హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన పద్మ అనే మహిళ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సీఐతో సహా ఆరుగురు పోలీసులను సీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారణమైన సీఐ శ్రీకాంత్ , ఎస్సై రుషికేశ్, ఏఎస్సై చాంద్ పాషాలతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఖాజా, ప్రతాప్ , మంజూర్ ఆలీలను సీపీ సస్పెండ్ చేశారు.
ఈ ఘటనపై ఆదివారం పూర్తి విచారణ జరిపిన తరువాత వారిపై చర్యలు తీసుకున్నారు. ఆసిఫ్ నగర్ కు చెందిన పద్మ అనే మహిళను విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధిత మహిళను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసుల విచారణలోనే పోలీస్ స్టేషన్లో పద్మ మృతి చెందిందని.. అనంతరం ఉస్మానియాకు తరలించారని తెలుస్తోంది. అయితే.. పద్మది లాకప్ డెత్ కాదని, సహజ మరణమేనని పోలీసులు వాదించారు. కాగా, ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టిన సీపీ.. దీనికి కారణమైన ఆసిఫ్ నగర్ పోలీసులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.