certification documents
-
జగనన్న సురక్ష: ఇక రావనుకున్న సర్టిఫికెట్లు వచ్చాయి
ఆమె ఓ మధ్య తరగతి గృహిణి. బొటాబొటిగా ఉండే సంపాదనతో కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సాయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఏదైనా ప్రభుత్వ పథకం అందితే తమ కుటుంబానికి భరోసాగా ఉంటుందని విశాఖ జ్ఞానాపురానికి చెందిన సంతోష్‌కుమారి ఆశ. కానీ ఆమెకు చాలా కాలంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. ఇంక విసుగొచ్చేసింది. దాంతో ఆ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేయడమే మానేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ‘జగనన్న సురక్ష’ ద్వారా ఎవరికి ఏం కావాలన్నా ప్రభుత్వం మంజూరు చేస్తుందని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పారు. గతంలో ధ్రువీకరణ పత్రాలు కోసం తాను పడ్డ కష్టాలు వారికి తెలిపింది. వెంటనే వారు వివరాలు అడిగారు. వివరాలన్నీ ఇచ్చి.. ఇప్పుడు కూడా ఆ ధ్రువీకరణ పత్రాలు రావులే అని భావించింది. అయితే రోజుల వ్యవధిలోనే ఆమెకు ఫోన్ వచ్చింది. ‘రేపు సురక్ష క్యాంపు ఉంది. మీ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నాయి తీసుకెళ్లండి’ అని ఆ ఫోన్లో సమాచారం ఇచ్చారు. తొలుత నమ్మలేకపోయింది. తర్వాత రోజు క్యాంపునకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుని మురిసిపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏళ్ల తరబడి లేనిది వారం రోజుల్లో ఎలా వచ్చేస్తాయని అనుకున్నాను. క్యాంపులో పాల్గొన్నాను. నా పేరు పిలిచి.. నాకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇచ్చారు. విసుగొచ్చేలా తిరిగినా రానివి పైసా ఖర్చు లేకుండా రావడం నిజంగా మాలాంటి వారికి ఒక పెద్ద వరమనే చెప్పుకోవాలి. జగనన్న ప్రభుత్వంలో ప్రతి పని ఇంటి తలుపు ముంగిటే జరుగుతుందని అందరూ అంటే.. ఏదో అనుకున్నాను. నాకూ అలా జరగడంతో.. ప్రజలంతా జగనన్నని సీఎంగా కాకుండా కుటుంబ సభ్యుడిగా ఎందుకు చూస్తారో ఇప్పుడు అర్థమైంది’’ అని ఆనందం వ్యక్తం చేసింది. -
ఆ విద్యార్థికి న్యాయం చేస్తాం..
అనకాపల్లి : ‘పట్టా వృథా .. పదేళ్ల వ్యథ ’ శీర్షికతో గురువారం సాక్షిలో వచ్చిన కథనం కలకలం సృష్టించింది. మండలంలోని భట్లపూడి గొలగాం దరి ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన ఇండో అమెరికన్ అకాడమిలో ఎందరో విద్యార్థులు వివిధ కోర్స్ల నిమిత్తం విద్యాభ్యాసం చేసి ఇబ్బందులు ఎదుర్కొన్న వైనం సాక్షి వెలుగులోకి తెచ్చింది. అల్మెడ అనే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఈ అకాడమిలో పలు కోర్స్‌లు చేసిన విద్యార్థులకు అందించిన ధ్రువీకరణ పత్రాలు ఇపుడు అక్కరకు రాకుండా పోయాయని తేలిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడాలని ఆశపడి ఈ అకాడమి పేరిట వచ్చిన ప్రకటనను చూసి లక్షలు చెల్లించిన గుంటూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అజయ్‌కు ఒరిజనల్ పట్టా ఇవ్వకపోవడంతో ఉద్యోగం ఇచ్చిన సంస్థతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో చేరిన అజయ్ సమర్పించిన అల్మెడ అనుబంధ డిగ్రీ పనికిరాదని తేల్చడంతో ఆ సంస్థ కూడా ఉద్యోగం నుంచి తొలగించింది. ఇపుడు కేరీర్‌ను కోల్పోయిన అజయ్ తీవ్ర వేదనలో మునిగితేలిన వైనాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఎందరో విద్యార్థులు తనలా మోసపోయారని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. ఇంకా అనేక వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అకాడమీ మూసివేత? పదేళ్ల క్రితం ప్రారంభమైన ఇండో అమెరికన్ కళాశాల అకాడమిలో అడ్మిషన్లు దాదాపు నిలిపివేశారు. ప్రారంభంలో మెకానికల్, సివిల్, ఈసీఈ వంటి కోర్సుల్లో 150 మంది విద్యార్థులు చేరారు. తర్వాత ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు తగ్గడంతో ప్రస్తుతం కళాశాల పరిసరాల్లో బోర్డులను తొలగించారు. ఇండో అమెరికన్ అకాడమికి అనుబంధంగా ఒక స్వచ్ఛంద సంస్థ పేరిట సేకరించిన భూమి విక్రయం విషయంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు జరుపుతాం సాక్షిలో వచ్చిన కథనం చూశాం. గతంలో సదరు విద్యార్థి నష్టపోయానని చెప్పి మమ్మల్ని ఆశ్రయించారు. రెండు రోజుల్లో అకాడమి వద్దకు వెళ్లి దర్యాప్తు చేస్తాం. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తాం. తప్పు చేసినట్టు నిరూపణ అయితే చర్యలు తప్పవు.– సీఐ రామచంద్రరావు -
మొబైల్ కనెక్షన్.. 2 నిమిషాల్లో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కొత్తగా సిమ్ కావాలంటే ఫొటో, సరైన ధ్రువీకరణ పత్రాలు కావాల్సిందే. టెలికం కంపెనీకి చెందిన ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌కు వెళ్లినట్టయితే ఒకట్రెండు రోజుల్లో సిమ్ యాక్టివేట్ అవుతుంది. అదే చిన్న ఏజెంట్ల దగ్గరికెళితే అదనంగా మరో రోజు వేచి చూడాల్సిందే. ఇలాంటి ఆలస్యానికి, పత్రాలకు చెక్ పెడుతూ టెలికం కంపెనీలు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) విధానాన్ని అమలు చేస్తున్నాయి. టెలికం కంపెనీ ఔట్‌లెట్‌కు కేవలం ఆధార్ కార్డును తీసుకెళితే చాలు. రెండు మూడు నిమిషాల్లోనే సిమ్ యాక్టివేట్ చేస్తారు. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఈ-కేవైసీని ఇప్పటికే అమలులోకి పెట్టాయి. టెలినార్ పైలట్ ప్రాజెక్టును పూర్తి చేసి అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అయింది. ఈ-కేవైసీ అమలుతో దేశంలోని బ్యాంకులు, టెలికం కంపెనీలు రానున్న అయిదేళ్లలో రూ.10,000 కోట్లు ఆదా చేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇలా పనిచేస్తుంది.. ఎలక్ట్రానిక్ విధానంలో ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడమే ఈ-కేవైసీ. టెలికం ఔట్‌లెట్‌కు కస్టమర్లు ఎటువంటి ఫొటో కాపీలు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఔట్లెట్లో ఉన్న సిబ్బందికి కస్టమర్ తన ఆధార్ కార్డు నంబరు ఇవ్వాలి. పాయింట్ ఆఫ్ సేల్‌గా వినియోగిస్తున్న ప్రత్యేక ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్‌ఫోన్‌లో ఈ నంబరును టైప్ చేయగానే కస్టమర్ వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. మరో పరికరంలో కస్టమర్ తన వేలి ముద్ర ఇవ్వాలి. ఆధార్ వివరాలతో వేలి ముద్ర సరితూగగానే ధ్రువీకరణ పూర్తి అవుతుంది. మొత్తంగా 2-3 నిమిషాల్లోనే సిమ్ యాక్టివేషన్ పూర్తి కావడం విశేషం. ఈ విధానంలో సిమ్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు లోనయ్యే అవకాశమే లేదు. రిటైలర్లకు పనిభారం తగ్గుతుంది. మొబైల్ రిటైల్ చైన్ సంస్థలైన బిగ్ సి, లాట్ మొబైల్స్‌లు తమ స్టోర్లలో జియో కస్టమర్ల కోసం ఈ-కేవైసీని అమలులోకి తెచ్చాయి. పక్కదారి పట్టదు.. ఇప్పటి వరకు ఉన్న సిమ్ యాక్టివేషన్ విధానంలో పారదర్శకత లోపించింది. ఒకరి పేరుతో మరొకరికి సిమ్‌లు ఇచ్చిన సంఘటనలు కేవలం పలు పోలీసు కేసులు నమోదైన ఘటనల్లోనే బయటపడుతున్నాయి. అదేవిధంగా తప్పుడు పత్రాలతో సిమ్‌లు తీసుకున్నా నిరోధించే వ్యవస్థ లేదు. ప్రస్తుత ఈ-కేవైసీ విధానంలో సిమ్ల జారీ పక్కదారి పట్టే అవకాశమే లేదు. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను సరిచూసుకున్నాకే మొబైల్ సిమ్‌ను యాక్టివేట్ చేస్తారు. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం పూర్తిగా భద్రంగా ఉంటుంది. భారీగా తగ్గనున్న వ్యయం.. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం ఈ-కేవైసీ అమలుతో దేశంలోని బ్యాంకులు, టెలికం కంపెనీలు రానున్న అయిదేళ్లలో రూ.10,000 కోట్లు ఆదా చేస్తాయి. పాత విధానంలో ప్రతి కొత్త కనెక్షన్‌కు టెలికం కంపెనీలు టాప్ మెట్రోల్లో సుమారు రూ.145-175 దాకా ఖర్చు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జూలై నాటికి 78 కోట్ల జీఎస్ఎం కనెక్షన్లు ఉన్నాయి. జూన్‌లో 35 లక్షలు, జూలైలో 20 లక్షల పైచిలుకు కొత్త కస్టమర్లు నమోదయ్యారు. అంటే ఏ స్థాయిలో కంపెనీలకు వ్యయం అవుతుందో ఇట్టే ఊహించవచ్చు. రిటైలర్ల నుంచి యాక్టివేషన్ కేంద్రాలకు దరఖాస్తుల రవాణా, ఉద్యోగుల వ్యయం కంపెనీలకు ఇక నుంచి ఉండదు. అటు కస్టమర్‌కు సైతం ధ్రువీకరణ పత్రాల ఖర్చు ఉండదు. ఇక డిజిటల్ ఇండియా లక్ష్యానికి ఈ-కేవైసీ మద్దతు ఇస్తుందని ఎయిర్టెల్ ఇండియా సీఈవో గోపాల్ విట్టల్ వ్యాఖ్యానించారు. -
తహశీల్దార్లు కరువు
ఏడాది కాలంగా ఇన్‌చార్జులదే పాలన కుప్పలు తె ప్పలుగా పేరుకుపోయిన ఫైళ్లు ఆఫీసుల చుట్టూ తిరగలేక అల్లాడుతున్న ప్రజానీకం జిల్లాలో రెవెన్యూ సేవలు మందగిస్తున్నాయి. మండలాల్లో ప్రజలకు సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందడం లేదు. భూ సర్వేలు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, అడంగళ్ల నమోదు, మీ భూమి.. వంటి పనుల్లో తీవ్రమైన జాప్యం కనిపిస్తోంది. జనం పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి దస్త్రాలకే పరిమితమవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ఫైళ్లకు వారాల తరబడి మోక్షం లభించడం లేదు. జిల్లా, మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగలేక జనం అల్లాడిపోతున్నారు. సమస్యను పట్టించుకుని పరిష్కరించాల్సిన జిల్లా పాలనా యంత్రాంగం నిత్యం సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో మునిగి తేలుతోంది. తిరుపతి: జిల్లాలోని ఆరు మండలాలకు రెగ్యులర్ తహశీల్దార్లు లేరు. ఏడాది కాలంగా ఇక్కడ ఇన్చార్జి తహశీల్దార్లే విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 8 మండలాల్లో సర్వేయర్లు కరువు. అంతేకాకుండా మరో ఆరుచోట్ల డిప్యూటీ తహశీల్దార్లు కూడా లేకుండా పోయారు. చిత్తూరు తహశీల్దార్‌గా పనిచేసే శివకుమార్‌ను ఏడు నెలల కిందట బదిలీ చేయడంతో ఆర్డీవో ఆఫీస్‌లో ఏవోగా పనిచేస్తోన్న అరుణ్‌కుమార్‌ను ఇన్చార్జి తహశీల్దార్‌గా నియమించారు. అటు ఏవో బాధ్యతల్లోనూ, ఇటు ఇన్చార్జి తహశీల్దార్గానూ అరుణ్‌కుమార్ సేవలందించాల్సి వస్తోంది. పనిఒత్తిడి పెరగడంతో ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యం నెలకొంటుంది. ఏర్పేడు తహశీల్దార్ లక్ష్మీనరసయ్యను రెండు నెలల కిందట కలెక్టర్ ఆఫీస్‌కు బదిలీ చేయడంతో రేణిగుంట తహశీల్దార్ మనోహర్‌కు ఏర్పేడు మండల బాధ్యతలు కూడా అప్పగించారు. అప్పటినుంచి అటు రేణిగుంట, ఇటు ఏర్పేడు మండలాల రైతులకు ఇక్కట్లు మొదలయ్యాయి. వెదురుకుప్పం తహశీల్దార్ ఇంద్రసేనను ఏడాది కిందట సస్పెండ్ చేసిన ప్రభుత్వం అప్పటినుంచి పెనుమూరు తహశీల్దార్ మునిరత్నంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. సత్యవేడు మండలానికి కూడా ఏడాది కాలంగా రెగ్యులర్ తహశీల్దార్ లేరు. ఏడాది కిందట ఇక్కడి తహశీల్దార్ అనారోగ్యంతో చనిపోవడంతో వరదయ్యపాళెం తహశీల్దార్ బాబూరాజేంద్రప్రసాద్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. సేవల్లో ఎడతెగని జాప్యం సాధారణంగా అటు జిల్లా కేంద్రాల్లో, ఇటు మండల కేంద్రాల్లో పాలనపరంగా రెవెన్యూ అధికారులదే కీలకపాత్ర. పౌరసరఫరాల విభాగంలోని రేషన్ దుకాణాల పర్యవేక్షణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, వ్యవసాయభూముల అడంగళ్లు, వాటికి సంబంధించిన రికార్డుల పర్యవేక్షణ, పట్టాదారుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ పంపిణీ, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి పనులన్నింటికీ మండలాల్లో పర్యవేక్షణాధికారి తహశీల్దారే. స్కూళ్లు, కళాశాలు, హాస్టళ్లు తెరిచే రోజులు దగ్గర పడటంతో జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం నిత్యం ఎంతోమంది కార్యాయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇన్చార్జుల ఏలుబడిలో ఉన్న మండలాల్లో మాత్రం సర్టిఫికెట్ల జారీ, భూ సంబంధ సమస్యల పరిష్కారం, భూముల సర్వే వంటి పనులన్నీ వెనకబడ్డాయి. భూ సర్వేల కోసం రైతులు పెట్టుకున్న అర్జీలు పెద్దఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి. సర్వేయర్లు దొరక్క రైతులు తలలు పట్టుకుంటున్నారు. అటు చిత్తూరు, ఇటు తిరుపతి రెవెన్యూ కార్యాలయాల్లోనూ ఫైళ్లు నెలల తరబడి క్లియరెన్సుకు నోచుకోవడం లేదు. తిరుపతిలోని ప్రొటోకాల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని ప్రభుత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, మేజిస్ట్రేట్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వంటి వారు తిరుపతి వచ్చినపుడు వీరికి ప్రొటోకాల్ సేవలందించే అధికారి లేక స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు కల్పించకపోవడం, లూప్‌లైన్లలో ఉన్న తహశీల్దార్లకు అవకాశం కల్పించకపోవడం వంటి కారణాల వల్ల కొన్ని మండలాలు ఇన్చార్జిల చేతుల్లోనే ఉన్నాయి. జనం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా సమస్యను పరిష్కరించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
కాసులిస్తే సరి!
వాహన ధ్రువీకరణ పత్రాలను పట్టించుకోని వైనం కాంట్రాక్ట్ క్యారియర్ అనుమతితో స్టేజ్ క్యారియర్లు అన్నీ తెలిసి పట్టించుకోని రవాణా శాఖ అధికారులు జిల్లాలో 417 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నల్లకుంట బస్సు ప్రమాద ఘటనతో వ్యవహారం తెరపైకి విజయవాడ : రవాణా శాఖలో కావాల్సిన సేవకు దరఖాస్తు చేసి.. దానికి పచ్చనోట్లు జతచేస్తే చాలు.. ఎలాంటి పనైనా ఇట్టే అయిపోతుంది. అవసరమైన పూర్తి వివరాలు, వాహన సామర్థ్యం, డాక్యుమెంట్లతో పనిలేదు. ఇలా అడ్డగోలుగా ప్రైవేట్ బస్సులకు అనుమతులిస్తున్న రవాణా శాఖ అధికారులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాంట్రాక్ట్ క్యారియర్ పేరుతో పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు పదుల సంఖ్యలో స్టేజ్ క్యారియర్లుగా రాకపోకలు సాగిస్తున్నా కాసుల మత్తులో రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు రోజుల కిందట గొల్లపూడి సమీపంలో నల్లకుంట వద్ద చెట్టును బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు వైద్య విద్యార్థులు, బస్సు డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవాణా శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా శాఖలో అనేక నిబంధనలు ఉన్నాయి. అయితే ప్రతి నిబంధనకూ ప్రత్యామ్నాయం కూడా ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు ప్రత్యామ్నాయాన్నే అవకాశంగా మలుచుకొంటున్నారు. ఇందుకు రవాణా శాఖ అధికారులకు ఎంతో కొంత ముట్టజెబుతున్నారు. ప్రధానంగా వెహికల్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని అంశాలను సక్రమంగా పరిగణలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నల్లకుంట వద్ద జరిగిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనతో ఇది తేటతెల్లమయింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ధనుం జయ ట్రావెల్స్ నిర్వాహకులు కొనేళ్ల క్రితం ట్రావెల్ వ్యాపారం నుంచి బయటకు వచ్చి బస్సులను పలువురికి విక్రయించారు. ప్రమాదం జరిగిన బస్సును హైదరాబాద్‌కు చెందిన ఒమర్ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. అయితే బస్సును ఆ సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ట్రావెల్స్ కంపెనీ పేరును రవాణా శాఖ రికార్డుల్లో మార్చలేదు. బస్సుపైనా ట్రావెల్స్ కంపెనీ పేరు మార్చలేదు. ఇలాంటి ఘటనలు జిల్లాలోనూ ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 6,51,905 వాహనాలకు సంబంధించి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి పేరుతో ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో అత్యధికంగా 4.36 లక్షల ద్విచక్ర వాహనాలు పేరు మార్పు బదలాయింపులు జరిగాయి. 26 వేల ఆటోలు, 29 వేల గూడ్స్ క్యారియర్లు, 58 వేల కార్లు, 1200 టాక్సీ క్యాబ్‌లు ట్రాన్స్ఫర్లు జరిగాయి. సాధారణంగా జిల్లాలో లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్లు అధికంగా జరుగుతున్నాయి. జిల్లాలో 410 ట్రావెల్ బస్సులు జిల్లాలో మొత్తం 410 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఉన్నాయి. 410 బస్సులు కాంటాక్ట్ క్యారియర్లుగా పర్మిట్లు పొంది విజయవాడ నుంచి రాష్ట్రంతో పాటు, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు 21 బస్సులు స్టేజ్ క్యారియర్ పర్మిట్లు పొంది రాకపోకలు సాగిస్తున్నాయి. కాంట్రాక్ట్ క్యారియర్ అంటే విజయవాడ నుంచి బెంగళూరుకు అనుమతి తీసుకొని రుసుం చెల్లిస్తే విజయవాడలో బయలుదేరే బస్సు మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకోకుండా నేరుగా గమ్యస్థానం చేరుకోవాలి. అయితే అత్యధికశాతం కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులు అనేక చోట్ల ఆగిమరీ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని అధికారులకు తెలిసినా రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్లతో మాట్లాడలేని పరి స్థితి. మరోవైపు జిల్లాలో ఇప్పటి వరకు 425 కాంటాక్ట్ క్యారియర్ బస్సులు ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరో 1821 స్టేజ్ క్యారియర్ బస్సులు ట్రాన్స్ఫర్ రిజిస్టేషన్లు జరిగాయి. -
సంతకం.. సంకటం
విజయవాడలో ‘ఫోర్జరీ ముఠా’ రెవెన్యూ వర్గాల్లో కలవరం రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడ సిటీ : నగరంలో ఫోర్జరీ ముఠాల కార్యకలాపాలు అధికమయ్యాయి. రెవెన్యూ.. రవాణా.. శాఖ ఏదైనా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ స్టాంపులతో బురిడీ కొట్టిస్తున్నారు. కీలక శాఖల్లో ఫోర్జరీ సంతకాలతో ధ్రువీకరణ పత్రాల తయారీ వ్యవహారం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. విచారణ కోసం వచ్చే ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో ఇవి వెలుగుచూస్తున్నాయి. రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక, లంచాల కోసం కొందరు సిబ్బంది వేధింపులు భరించలేక.. అమాయకులు ఫోర్జరీ ముఠాల బారిన పడుతున్నారు. నగరపాలక సంస్థ మంజూరు చేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలు రెవెన్యూ శాఖ జారీచేసే కుటుంబ ధ్రువీకరణ పత్రాలు, అడంగల్ కాపీలు, రవాణా శాఖ జారీచేసే వాహనాల సి-బుక్కులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే బీమా పత్రాలు, భూముల రిజిస్ట్రేషన్లు.. ఇలా ఏ ఒక్కదాన్నీ ఈ ఫోర్జరీ ముఠాలు వదలడం లేదు. ఆయా ధ్రువీకరణ పత్రాలు కావాల్సినవారిని తమ ఏజెంట్ల ద్వారా గుర్తించి నకిలీవి అంటగడుతున్నారు. అప్పటికప్పుడు పని జరిగిపోతుండడంతో ఈ ముఠాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నవారు మిన్నుకుండిపోతున్నారు. సిబ్బంది సహకారం విజయవాడలో పెద్ద సంఖ్యలో ఫోర్జరీ సంతకాల ముఠాలు ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం. వీరికి కొన్ని ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది సహకారం ఉంది. ఉన్నతాధికారుల సంతకాలను వీరు ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారుచేస్తున్నారు. ఆయా కార్యాలయాల ముద్ర (రబ్బర్ స్టాంపు)లను కూడా వీరు తయారుచేయించి ఉపయోగిస్తున్నారు. ఇందుకు ఆయా ప్రభుత్వ శాఖల్లోని కొందరు సిబ్బంది సహకారం కూడా ఉన్నట్లు వినికిడి. ఉన్నతాధికారుల నమూనా సంతకాలను అందజేయడంతోపాటు తమ సంస్థ ఉపయోగించే ముద్రల వివరాలను కూడా ఈ ముఠాల సభ్యులకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు భారీగానే ప్రతిఫలం పొందుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం విజయవాడను రాజధానిగా చేస్తారని ప్రచారం జరగడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భారీగా కొనుగోళ్లు, అమ్మకాలకు రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో ఫోర్జరీ ముఠాలు రంగప్రవేశం చేసి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు తయారుచేసే అవకాశం ఉందనే ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈ తరహా మోసాలు భారీగా జరిగేవి. ఇప్పుడీ ముఠాల దృష్టి నగరంపై పడినట్లు తెలుస్తోంది. కూపీ లాగుతున్న పోలీసులు ఫోర్జరీ ముఠాల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. తాజాగా కిడ్నీ దానం కోసం తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కుటుంబ ధ్రువీకరణ పత్రం తయారు చేశారంటూ అర్బన్ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల కిందట కూడా కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో ఇదే తరహా మోసం జరిగింది. అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మూడు నెలల కిందట టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ బీమా పత్రాలు తయారు చేసి చెలామణి చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. చిట్టినగర్‌కు చెందిన ఆ యువకుడు నకిలీ బీమా పత్రాలు తయారు చేసి ఆయా కంపెనీల ముద్రలను కూడా వేసి సొమ్ము చేసుకున్నాడు. గత ఏడాది చివర్లో గాంధీనగర్ కేంద్రంగా ఫోర్జరీ సంతకాలతో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు తయారు చేసిన ముఠా సభ్యులను రిజిస్ట్రార్ ఫిర్యాదుతో గవర్నరుపేట పోలీసులు అరెస్టు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ముఠాల ఆచూకీపై నిఘా వర్గాలు దృష్టిసారించాయి. జి.కొండూరు మండల తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పాస్‌పుస్తకాలు పొందిన ముగ్గురిని కూడా అరెస్ట్‌చేశారు. -
ఉత్కంఠ
సీఈటీ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఎనిమిదో రోజైన మంగళవారం ప్రశాంతంగా కొనసాగింది. బెంగళూరులోని మల్లేశ్వరం సీఈటీ సెల్లో 33,001 నుంచి 40,000 వరకు ర్యాంకులను పొందిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఉదయం 9గంటలకు ప్రారంభమైన పరిశీలన కార్యక్రమం సాయంత్రం 6.30గంటల వరకు కొనసాగింది. - సాక్షి, బెంగళూరు -
ఉద్యోగుల ‘స్థానిక’ యుద్ధం!
- తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారని తెలంగాణ సంఘాల ఆరోపణ - నిరూపించాలని సీమాంధ్ర ఉద్యోగుల సవాల్ సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ఉద్యోగుల స్థానికత నిర్ధారణ అంశం తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. సచివాలయంలోని 1,865 మంది ఉద్యోగుల్లో 1,059 మందిని సీమాంధ్ర, 806 మందిని తెలంగాణ ఉద్యోగులుగా నిర్ధారిస్తూ మంగళవారం ప్రభుత్వం జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యోగులుగా పేర్కొంటున్న 806లో 181 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి తెలంగాణ స్థానికతను చూపించుకున్నారని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు వివరాలను అధ్యక్షుడు నరేందర్‌రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ప్రభుత్వానికి నివేదించింది.మరోవైపు... పలువురు ఉద్యోగులు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు చేయడం సరికాదని, దాన్ని నిరూపించాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ సవాల్ చేశారు. సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్నారనే వాదనలో వాస్తవం లేదని వెల్లడవడంతో.. తప్పుడు ధ్రువపత్రాల వాదనను తెలంగాణ నేతలు తెరమీదకు తెచ్చారని విమర్శించారు. కాగా... 12 మంది ఆంధ్రా ఉద్యోగులు తమను పొరపాటుగా తెలంగాణలో చూపించారని, ఐదుగురు తెలంగాణ ఉద్యోగులు తమను ఆంధ్రా జాబితాలో సూచించారని జీఏడీ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలనకు 10 బృందాలు... ఉద్యోగ సంఘాల డిమాండ్ నేపథ్యంలో... ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను పరిశీలించి స్థానికతను నిర్ధారించడానికి ఇద్దరేసి సభ్యులున్న 10 బృందాలను సాధారణ పరిపాలన శాఖ ఏర్పాటుచేసింది. ఈ బృందాలు గురువారం నుంచి పనిచేయడం ప్రారంభించి.. రెండు రోజుల్లో నివేదికలు అందజేస్తాయి. వాటి ఆధారంగా స్థానికతలో జరిగిన పొరపాట్లను గుర్తించి సరిచేస్తారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల జాబితా వెల్లడి ఆర్థిక శాఖలో పనిచేస్తున్న 278 మంది స్థానికతను నిర్ధారిస్తూ జాబితాను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అందులో 114 మంది ఆంధ్రా, 164 మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది. అయితే క్లాస్-3, 4 ఉద్యోగులను కూడా ఈ జాబితాలో చేర్చడంతో.. తెలంగాణ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా క్లాస్-3, 4 కేటగిరీ ఉద్యోగుల్లో 95 శాతం మంది తెలంగాణ వారే ఉంటారు. పీఆర్, ఆర్డీ శాఖల్లో విభజన పూర్తి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి(పీఆర్, ఆర్డీ) శాఖల్లో విభజన ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు శాఖల్లో కార్యదర్శుల నుంచి దిగువస్థాయిలో ఉండే ఉద్యోగుల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సిబ్బంది సంఖ్యను ఖరారు చేశారు. దీనికి అపెక్స్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలను విలీనం చేయాలని నిర్ణయించింది. పీఆర్, ఆర్డీ కమిషనరేట్లను విలీనం చేసి ‘పీఆర్ అండ్ ఆర్డీ’గా చేయాలని నిర్ణయించారు. ఇద్దరు కమిషనర్లను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. సెర్ప్‌ను కూడా రెండుగా విభజించాలని నిర్ణయించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను ఇరు రాష్ట్రాలకు ఒక్కొక్కరిగా పంపిణీ చేస్తారు. ఈ రెండు శాఖలకు సంబంధించి మొత్తం 40 కేటగిరీల్లో 209 మంది ఉద్యోగులు ఉంటే.. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు 119 మందిని, తెలంగాణకు 90 మంది ఉద్యోగులను కేటాయించారు.