చెన్నై: తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక వీడియో వెలుగు చూసింది. దీని ప్రకారం పోలీసులు చెప్పిన ఎన్నో విషయాలు అబద్ధమని రుజువవుతోంది. ట్యుటికోరన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో జూన్ 19న వారు నిర్వహించే మొబైల్ దుకాణం ముందు రద్దీ ఉందని, దీంతో వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయగా తండ్రీకొడుకులు ఎదురు తిరిగినట్లు పేర్కొన్నారు. కానీ తాజాగా బయటపడ్డ సీసీటీవీ ఫుటేజీలో దుకాణం ముందు ఎలాంటి రద్దీ లేదు. సాధారణంగా ఫోన్‌లో మాట్లాడుతున్న జయరాజ్ పోలీసులు పిలవడంతో వారి దగ్గరకు వెళ్లాడు. అతని వెనకాలే కొడుకు కూడా వెళ్లాడు. పైగా పోలీసులు అహంకారంతో దురుసుగా మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ వాళ్లు పోలీసులకు సహకరించారే తప్ప ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని సీసీటీవీలో స్పష్టమవుతోంది. అక్కడ ఘర్షణ జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. (వివాదాస్పదమైన తండ్రీ కొడుకుల మృతి)
పోలీసులు బెనిక్స్ తండ్రిని వాహనంలో తీసుకు వెళుతుంటే అతడి కుమారుడు ఆ వాహనాన్ని అనుసరించాడు. సీసీటీవీలో వారు స్వంతంగా గాయపర్చుకున్నట్లు ఎక్కడా కనిపించకపోవడంతో వారికి వారే స్వతాహాగా గాయాలు చేసుకున్నారన్న వాదనలోనూ నిజం లేదని తేలింది. ఇక పోలీస్ స్టేషన్‌కు చేరుకునేసరికి పోలీసులు తన తండ్రిని దారుణంగా కొట్టడాన్ని బెనిక్స్ గమనించాడు. దీంతో అడ్డుకోబోయిన బెనిక్స్‌ను సైతం అదుపులోకి తీసుకుని దారుణంగా హింసించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే తండ్రీకొడుకులిద్దరూ ఒకరి తర్వాత మరొకరు మరణించారు. ఈ ఘటనపై ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా మరో 15 మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. (ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు)
Comments
Please login to add a commentAdd a comment