సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిసున్న జగనన్న సురక్ష ప్రత్యేక శిబిరాల్లో బుధవారం వరకు విద్యార్థులకు వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ సహా మొత్తం 30,98,697 వినతులను అక్కడికక్కడే అధికారులు పరిష్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన వారు మిగిలిపోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా ఇంటింటా జల్లెడపడుతూ సర్వే నిర్వహించి, వారికీ పథకాలు అందజేసేందుకు జగనన్న సురక్ష పేరుతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
పాఠశాల విద్య నుంచి పీహెచ్‌డీ వంటి వాటివరకు వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరిగే ఈ సమయంలో విద్యార్థులకు అవసరమయ్యే ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల నుంచి తీసుకునే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ శిబిరాల్లో అప్పటికప్పుడే సర్విసు చార్జీలు లేకుండా అందజేస్తున్నారు. జూలై 1న మొదలు పెట్టిన ఈ శిబిరాలు సచివాలయాల వారీగా ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఇప్పటివరకు.. ఆదివారాలు మినహా 10 రోజులు 6,997 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఈ శిబిరాలు నిర్వహించినట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అధికారులు వెల్లడించారు. ఈ శిబిరాల్లో మొత్తం 34,39,585 సర్విసులకు సంబంధించి అధికారులకు వినతులు అందాయని తెలిపారు. వాటిలో 90 శాతానికిపైగా.. 30.98 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కారించారని పేర్కొన్నారు. వీటిలో హౌస్‌హోల్డు జాబితాలో మార్పులు–చేర్పులతో పాటు విద్యార్థులకు ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీ, కౌలు రైతులకు సీసీఆర్‌సీల జారీ వంటివి పెద్దసంఖ్యలో ఉన్నట్టు వివరించారు.
ఒక్కరోజే.. 5,54,009 వినతుల పరిష్కారం
ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాల్లో మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 5,54,009 వినతులను అధికారులు పరిష్కరించారు. బుధవారం 573 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద జరిగిన శిబిరాల్లో 2,44,582 మంది వినతులు పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment