సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అధునాతన డ్రగ్స్ టెస్టులకు సైతం చిక్కకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని చూసి అధికారులు నివ్వెరపోతున్నట్లు తెలుస్తోంది.
హెయిర్ శాంపిల్స్ టెస్టు.. యూరిన్ టెస్ట్.. రెండింటిలోనూ నెగెటివ్ ఫలితం గచ్చిబౌలి పోలీసులను కంగుతినేలా చేస్తోంది. ఈ క్రమంలో ఇక చివరగా నిందితుల బ్లడ్ శాంపిల్స్ నివేదికలపైనే పోలీసులు ఆధారపడుతున్నారు. అయితే..
అలా ఎలా?..
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో.. నీల్ అనే నిందితుడు మినహా మిగతా 12 మంది విచారణకు హాజరయ్యారు. అయితే వాళ్లకు నిర్వహిస్తున్న టెస్టుల్లో నెగెటివ్ రావడంతో దర్యాప్తు అధికారులు కంగుతింటున్నారు. వాస్తవానికి.. డ్రగ్స్ పార్టీ జరిగిన మరుసటి రోజే ముగ్గురు నిందితుల శాంపిల్స్‌లో పాజిటివ్‌గా తేలింది. అయితే వారం రోజుల గడువుతో మళ్లీ విచారణకు వచ్చారు నిందితులు. ఈలోపు పూర్తి డైట్ పాటించడంతోనే ఇప్పుడు ఫలితం నెగెటివ్‌గా వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు హెయిర్‌శాంపిల్స్‌లోనూ నెగెటివ్ ఫలితంపై అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. హెయిర్ శాంపిల్స్ టెస్టుల్లో బయటపడకుండా ఉండేందుకు డై వేసుకుని వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చివరగా.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. త్వరలోనే వాటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో పాజిటివ్ వచ్చినా కన్జూమర్స్ పేరుతో వాళ్లు బయటపడేందుకు యత్నాలు చేసే అవకాశం లేకపోలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment