ఏడాది కాలంగా ఇన్‌చార్జులదే పాలన
కుప్పలు తె ప్పలుగా పేరుకుపోయిన ఫైళ్లు
ఆఫీసుల చుట్టూ తిరగలేక అల్లాడుతున్న ప్రజానీకం
జిల్లాలో రెవెన్యూ సేవలు మందగిస్తున్నాయి. మండలాల్లో ప్రజలకు సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందడం లేదు. భూ సర్వేలు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, అడంగళ్ల నమోదు, మీ భూమి.. వంటి పనుల్లో తీవ్రమైన జాప్యం కనిపిస్తోంది. జనం పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి దస్త్రాలకే పరిమితమవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ఫైళ్లకు వారాల తరబడి మోక్షం లభించడం లేదు. జిల్లా, మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగలేక జనం అల్లాడిపోతున్నారు. సమస్యను పట్టించుకుని పరిష్కరించాల్సిన జిల్లా పాలనా యంత్రాంగం నిత్యం సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో మునిగి తేలుతోంది.
తిరుపతి: జిల్లాలోని ఆరు మండలాలకు రెగ్యులర్ తహశీల్దార్లు లేరు. ఏడాది కాలంగా ఇక్కడ ఇన్‌చార్జి తహశీల్దార్లే విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 8 మండలాల్లో సర్వేయర్లు కరువు. అంతేకాకుండా మరో ఆరుచోట్ల డిప్యూటీ తహశీల్దార్లు కూడా లేకుండా పోయారు. చిత్తూరు తహశీల్దార్‌గా పనిచేసే శివకుమార్‌ను ఏడు నెలల కిందట బదిలీ చేయడంతో ఆర్‌డీవో ఆఫీస్‌లో ఏవోగా పనిచేస్తోన్న అరుణ్‌కుమార్‌ను ఇన్‌చార్జి తహశీల్దార్‌గా నియమించారు. అటు ఏవో బాధ్యతల్లోనూ, ఇటు ఇన్‌చార్జి తహశీల్దార్‌గానూ అరుణ్‌కుమార్ సేవలందించాల్సి వస్తోంది. పనిఒత్తిడి పెరగడంతో ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యం నెలకొంటుంది. ఏర్పేడు తహశీల్దార్ లక్ష్మీనరసయ్యను రెండు నెలల కిందట కలెక్టర్ ఆఫీస్‌కు బదిలీ చేయడంతో రేణిగుంట తహశీల్దార్ మనోహర్‌కు ఏర్పేడు మండల బాధ్యతలు కూడా అప్పగించారు. అప్పటినుంచి అటు రేణిగుంట, ఇటు ఏర్పేడు మండలాల రైతులకు ఇక్కట్లు మొదలయ్యాయి. వెదురుకుప్పం తహశీల్దార్ ఇంద్రసేనను ఏడాది కిందట సస్పెండ్ చేసిన ప్రభుత్వం అప్పటినుంచి పెనుమూరు తహశీల్దార్ మునిరత్నంకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. సత్యవేడు మండలానికి కూడా ఏడాది కాలంగా రెగ్యులర్ తహశీల్దార్ లేరు. ఏడాది కిందట ఇక్కడి తహశీల్దార్ అనారోగ్యంతో చనిపోవడంతో వరదయ్యపాళెం తహశీల్దార్ బాబూరాజేంద్రప్రసాద్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
సేవల్లో ఎడతెగని జాప్యం
సాధారణంగా అటు జిల్లా కేంద్రాల్లో, ఇటు మండల కేంద్రాల్లో పాలనపరంగా రెవెన్యూ అధికారులదే కీలకపాత్ర. పౌరసరఫరాల విభాగంలోని రేషన్ దుకాణాల పర్యవేక్షణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, వ్యవసాయభూముల అడంగళ్లు, వాటికి సంబంధించిన రికార్డుల పర్యవేక్షణ, పట్టాదారుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ పంపిణీ, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి పనులన్నింటికీ మండలాల్లో పర్యవేక్షణాధికారి తహశీల్దారే. స్కూళ్లు, కళాశాలు, హాస్టళ్లు తెరిచే రోజులు దగ్గర పడటంతో జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం నిత్యం ఎంతోమంది కార్యాయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇన్‌చార్జుల ఏలుబడిలో ఉన్న మండలాల్లో మాత్రం సర్టిఫికెట్ల జారీ, భూ సంబంధ సమస్యల పరిష్కారం, భూముల సర్వే వంటి పనులన్నీ వెనకబడ్డాయి. భూ సర్వేల కోసం రైతులు పెట్టుకున్న అర్జీలు పెద్దఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి. సర్వేయర్లు దొరక్క రైతులు తలలు పట్టుకుంటున్నారు. అటు చిత్తూరు, ఇటు తిరుపతి రెవెన్యూ కార్యాలయాల్లోనూ ఫైళ్లు నెలల తరబడి క్లియరెన్సుకు నోచుకోవడం లేదు.
తిరుపతిలోని ప్రొటోకాల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని ప్రభుత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, మేజిస్ట్రేట్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వంటి వారు తిరుపతి వచ్చినపుడు వీరికి ప్రొటోకాల్ సేవలందించే అధికారి లేక స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు కల్పించకపోవడం, లూప్‌లైన్లలో ఉన్న తహశీల్దార్లకు అవకాశం కల్పించకపోవడం వంటి కారణాల వల్ల కొన్ని మండలాలు ఇన్‌చార్జిల చేతుల్లోనే ఉన్నాయి. జనం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా సమస్యను పరిష్కరించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.