మీ సేవ కేంద్రంలో దరఖాస్తుదారులు
కరీంనగర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులవృత్తిదారులకు ప్రకటించిన రూ.లక్ష సాయం పొందడానికి వృత్తిదారులు పడరానీపాట్లు పడుతున్నారు. ఒకవైపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తుండగా, మరోవైపు రెవెన్యూ సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ దళారులు దోచుకుంటున్నారు. చేతి, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీల్లోని 15 కులాలకు మొదటి దశలో ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఆయా కులాలకు చెందిన నిరుద్యోగులు, యువకులు దరఖాస్తుల కోసం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నెల 6నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,696 వచ్చాయి. ఈ నెల 20 వరకు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు తెలిపారు.
సర్టిఫికెట్ల జారీలో జాప్యం
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ కార్యాలయాల్లో జాప్యం నెలకొంటుంది. సర్వర్లు పనిచేయకపోవడంతో సర్టిఫికెట్ల జారీలో ఆలస్యమవుతోంది. అంతేకాకుండా కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేక పెద్దసంఖ్యలో దరఖాస్తులు పేరుకపోతున్నాయి. యువకులు, నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు, మీ సేవకేంద్రాల నిర్వాహకులు పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందితో దళారులు సిండికేట్‌గా మారి సర్టిఫికెట్ల దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
మీ సేవ సెంటర్లలో దోపిడీ
రూ.లక్ష సాయం పొందడానికి ముందుగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకే అవకాశం ఉందనే ప్రచారంతో పలువురు యువకులు పెద్దసంఖ్యలో మీ సేవ కేంద్రాలకు తరలివస్తున్నారు. దరఖాస్తుతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రావడంతో నాలుగైదు రోజుల నుంచి మీ సేవ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా కేంద్రాల నిర్వాహకులు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.45 తీసుకోవాల్సి ఉండగా రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా రెండురోజుల్లోనే సర్టిఫికెట్లు తీసుకొస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.500 వరకు దండుకుంటున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని మీసేవ కేంద్రాల్లో ఈ దోపిడీ దందా పెద్దమొత్తంలో సాగుతుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment