బాజాప్తా బాత్రూంలో రూ.3 లక్షలు పెట్టిన
జమ్మికుంట ఆడియా లీక్ ఎపిసోడ్‌లో కీలక మలుపు
ఆడియో లీక్.. వీడియో రిలీజ్
విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నేను మీ తమ్ముడిని.. ఇవన్నీ పిట్టకథలు వద్దు... బాజప్తా మీ బాత్రూంలో రూ.3 లక్షలు పెట్టిన.. అని ఆడియో లీక్‌కాగా, మరునాడు సామాజిక కార్యకర్త సదరు సీఐని విచారణ చేయాలంటూ వీడియో విడుదల చేయడం రెండు రోజులుగా జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట టౌన్ సీఐ, సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీతో డబ్బుల విషయంలో మాట్లాడిన సంభాషణ ఆడియో రికార్డు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. సదరు ఆడియోలో ఎస్సీ, ఎస్టీ కేసులో సీఐకి మూడు లక్షల రూపాయలు లంచంగా సీఐ ఛాంబర్‌లోని వాష్‌రూమ్‌లో పెట్టి అందజేసినట్లు ఆడియోలో ఉంది. తాజాగా ఆడియోలో మాట్లాడిన సామాజిక కార్యకర్త షేక్‌సాబీర్ అలీ మరిన్ని వివరాలతో వీడియో విడుదల చేశారు.
ఆ వీడియోలో షేక్‌సాబీర్ అలీ మాట్లాడుతూ.. ‘జెర్రంశెట్టి కృష్ణారావు, గోవిందరెడ్డి, మర్రుతో పాటు ఎస్‌ఆర్‌కే డెయిరీ చైర్మన్ బండారు మాధురి మధ్య ఉన్న వివాదాల్లో మధ్యవర్తిత్వం కోసం కృష్ణారావు నన్ను ఆశ్రయించారు. గత అక్టోబర్ 28 నుంచి 30 వరకు వివాదం పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్‌లో సీఐ రవితో మాట్లాడటం జరిగింది. కృష్ణరావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయొద్దంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితులతో మాట్లాడి రూ.3 లక్షలు తీసుకొచ్చి సీఐ వద్దకు వెళ్లగా, సీఐ ఛాంబర్‌లోని బాత్రూంలోని బకెట్‌లో పెట్టాలని సూచించాడు. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా కృష్ణారావుపైనే కేసు నమోదు చేశాడు’ అని వీడియోలో పేర్కొన్నాడు. దీంతో గత ఏడాది డిసెంబర్ 30న సీఐకి ఫోన్‌చేసి, రూ.3 లక్షలు తీసుకొని బాధితుడిపైనే కేసు ఎలా నమోదు చేస్తారని సూటిగా అడిగిన.
దానికి అతడు తడబడ్డాడు కానీ.. పైసలు తీసుకోలేదని మాత్రం చెప్పలేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు స్పై కెమెరాతో రికార్డు చేశానని చెప్పడంతో నిన్ను నమ్మటం తప్పా అని సీఐ అన్నాడని అందులో చెప్పాడు. తర్వాత ఆరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మారేపల్లి రాజుతో రోడ్డుపై నడిచి వెళ్తుండగా నా మొబైల్‌ను పల్సర్ బైక్‌మీద వచ్చిన ఇద్దరు ప్రైవేట్ యువకులు లాక్కోనిపోయారు. అప్పటికే సదరు ఆడియోను మా మిత్రులకు షేర్‌చేసి చేసిన కాబట్టి ఆ ఆడియోను మీడియాకు లీక్ చేయగలిగాను. గతంలో ఇలా ప్రశ్నించినప్పుడు నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా కేసులు బనాయించే అవకాశం ఉంది. బాధితులను బెదిరించి డబ్బులు ఇవ్వలేదని చెప్పించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు గత ఏడాది అక్టోబర్ 28 నుంచి 30 వరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సదరు వీడియోలో షేక్ సాబీర్ అలీ పేర్కొన్నారు.
పోలీసుల మౌనం వెనక అనుమానాలు
రెండు రోజులుగా జిల్లాలో ఆడియో, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నా... పోలీస్ వర్గాల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం పలుఅనుమానాలకు తావిస్తోంది. మధ్యవర్తి తేదీ, సమయంతో పాటు పూర్తివివరాలు చెబుతుండడం, లీకైన ఆడియోలో సామాజిక కార్యకర్త సీఐను ఏకవచనంతో సంభోదించటం, పదేపదే డబ్బులు ఇచ్చానని చెప్పుతున్నా... సీఐ మాత్రం స్టేషన్‌కి రా మాట్లాడుకుందాం అంటూ సున్నితంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మాట్లాడటం.. నిన్ను నమ్మడం తప్పా అని సీఐ అనటంలో అంతర్యం ఏంటని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఈ జమ్మికుంట ఎపిసోడ్‌లో విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఇలా ఉంటే గురువారం రాత్రి జమ్మికుంట పోలీసులు మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అందులో ఆడియో, వీడియోలోని మాటలను ఖండించకుండా కేవలం సాబీర్ అలీ బ్లాక్‌మెయిలర్, అతడిపై గతంలో చాలా కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొనడం గమనార్హం.
రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలి
జమ్మికుంట పట్టణ సీఐ వరిగంటి రవి అవినీతి తిమింగలంగా మారి రూ.3లక్షలు లంచం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రజల నమ్మకాన్ని దోచుకోవడం దుర్మార్గం. తెలంగాణ డీజీపీ, ఏసీబీ డీజీపీ, కరీంనగర్ సీపీలు ఇలాంటి అవినీతి పురుగులను రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలి. ప్రజల రక్షణ కోసం ఉన్న యూనిఫామ్‌కి మచ్చ తెచ్చే వారిని వదిలిపెట్టవద్దు.
– పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే
షాక్‌కు గురయ్యా
సాబీర్ నా మీద అంత పెద్ద ఆరోపణ చేసేసరికి ఒక్కసారిగా షాక్ తిన్న. అందుకే, కాస్త వెనక్కి తగ్గినట్లు మాట్లాడాను. అతన్ని పట్టుకునేందుకు రప్పిద్దామని అనుకున్నా. సాబీర్‌పై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ ఘటన విషయంలో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాం.
– వి.రవి, జమ్మికుంట టౌన్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment