వాహన ధ్రువీకరణ పత్రాలను పట్టించుకోని వైనం
కాంట్రాక్ట్ క్యారియర్ అనుమతితో స్టేజ్ క్యారియర్లు
అన్నీ తెలిసి పట్టించుకోని రవాణా శాఖ అధికారులు
జిల్లాలో 417 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు
నల్లకుంట బస్సు ప్రమాద ఘటనతో వ్యవహారం తెరపైకి
విజయవాడ : రవాణా శాఖలో కావాల్సిన సేవకు దరఖాస్తు చేసి.. దానికి పచ్చనోట్లు జతచేస్తే చాలు.. ఎలాంటి పనైనా ఇట్టే అయిపోతుంది. అవసరమైన పూర్తి వివరాలు, వాహన సామర్థ్యం, డాక్యుమెంట్లతో పనిలేదు. ఇలా అడ్డగోలుగా ప్రైవేట్ బస్సులకు అనుమతులిస్తున్న రవాణా శాఖ అధికారులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాంట్రాక్ట్ క్యారియర్ పేరుతో పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు పదుల సంఖ్యలో స్టేజ్ క్యారియర్లుగా రాకపోకలు సాగిస్తున్నా కాసుల మత్తులో రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు రోజుల కిందట గొల్లపూడి సమీపంలో నల్లకుంట వద్ద చెట్టును బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు వైద్య విద్యార్థులు, బస్సు డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవాణా శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా శాఖలో అనేక నిబంధనలు ఉన్నాయి. అయితే ప్రతి నిబంధనకూ ప్రత్యామ్నాయం కూడా ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు ప్రత్యామ్నాయాన్నే అవకాశంగా మలుచుకొంటున్నారు. ఇందుకు రవాణా శాఖ అధికారులకు ఎంతో కొంత ముట్టజెబుతున్నారు. ప్రధానంగా వెహికల్ ట్రాన్స్‌ఫర్ రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని అంశాలను సక్రమంగా పరిగణలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నల్లకుంట వద్ద జరిగిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనతో ఇది తేటతెల్లమయింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ధనుం జయ ట్రావెల్స్ నిర్వాహకులు కొనేళ్ల క్రితం ట్రావెల్ వ్యాపారం నుంచి బయటకు వచ్చి బస్సులను పలువురికి విక్రయించారు. ప్రమాదం జరిగిన బస్సును హైదరాబాద్‌కు చెందిన ఒమర్ ట్రావెల్స్ కొనుగోలు చేసింది.
అయితే బస్సును ఆ సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ట్రావెల్స్ కంపెనీ పేరును రవాణా శాఖ రికార్డుల్లో మార్చలేదు. బస్సుపైనా ట్రావెల్స్ కంపెనీ పేరు మార్చలేదు. ఇలాంటి ఘటనలు జిల్లాలోనూ ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 6,51,905 వాహనాలకు సంబంధించి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి పేరుతో ట్రాన్స్‌ఫర్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో అత్యధికంగా 4.36 లక్షల ద్విచక్ర వాహనాలు పేరు మార్పు బదలాయింపులు జరిగాయి. 26 వేల ఆటోలు, 29 వేల గూడ్స్ క్యారియర్లు, 58 వేల కార్లు, 1200 టాక్సీ క్యాబ్‌లు ట్రాన్స్‌ఫర్లు జరిగాయి. సాధారణంగా జిల్లాలో లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ట్రాన్స్‌ఫర్ రిజిస్ట్రేషన్లు అధికంగా
జరుగుతున్నాయి.
జిల్లాలో 410 ట్రావెల్ బస్సులు
జిల్లాలో మొత్తం 410 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఉన్నాయి. 410 బస్సులు కాంటాక్ట్ క్యారియర్లుగా పర్మిట్లు పొంది విజయవాడ నుంచి రాష్ట్రంతో పాటు, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు 21 బస్సులు స్టేజ్ క్యారియర్ పర్మిట్లు పొంది రాకపోకలు సాగిస్తున్నాయి. కాంట్రాక్ట్ క్యారియర్ అంటే విజయవాడ నుంచి బెంగళూరుకు అనుమతి తీసుకొని రుసుం చెల్లిస్తే విజయవాడలో బయలుదేరే బస్సు మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకోకుండా నేరుగా గమ్యస్థానం చేరుకోవాలి. అయితే అత్యధికశాతం కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులు అనేక చోట్ల ఆగిమరీ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని అధికారులకు తెలిసినా రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్లతో మాట్లాడలేని పరి స్థితి. మరోవైపు జిల్లాలో ఇప్పటి వరకు 425 కాంటాక్ట్ క్యారియర్ బస్సులు ట్రాన్స్‌ఫర్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరో 1821 స్టేజ్ క్యారియర్ బస్సులు ట్రాన్స్‌ఫర్ రిజిస్టేషన్లు జరిగాయి.
కాసులిస్తే సరి!
Published Thu, Mar 17 2016 12:50 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement