
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం రేపింది. కృత్రిమ కల్లు తాగి రెండు గ్రామాల్లో దాదాపు 100కి మంది పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకెళ్తే.. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం చిట్టిగిద్ద గ్రామంలో తయారు చేస్తున్న కృత్రిమ కల్లును మండల పరిధిలోని నవాబ్ పేట్, అర్కతల, వట్టిమీనపల్లి, ఎక్ మామిడి, కేశపల్లి, తిమ్మారెడ్డి పల్లి, మమ్దాన్పల్లి, వికారాబాద్ మండలం కొత్తగడి, నారాయణపూర్, ఎర్రవళ్లి, పాతూర్, కామరెడ్డిగూడ, పులుసుమామిడి గ్రామాలకు డీసీఎంలో గత కొంత కాలంగా సరఫరా చేస్తున్నారు.
అయితే ఎప్పటి మాదిరిగానే శుక్రవారం కూడా కల్లు సరఫరా చేశారు. కల్లు సేవించిన వారిలో వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాకు చెందిన దాదాపు 100 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చిట్టిగిద్దకు చెందిన ప్యాట రాములు(65) పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిని వారివారి బంధువులు నవాబ్‌పేట్, వికారాబాద్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు గ్రామానికి చేరుకొని అస్వస్థతకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. బాధిత కుటుంబాలను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, చేవేళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్యలు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment