తప్పుకుందామా? అనిపించింది
బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్య
సాక్షి, చెన్నై: రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే బెస్ట్ అన్నట్లుగా తనకు అనేక సందర్భాలలో ఆలోచనలు వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఒక్కోరోజు ఒక్కో సమస్య ఎదురు కావడంతో రాజకీయాల నుంచి తప్పుకుంద్దామా? అనే భావన మదిలో మెదిలినట్లు పేర్కొన్నారు. ఐపీఎస్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి బీజేపీతో రాజకీయాల్లోకి అన్నామలై అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ఈ మూడేళ్ల కాలంలో పార్టీ బలోపేతానికి ఆయన వీరోచితంగానే శ్రమించారు. అధికార పక్షాన్ని విమర్శలు, ఆరోపణలతో ఉతికి ఆరేయడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షాన్ని సైతం ఎండగట్టంలో ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కోయంబత్తూరులో తనకు ఓట్ల వేసిన వారికి, తనకోసం లోక్‌సభ ఎన్నికలలో శ్రమించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిన సభలో అన్నామలై రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రోజుకో సమస్య..
తాన రాజకీయ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని పేర్కొంటూ మనస్సు విప్పి తన మదిలోని భావాలను పంచుకున్నారు. మూడేళ్లుగా తమిళనాడు బీజేపీ అధ్యక్ష సీటులో కూర్చుని ఉన్నానని, ఇందులో కూర్చున్నప్పుడు పలు విషయాలను ఆలోచించే వాడినని వివరించారు. ఈ రాజకీయాలలో ఉండాలా? అవసరమా? అని ఆలోచించడమే కాకుండా, రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే సులభం అని భావించే వాడినని పేర్కొన్నారు. పోలీసు విభాగంలో నలుపు, తెలుపు మాత్రమే ఉంటుందని, నేరం చేశాడా? చేయలేదా? అన్నది కనిపెట్టేయవచ్చ అని అన్నారు.
చివరకు రాజకీయాలలో కొనసాగేందుకు గాను పలు విషయాలలో రాజీ పడక తప్పలేదన్నారు. సాధరణ వ్యక్తిలా వెంటనే ఆగ్రహాన్ని ప్రదర్శించ లేనని, తప్పుగా చిత్రీకరిస్తే ఓపికగా నడచుకోక తప్పలేదని తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేశారు. రాజకీయాలో గెలుపు కోసం ఓపిక గా ఉండడం కన్నా, ప్రయత్నం చేయడం అవశ్యమన్నారు. ప్రజా పయనంలో అనేక సందర్భాలలో నిరుత్సాహం, నిరాశ ఎదురైనా, కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనా, కత్తి పట్టి యుద్ధం చేయలేమని వ్యాఖ్యలు చేశారు.
కొన్ని సందర్భాలలో వెనుకడుగు వేయక తప్పలేదని పేర్కొంటూ, ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా టాప్ గేర్‌లో దూసుకెళ్లాల్సిన అవశ్యం ఏర్పడిందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోయంబత్తూరులో తాను ఓటమి పాలు కాలేదని, 4.5 లక్షల ఓట్లు చేజిక్కించుకోవడం సాధారణం కాదని, ప్రస్తుతానికి గెలుపు కూత వేటు దూరంలో ఆగి ఉందని, ఏదో ఒక రోజు వరించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment