఉన్నతాధికారులు పేర్కొనడంతో.. గురువారం ఎవరి నుంచి శాంపిల్స్ సేకరించలేదు. అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు జిల్లాలో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఒక వైపు పొరుగున ఉన్న సూర్యాపేట జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నల్లగొండ జిల్లా ప్రజలు టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. మూడు రోజుల కిందటి వరకు కేసులు లేకపోయినా.. ఒకే కుటుంబంలో మూడు కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మళ్లీ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు కాంటాక్టు అయిన వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. కాగా, గురువారం సాయంత్రానికి ఆ పరీక్షల నివేదికలు జిల్లా అధికారులకు అందాయి. అందరివీ నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆ వ్యాపారస్తులకూ నెగిటివ్ నల్లగొండ పట్టణంలో కరోనా పాజిటివ్ వచ్చినవారు కూరగాయల మార్కెట్,కిరాణం,మెడికల్ షాపుల్లో సరుకులు కొనుగోలు చేశారన్న సమాచారం మేరకు వారందరినీ గుర్తించి 66 మందివి, బుధవారం పంపిన 9 శాంపిల్స్ అన్నీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. సూర్యాపేట లింక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకడం కుటుంబాన్ని కలిసినట్లు అనుమానం ఉన్న దాదాపు 90 మంది శాంపిల్స్ సేకరించి పంపగా అవి కూడా నెగెటివ్ వచ్చాయి. వీటితో ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌కు సంబంధించి శాంపిల్స్ సేకరణ పూర్తయింది. కాగా సెకండరీ కాంటాక్టు అయిన వారి శాంపిల్స్ తీయొద్దని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. ఎవరికైనా అనుమానం ఉంటేనే నమూనాలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. కరోనా కట్టడికి అధికార యంత్రాంగం కృషి.. మొదటి నుంచి జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో కరోనా కట్టడికి పూనుకుంది. జిల్లాలో నల్లగొండ పట్టణం, మిర్యాలగూడ, దామరచర్లలో తొలుత 12 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఆరుగురు గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారితో వైరస్ వ్యాప్తి జరుగుతోందని గుర్తించిన మరుక్షణం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వియత్నాం, బర్మా దేశస్తులను గుర్తించడంతో వారి నుంచి వ్యాప్తిని నిరోధించగలిగారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రాంతాల్లో ప్రజలకు బయటకు వెళ్లే అవసరం లేకుండా.. అన్ని రకాల సేవలు అందించారు. దీంతో పన్నెండు రోజుల పాటు జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసుకూడా నమోదు కాలేదు. మాన్యంచెల్కలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా వైరస్ సోకడంతో తిరిగి వారి ప్రైమరీ కాంటాక్టులందరినీ గుర్తించి వారికి పరీక్షలు చేయించడం వారికి నెగెటివ్ రావడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ శాఖలు ఎంతో కృషి చేశాయి. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జాన్సన్ బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లున్నాయన్న సమాచారంతో దేశీయ ఔషధ నియంత్రణ అధికారులు స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లో జాన్సన్ ఫ్యాక్టరీలో జాన్సన్ బేబీ పౌడర్ శాంపిళ్లను డ్రగ్ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీ ప్లాంట్‌నుంచి ఈ నమూనాలు సేకరించినట్టు పేరు వెల్లడించడానికి అంగీకరించని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీ) అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. అలాగే వార్తా కథనాల ఆధారంగా శాంపిళ్లను సీజ్ చేయాల్సిందేగా ఆదేశించానని తెలంగాణాకు చెందిన రీజనల్ డ్రగ్ ఆఫీసర్ సురేంద్రనాథ్ సాయి ధృవీకరించారు. పరీక్షల అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని ప్రభావానికి లక్షలాదిమంది పసిపిల్లలు గురి కానున్నారనే అంశం బాధిస్తోందన్నారు. అయితే తాజా పరిణామంపై జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ వ్యవహరాన్ని పరిశీలించేందుకు సుమారు 100మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించినట్టు వార్తలొచ్చాయి. జాన్సన్ ఇండియాతో సంబంధమున్న వేర్వేరు ఉత్పాదక యూనిట్లు, హోల్‌సేలర్స్, పంపిణీదారులను పరిశీలించడానికి నియమించారు. దీనిపై సంప్రదించినప్పుడు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ రిపోర్టులో నివేదించిన అంశాలు చాలా ఆందోళన కరమని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిపింది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్కారకాలు ఉన్నాయన్న సంగతిని మూడు దశాబ్దాలుగా కంపెనీ దాచి పెట్టిందంటూ ఇటీవల రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
‘అభినందన’ మందులు వద్దు
- పనిచేయడం లేదని అధికారుల సూచన - జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ తీర్మానం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం పశువైద్యానికి నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్ కుమార్ తెలిపారు. బుధవారం తన చాంబర్లో మందుల సరఫరాపై జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అభినందన అనే కంపెనీకి చెందిన మందులు నాణ్యత లేవని, రోగాలపై అసలు పనిచేయడం లేదని వీటిని జిల్లాకు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు. అలాగే అభినందన కంపెనీ మందులు జిల్లాకు అవసరం లేదని కమిటీ తీర్మానం చేసింది. రేట్ కాంట్రాక్టు ఉన్న 50 కంపెనీల్లో కొన్ని కంపెనీల మందులు బాగా పనిచేస్తున్నాయని వాటిని తెప్పించాలని కమిటీ సభ్యులు సూచించారు. జేడీ మాట్లాడుతూ జిల్లాలోని నాణ్యమైన, బాగా పనిచేసే వాటినే తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ డీడీలు సీవీ రమణయ్య, పి.రమణయ్య, జీవీ రమణ, వరప్రసాద్, గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ డాక్టర్ చంద్రశేఖర్, వెటర్నరీ పాలిక్లినిక్ డీడీ హమీద్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం
వరంగల్ సర్కిల్లో మరీ.. ఉదాసీనత 113 వైన్స్లుంటే రెండింటిలోనే తనిఖీలు 90 బార్‌షాపుల్లో ఒక్కదాంట్లోనే సోదాలు నగర పరిధిలో ఊసేలేని పరీక్షలు సాక్షిప్రతినిధి, వరంగల్ : కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తోంది. ఇష్టారాజ్యంగా కల్తీ మద్యం విక్రయించి మద్యం ప్రియులను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దోపిడీ చేస్తున్న మద్యం వ్యాపారులకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. మద్యం షాపులు, బార్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించకుండా మారుమూల ప్రాంతాల్లో తక్కువ మద్యం వినియోగమయ్యే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ సర్కిళ్లు ఉన్నాయి. వరంగల్ సర్కిల్లో మొత్తం 100 బార్లు, 113 వైన్‌షాపులు ఉండగా.. మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 118 వైన్‌షాపులు ఉన్నాయి. వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలోనే 88 బార్లు, 40 వైన్‌షాపులు ఉన్నాయి. మొత్తంగా వరంగల్ సర్కిల్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్‌షాపులో మద్యాన్ని సీసాల నుంచి తీసి విక్రయించవద్దు. అలాగే బార్లలో సీల్ బాటిల్ అమ్మకూడదు. ఎక్సైజ్ శాఖ అధికారుల ఉదాసీనతతో బార్లలో ఎక్కువగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. వరంగల్ ఎక్సైజ్ సర్కిల్లో కల్తీ మద్యాన్ని నియంత్రించే తనిఖీలే జరగడం లేదు. ఎక్కడో ఒక చోట తనిఖీలు నిర్వహించినా కల్తీ మద్యం కాదనే ఫలితాలు వస్తున్నాయి. సాధారణంగా ఎక్సైజ్ శాఖ సేకరించే శాంపిల్స్ తక్కువగా ఉంటాయి. ఫిర్యాదులు, అనుమానాలు వస్తేనే సేకరిస్తారు. ఇలాంటివి కచ్చితంగా కల్తీగానే నిర్ధారణ అవుతాయి. అరుుతే, వరంగల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మాత్రం శాంపిల్స్ ఫలితాలు కల్తీగా రావడం దాదాపు లేదనే చెప్పొచ్చు. కొత్తగా వైన్‌షాపులు అనుమతులు వచ్చిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. ఏ కంపెనీకి చెందిన మద్యం సీసాలో అయినా ప్రమాణాల ప్రకారం మద్యం మోతాదు(ఆల్కహాల్ స్టెంత్) 25 శాతం ఉంటుంది. వాతావరణంలోని మార్పులను బట్టి ఈ మోతాదు శాతం 24.5 నుంచి 25.5 వరకు ఉండవచ్చు. సీసాను ఓపెన్ చేసి నీళ్లు కలిపితే ఇది తక్కువగా ఉంటుంది. ఇలా అయితే కల్తీగా నిర్ధారిస్తారు. అలాగే ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం కలిపి విక్రయిస్తారు. దీని వల్ల మద్యం మోతాదులో తేడా రాదు. ఇది.. బార్లలో ఎక్కువగా జరుగుతుంటుంది. నగరంలో తనిఖీలే లేవు కల్తీని నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాల్సిన అధికారలు మాత్రం వరంగల్ నగరం పరిధిలో అస్సలు ఆ చర్యలే చేపట్టడం లేదు. ఈ ఏడాది జూలై నుంచి జిల్లా వ్యాప్తంగా ఆరు వైన్‌షాపులలో శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా.. అన్నీ కల్తీ అని నిర్ధారించారు. ఇందులో వర్ధన్నపేటలోని వైన్ షాపులో సేకరించిన శాంపిల్ మాత్రమే వరంగల్ సర్కిల్ పరిధిలోకి వస్తుంది. వారం క్రితం వరంగల్ నగర పరిధిలోని ఒక వైన్స్‌లో, ఒక బార్లో ఒకటి చొప్పున శాంపిల్స్ సేకరిస్తే అదీ కల్తీ కాదని నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా మద్యం సీజనులో పరిశీలిస్తే మహబూబాబాద్ సర్కిల్లో ఐదు వైన్స్‌షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తే... వరంగల్ సర్కిల్లో ఒకే వైన్‌షాపులో తనిఖీలు నిర్వహించడాన్ని చూస్తే ఎక్సైజ్ శాఖపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ సర్కిల్ పరిధిలో ముఖ్యంగా వరంగల్ నగర పరిధిలోని వైన్స్‌లు, బార్లలో మద్యం కల్తీ నియంత్రణకు తనిఖీలు ఉండడం లేదు. 2012 నుంచి 2014 వరకు రెండు మద్యం సీజన్లలోనూ వరంగల్ పరిధిలో కేవలం కేవలం 38 నమూనాలు మాత్రమే సేకరించారు. దీంట్లో ఒక శాంపిల్ మాత్రమే కల్తీగా తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో సేకరించే ప్రతి శాంపిల్ కల్తీ మద్యంగా తేలుతుండా... నగరంలో మాత్రం అలా జరగకపోవడానికి కారణాలు ఏమిటనేది అంతుపట్టడం లేదు. ‘ప్రస్తుత మద్యం సీజను జూలై 1 నుంచి మొదలైంది. ఈ నెల మొదటివారంలో నగర పరిధిలోని ఒక వైన్‌షాపు, ఒక బారులో శాంపిల్స్ సేకరించాము. రెండు కల్తీ లేనట్లుగానే ఫలితాలు వచ్చాయి’ అని ఎక్సైజ్ శాఖ వరంగల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మీ తెలిపారు. -
‘శాంపిల్స్’ మాఫియా
ముత్తుకూరు మండలానికి చెందిన కార్మికుడు వెంకన్న ఒంట్లో నలతగా ఉండడంతో సమీపంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆయన రాసిచ్చిన మందుల చీటీతో ఆ ప్రాంతంలోని మెడికల్ షాపుకెళ్లాడు. ఆ మందులు లేవని దుకాణ నిర్వాహకుడు చెప్పడంతో వెంకన్న మళ్లీ ఆర్ఎంపీ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. సరే నేను చెప్పిన షాపుకెళ్లని ఓ అడ్రస్ చెప్పాడు. ఆ షాప్‌కు వెళ్లి చీటీ ఇవ్వగానే సదరు మందులు ఇచ్చి రూ.1,500 వసూలు చేశారు. ఇంటికొచ్చిన తర్వాత తెలిసిన వాళ్లకి ఆ మందులు చూపించగా అన్ని శాంపిల్స్ అని తేలింది. మోసపోయానని తెలుసుకున్నా ఏమీ చేయాలో తెలియక సర్దుకుపోయాడు. ఈ పరిస్థితి వెంకన్న ఒక్కరిదే కాదు. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా ఇలా జిల్లాలో నిరంతరం ఎందరో మోసపోతున్నారు. నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: మందుల సరఫరా, విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో జనం జేబులకు చిల్లు పడుతున్నాయి. ఉన్నత స్థాయిలో కొందరు ముఠాగా ఏర్పడి శాంపిల్ మందుల విక్రయాలతో చేతి నిండా సంపాదిస్తున్నారు. దేశంలో 75 వేలకు పైగా మందుల కంపెనీలు ఉండగా ఆంధ్రప్రదే శ్‌లోనే 150 నుంచి 200 వరకు ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్ కేంద్రంగా దేశంలోనే అత్యధికంగా సుమారు ఐదు వేల కంపెనీలు నడుస్తున్నాయి. ఆయా కంపెనీలు తమ ఉత్పాద నలను మార్కెటింగ్ కోసం ప్రతినిధుల(మెడికల్ రెప్రజెంటేటివ్స్) ద్వారా డాక్టర్లు, మందుల షాపులకు శాంపిల్స్ పంపుతారు. వీటిని విక్రయించకూడదని సంబంధిత ప్యాకెట్లపై ముద్రించి ఉంటుంది. ఉచితంగా వస్తున్న ఈ మందులను సొమ్ము చేసుకోవాలని కొందరు ముఠాగా ఏర్పడ్డారు. ఆయా కంపెనీల ప్రతినిధుల్లోని కొందరితో డీల్ కుదుర్చుకుని కమీషన్లు సమర్పిస్తూ, భారీఎత్తున శాంపిల్స్ సేకరించారు. వీటిని చెన్నైలోని ఓ రహస్య ప్రదేశంలో నిల్వ చేస్తున్నారు. అనంతరం ఆర్ఎంపీ, పీఎంపీలతో కమీషన్ ఒప్పందం కుదుర్చుకుని శాంపిల్స్‌ను రహస్యంగా వారికి చేరవేస్తున్నారు. కొన్ని చోట్లయితే ఆర్ఎంపీలు, పీఎంపీల సహకారంతో ఎంపిక చేసుకున్న మందుల దుకాణాల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కృష్ణపట్నం, మేనకూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ తదితర ప్రాంతాలతో పాటు పల్లెలపై ఆ ముఠా దృష్టిపెట్టింది. పారిశ్రామిక ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన నిరక్షరాస్యులు భారీ సంఖ్యలో వలసవ చ్చి వివిధ పనులు చేసుకుంటున్నారు. వారు పనిచేసి న ప్రదేశాల్లో పరిస్థితులను బట్టి తరచూ అస్వస్థతకు గురవుతుంటారు. పెద్దడాక్టర్ల వద్దకు వెళ్లే స్తోమత లేక సమీపంలోని ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వీరిని టార్గెట్ చేసుకున్న శాంపిల్ మందుల మాఫియా తన వ్యాపారాన్ని జోరుగా విస్తరిస్తున్నట్లు సమాచారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం: శాంపిల్ మందులు ఎక్కడా కూడా విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మందుల దుకాణాలపై చర్యలు తీసుకున్నాం. జిల్లాలో మా సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి శాంపిల్ మందులు విక్రయాలు జరిపే దుకాణాలపై దాడులు నిర్వహిస్తాం. శ్రీరామ్మూర్తి, ఏడీ, డ్రగ్ కంట్రోలర్ డిపార్ట్మెంట్