సాక్షి, అమరావతి: ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తక్షణమే తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష క్యాంపుల్లో ఇప్పటివరకు 10.86 లక్షల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయి. వీటిని ప్రజల నుంచి వినతులు అందిన వెంటనే అప్పటికప్పుడే.. అక్కడికక్కడే పరిష్కరించారు. రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
నాలుగు రోజుల్లో బుధవారం వరకు మొత్తం 10,86,727 వినతులను అప్పటికప్పుడే, అక్కడికక్కడే క్యాంపుల్లో అధికారులు పరిష్కరించారు. ప్రతి సంక్షేమ పథకం, ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల మంజూరు వంటివాటికి సంబంధించిన అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వలంటీర్ల ఆధ్వర్యంలో ఇంటింటా అర్హులను జల్లెడ పట్టి.. వారికి ఆయా సేవలను అందజేస్తోంది.
సచివాలయాలవారీగా 31 వరకు నిర్వహణ..
అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శనివారం (జూలై 1) నుంచి మొదలుపెట్టి ఈ నెల 31 వరకు ప్రభుత్వం క్యాంపులు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు.. 1వ తేదీన 1,305 సచివాలయాల వద్ద, 3న 387 సచివాలయాల వద్ద, 4న 1,022 సచివాలయాల వద్ద, 5 (బుధవారం)న మరో 625 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తయినట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు.
దాదాపు 36.30 లక్షల కుటుంబాలు నివాసం ఉండే పరిధిలో మొత్తం 3,339 సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణ పూర్తయినట్టు తెలిపారు. ఈ సచివాలయాల పరిధిలో జరిగిన క్యాంపుల్లో వివిధ రకాల సమస్యలపై 13.10 లక్షల వినతులు అందాయి. ఇందులో 80 శాతానికి పైగా అంటే 10,86,727 వినతులను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించారు.
వీటిలో హౌస్ హోల్డ్ లిస్టులో మార్పులుచేర్పులతోపాటు విద్యార్థులకు సంబంధించి ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డుల జారీ వంటివి ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటిదాకా జరిగిన క్యాంపుల్లో అందిన వినతుల్లో ఇంకా 2.22 లక్షలు పరిష్కరించాల్సి ఉందన్నారు. అవి కూడా ఆయా శాఖల అధికారుల పరిశీలనలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment