ఇండో అమెరికన్ కళాశాల
అనకాపల్లి : ‘పట్టా వృథా .. పదేళ్ల వ్యథ ’ శీర్షికతో గురువారం సాక్షిలో వచ్చిన కథనం కలకలం సృష్టించింది. మండలంలోని భట్లపూడి గొలగాం దరి ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన ఇండో అమెరికన్ అకాడమిలో ఎందరో విద్యార్థులు వివిధ కోర్స్‌ల నిమిత్తం విద్యాభ్యాసం చేసి ఇబ్బందులు ఎదుర్కొన్న వైనం సాక్షి వెలుగులోకి తెచ్చింది. అల్‌మెడ అనే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఈ అకాడమిలో పలు కోర్స్‌లు చేసిన విద్యార్థులకు అందించిన ధ్రువీకరణ పత్రాలు ఇపుడు అక్కరకు రాకుండా పోయాయని తేలిపోయింది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడాలని ఆశపడి ఈ అకాడమి పేరిట వచ్చిన ప్రకటనను చూసి లక్షలు చెల్లించిన గుంటూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అజయ్‌కు ఒరిజనల్ పట్టా ఇవ్వకపోవడంతో ఉద్యోగం ఇచ్చిన సంస్థతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో చేరిన అజయ్ సమర్పించిన అల్‌మెడ అనుబంధ డిగ్రీ పనికిరాదని తేల్చడంతో ఆ సంస్థ కూడా ఉద్యోగం నుంచి తొలగించింది. ఇపుడు కేరీర్‌ను కోల్పోయిన అజయ్ తీవ్ర వేదనలో మునిగితేలిన వైనాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఎందరో విద్యార్థులు తనలా మోసపోయారని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. ఇంకా అనేక వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
అకాడమీ మూసివేత?
పదేళ్ల క్రితం ప్రారంభమైన ఇండో అమెరికన్ కళాశాల అకాడమిలో అడ్మిషన్లు దాదాపు నిలిపివేశారు. ప్రారంభంలో మెకానికల్, సివిల్, ఈసీఈ వంటి కోర్సుల్లో 150 మంది విద్యార్థులు చేరారు. తర్వాత ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు తగ్గడంతో ప్రస్తుతం కళాశాల పరిసరాల్లో బోర్డులను తొలగించారు. ఇండో అమెరికన్ అకాడమికి అనుబంధంగా ఒక స్వచ్ఛంద సంస్థ పేరిట సేకరించిన భూమి విక్రయం విషయంలో కూడా ఆరోపణలు ఉన్నాయి.
దర్యాప్తు జరుపుతాం
సాక్షిలో వచ్చిన కథనం చూశాం. గతంలో సదరు విద్యార్థి నష్టపోయానని చెప్పి మమ్మల్ని ఆశ్రయించారు. రెండు రోజుల్లో అకాడమి వద్దకు వెళ్లి దర్యాప్తు చేస్తాం. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తాం. తప్పు చేసినట్టు నిరూపణ అయితే చర్యలు తప్పవు.– సీఐ రామచంద్రరావు
Comments
Please login to add a commentAdd a comment