ఉద్యోగుల ‘స్థానిక’ యుద్ధం!
- తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారని తెలంగాణ సంఘాల ఆరోపణ
- నిరూపించాలని సీమాంధ్ర ఉద్యోగుల సవాల్
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ఉద్యోగుల స్థానికత నిర్ధారణ అంశం తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. సచివాలయంలోని 1,865 మంది ఉద్యోగుల్లో 1,059 మందిని సీమాంధ్ర, 806 మందిని తెలంగాణ ఉద్యోగులుగా నిర్ధారిస్తూ మంగళవారం ప్రభుత్వం జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యోగులుగా పేర్కొంటున్న 806లో 181 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి తెలంగాణ స్థానికతను చూపించుకున్నారని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆరోపించింది.
ఈ మేరకు వివరాలను అధ్యక్షుడు నరేందర్‌రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ప్రభుత్వానికి నివేదించింది.మరోవైపు... పలువురు ఉద్యోగులు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు చేయడం సరికాదని, దాన్ని నిరూపించాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ సవాల్ చేశారు. సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్నారనే వాదనలో వాస్తవం లేదని వెల్లడవడంతో.. తప్పుడు ధ్రువపత్రాల వాదనను తెలంగాణ నేతలు తెరమీదకు తెచ్చారని విమర్శించారు. కాగా... 12 మంది ఆంధ్రా ఉద్యోగులు తమను పొరపాటుగా తెలంగాణలో చూపించారని, ఐదుగురు తెలంగాణ ఉద్యోగులు తమను ఆంధ్రా జాబితాలో సూచించారని జీఏడీ దృష్టికి తీసుకెళ్లారు.
పరిశీలనకు 10 బృందాలు...
ఉద్యోగ సంఘాల డిమాండ్ నేపథ్యంలో... ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను పరిశీలించి స్థానికతను నిర్ధారించడానికి ఇద్దరేసి సభ్యులున్న 10 బృందాలను సాధారణ పరిపాలన శాఖ ఏర్పాటుచేసింది. ఈ బృందాలు గురువారం నుంచి పనిచేయడం ప్రారంభించి.. రెండు రోజుల్లో నివేదికలు అందజేస్తాయి. వాటి ఆధారంగా స్థానికతలో జరిగిన పొరపాట్లను గుర్తించి సరిచేస్తారు.
ఆర్థిక శాఖ ఉద్యోగుల జాబితా వెల్లడి
ఆర్థిక శాఖలో పనిచేస్తున్న 278 మంది స్థానికతను నిర్ధారిస్తూ జాబితాను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అందులో 114 మంది ఆంధ్రా, 164 మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది. అయితే క్లాస్-3, 4 ఉద్యోగులను కూడా ఈ జాబితాలో చేర్చడంతో.. తెలంగాణ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా క్లాస్-3, 4 కేటగిరీ ఉద్యోగుల్లో 95 శాతం మంది తెలంగాణ వారే ఉంటారు.
పీఆర్, ఆర్డీ శాఖల్లో విభజన పూర్తి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి(పీఆర్, ఆర్డీ) శాఖల్లో విభజన ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు శాఖల్లో కార్యదర్శుల నుంచి దిగువస్థాయిలో ఉండే ఉద్యోగుల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సిబ్బంది సంఖ్యను ఖరారు చేశారు. దీనికి అపెక్స్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలను విలీనం చేయాలని నిర్ణయించింది. పీఆర్, ఆర్‌డీ కమిషనరేట్‌లను విలీనం చేసి ‘పీఆర్ అండ్ ఆర్‌డీ’గా చేయాలని నిర్ణయించారు.
ఇద్దరు కమిషనర్లను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. సెర్ప్‌ను కూడా రెండుగా విభజించాలని నిర్ణయించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో ఇద్దరు ఐఎఫ్‌ఎస్ అధికారులను ఇరు రాష్ట్రాలకు ఒక్కొక్కరిగా పంపిణీ చేస్తారు. ఈ రెండు శాఖలకు సంబంధించి మొత్తం 40 కేటగిరీల్లో 209 మంది ఉద్యోగులు ఉంటే.. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు 119 మందిని, తెలంగాణకు 90 మంది ఉద్యోగులను కేటాయించారు.