
ఆమె ఓ మధ్య తరగతి గృహిణి. బొటాబొటిగా ఉండే సంపాదనతో కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సాయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఏదైనా ప్రభుత్వ పథకం అందితే తమ కుటుంబానికి భరోసాగా ఉంటుందని విశాఖ జ్ఞానాపురానికి చెందిన సంతోష్‌కుమారి ఆశ. కానీ ఆమెకు చాలా కాలంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు.
ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. ఇంక విసుగొచ్చేసింది. దాంతో ఆ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేయడమే మానేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ‘జగనన్న సురక్ష’ ద్వారా ఎవరికి ఏం కావాలన్నా ప్రభుత్వం మంజూరు చేస్తుందని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పారు. గతంలో ధ్రువీకరణ పత్రాలు కోసం తాను పడ్డ కష్టాలు వారికి తెలిపింది.
వెంటనే వారు వివరాలు అడిగారు. వివరాలన్నీ ఇచ్చి.. ఇప్పుడు కూడా ఆ ధ్రువీకరణ పత్రాలు రావులే అని భావించింది. అయితే రోజుల వ్యవధిలోనే ఆమెకు ఫోన్ వచ్చింది. ‘రేపు సురక్ష క్యాంపు ఉంది. మీ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నాయి తీసుకెళ్లండి’ అని ఆ ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. తొలుత నమ్మలేకపోయింది. తర్వాత రోజు క్యాంపునకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుని మురిసిపోయింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏళ్ల తరబడి లేనిది వారం రోజుల్లో ఎలా వచ్చేస్తాయని అనుకున్నాను. క్యాంపులో పాల్గొన్నాను. నా పేరు పిలిచి.. నాకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇచ్చారు. విసుగొచ్చేలా తిరిగినా రానివి పైసా ఖర్చు లేకుండా రావడం నిజంగా మాలాంటి వారికి ఒక పెద్ద వరమనే చెప్పుకోవాలి.
జగనన్న ప్రభుత్వంలో ప్రతి పని ఇంటి తలుపు ముంగిటే జరుగుతుందని అందరూ అంటే.. ఏదో అనుకున్నాను. నాకూ అలా జరగడంతో.. ప్రజలంతా జగనన్నని సీఎంగా కాకుండా కుటుంబ సభ్యుడిగా ఎందుకు చూస్తారో ఇప్పుడు అర్థమైంది’’ అని
ఆనందం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment