
మోదీ సర్టిఫికెట్లు అసలువా, నకిలీవా?
న్యూఢిల్లీ: గతంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని నకిలీ డిగ్రీ వివాదంలో చిక్కుకోగా ఇప్పుడు సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ఆ వివాదంలో చిక్కుకున్నారు. మోదీ చెబుతున్న డిగ్రీ, పీజీ డిగ్రీలు నకిలీవని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకు వారు సమాచార హక్కు దరఖాస్తులను అస్త్రాలుగా చేసుకుంటున్నారు. నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అసలువేనంటూ బీజేపీ సీనియర్ నేతలు సోమవారం నాడు పత్రికా విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ డాక్యుమెంట్లను చూపించినా ఆప్ నేతలు విశ్వసించడం లేదు.
మోదీ డిగ్రీ పట్టా నకిలీదని ఆప్ నేతలు ఆరోపించడానికి కారణం, 1978లో డిల్లీ యూనివర్శిటీ జారీ చేసిన సర్టిఫికెట్‌లో నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ (అసలు పేరు)కి బదులుగా నరేంద్ర మహావీర్ మోదీ అని ఉండడమే. అంతేకాకుండా మార్కు షీట్లకు, సర్టిఫికెట్ పేరుకు కూడా తేడా ఉండడం వారి అనుమానాలకు కారణం అవుతోంది. 1983లో గుజరాత్ యూనివర్శిటీ జారీ చేసిన మోదీ పీజీ పట్టా విషయంలోను ఆప్ నేతలు అనుమానాలను లేవనెత్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పలుసార్లు పోటీ చేసి గెలిచిన నరేంద్ర మోదీ అన్ని అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలోనూ తన విద్యార్హతలను డిగ్రీగానే పేర్కొన్నారు. 2014లో లోక్‌సభకు పోటీ చేసినప్పుడు మాత్రం ఆయన తన విద్యార్హతలను పీజీగా పేర్కొన్నారు. అంతకుముందు ఎందుకు ఆయన పీజీ పట్టాను పేర్కొనలేదన్నది ప్రస్తుతానికి అంతు చిక్కని ప్రశ్న.
ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్టు చెప్పుకుంటున్న మోదీ పీజీ సర్టిఫికెట్‌లో ఆయన ఫస్ట్‌క్లాస్‌లో పాసైనట్లు ఉంది. ఎన్నడూ కాలేజీకి సరిగ్గా హాజరుకాని మోదీకి పొలిటికల్ సైన్స్‌లో అన్ని మార్కులు వచ్చే అవకాశమే లేదని, ఆ సర్టిఫికెట్ నిజం కాకపోవచ్చని ఆయన చదువుకున్నప్పటి ఫాకల్టీ సభ్యుడొకరు ఆరోపించడం ఆప్ నేతల అనుమానాలకు బలం చేకూర్చింది. మోదీ దేశ ప్రధాన మంత్రి అవడానికి విద్యార్హతలు ఏమిటన్నది ఎప్పుడూ సమస్య కాదు. మోదీ నిజం చెబుతున్నారా, అబద్ధం చెబుతున్నారా? అన్న విషయంలో ఆయన నైతికత ఎంత అన్నదే ఇక్కడ ప్రశ్న.
అంతకుముందు ఎన్నికల అఫిడవిట్లలో డిగ్రీ పట్టాను విద్యార్హతగా పేర్కొన్న మోదీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎందుకు పీజీ పట్టాను పేర్కొనాల్సి వచ్చింది. పీజీని తప్పుగా పేర్కొన్నట్లయితే మోదీ ఎన్నికల కమిషన్‌ను తప్పదారి పట్టించినట్లు అవుతుంది. ఒకవేల 1983లో ఫెయిలైన మోదీ లోక్‌సభ ఎన్నికల నాటికి పీజీని పూర్తి చేశారా ? అదే నిజమైతే సర్టిఫికెట్‌లో పాసైన తీదీ తాజాదై ఉండాలి. మరి అలా లేదే. ఈ అనుమానాలన్నింటినీ తీర్చాల్సింది స్వయంగా మోదీనే.