మొబైల్ కనెక్షన్.. 2 నిమిషాల్లో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కొత్తగా సిమ్ కావాలంటే ఫొటో, సరైన ధ్రువీకరణ పత్రాలు కావాల్సిందే. టెలికం కంపెనీకి చెందిన ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌కు వెళ్లినట్టయితే ఒకట్రెండు రోజుల్లో సిమ్ యాక్టివేట్ అవుతుంది. అదే చిన్న ఏజెంట్ల దగ్గరికెళితే అదనంగా మరో రోజు వేచి చూడాల్సిందే. ఇలాంటి ఆలస్యానికి, పత్రాలకు చెక్ పెడుతూ టెలికం కంపెనీలు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) విధానాన్ని అమలు చేస్తున్నాయి. టెలికం కంపెనీ ఔట్‌లెట్‌కు కేవలం ఆధార్ కార్డును తీసుకెళితే చాలు.
రెండు మూడు నిమిషాల్లోనే సిమ్ యాక్టివేట్ చేస్తారు. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఈ-కేవైసీని ఇప్పటికే అమలులోకి పెట్టాయి. టెలినార్ పైలట్ ప్రాజెక్టును పూర్తి చేసి అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అయింది. ఈ-కేవైసీ అమలుతో దేశంలోని బ్యాంకులు, టెలికం కంపెనీలు రానున్న అయిదేళ్లలో రూ.10,000 కోట్లు ఆదా చేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది.
ఇలా పనిచేస్తుంది..
ఎలక్ట్రానిక్ విధానంలో ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడమే ఈ-కేవైసీ. టెలికం ఔట్‌లెట్‌కు కస్టమర్లు ఎటువంటి ఫొటో కాపీలు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఔట్‌లెట్లో ఉన్న సిబ్బందికి కస్టమర్ తన ఆధార్ కార్డు నంబరు ఇవ్వాలి. పాయింట్ ఆఫ్ సేల్‌గా వినియోగిస్తున్న ప్రత్యేక ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్‌ఫోన్‌లో ఈ నంబరును టైప్ చేయగానే కస్టమర్ వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. మరో పరికరంలో కస్టమర్ తన వేలి ముద్ర ఇవ్వాలి.
ఆధార్ వివరాలతో వేలి ముద్ర సరితూగగానే ధ్రువీకరణ పూర్తి అవుతుంది. మొత్తంగా 2-3 నిమిషాల్లోనే సిమ్ యాక్టివేషన్ పూర్తి కావడం విశేషం. ఈ విధానంలో సిమ్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు లోనయ్యే అవకాశమే లేదు. రిటైలర్లకు పనిభారం తగ్గుతుంది. మొబైల్ రిటైల్ చైన్ సంస్థలైన బిగ్ సి, లాట్ మొబైల్స్‌లు తమ స్టోర్లలో జియో కస్టమర్ల కోసం ఈ-కేవైసీని అమలులోకి తెచ్చాయి.
పక్కదారి పట్టదు..
ఇప్పటి వరకు ఉన్న సిమ్ యాక్టివేషన్ విధానంలో పారదర్శకత లోపించింది. ఒకరి పేరుతో మరొకరికి సిమ్‌లు ఇచ్చిన సంఘటనలు కేవలం పలు పోలీసు కేసులు నమోదైన ఘటనల్లోనే బయటపడుతున్నాయి. అదేవిధంగా తప్పుడు పత్రాలతో సిమ్‌లు తీసుకున్నా నిరోధించే వ్యవస్థ లేదు. ప్రస్తుత ఈ-కేవైసీ విధానంలో సిమ్‌ల జారీ పక్కదారి పట్టే అవకాశమే లేదు. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను సరిచూసుకున్నాకే మొబైల్ సిమ్‌ను యాక్టివేట్ చేస్తారు. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం పూర్తిగా భద్రంగా ఉంటుంది.
భారీగా తగ్గనున్న వ్యయం..
ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం ఈ-కేవైసీ అమలుతో దేశంలోని బ్యాంకులు, టెలికం కంపెనీలు రానున్న అయిదేళ్లలో రూ.10,000 కోట్లు ఆదా చేస్తాయి. పాత విధానంలో ప్రతి కొత్త కనెక్షన్‌కు టెలికం కంపెనీలు టాప్ మెట్రోల్లో సుమారు రూ.145-175 దాకా ఖర్చు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జూలై నాటికి 78 కోట్ల జీఎస్‌ఎం కనెక్షన్లు ఉన్నాయి. జూన్‌లో 35 లక్షలు, జూలైలో 20 లక్షల పైచిలుకు కొత్త కస్టమర్లు నమోదయ్యారు. అంటే ఏ స్థాయిలో కంపెనీలకు వ్యయం అవుతుందో ఇట్టే ఊహించవచ్చు. రిటైలర్ల నుంచి యాక్టివేషన్ కేంద్రాలకు దరఖాస్తుల రవాణా, ఉద్యోగుల వ్యయం కంపెనీలకు ఇక నుంచి ఉండదు. అటు కస్టమర్‌కు సైతం ధ్రువీకరణ పత్రాల ఖర్చు ఉండదు. ఇక డిజిటల్ ఇండియా లక్ష్యానికి ఈ-కేవైసీ మద్దతు ఇస్తుందని ఎయిర్‌టెల్ ఇండియా సీఈవో గోపాల్ విట్టల్ వ్యాఖ్యానించారు.