Revenue services
-
రెవెన్యూలో ఇన్ని సంస్కరణలు ఇప్పుడే
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ పశ్చిమ): గతంలో ఎప్పుడూ జరగనన్ని రెవెన్యూ సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో పెద్దఎత్తున జరిగాయని, తద్వారా లక్షలాది మందికి ప్రయోజనం కలిగిందని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రూ.76 వేలకోట్ల విలువైన భూమిని 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలుగా ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూమిని ఇచ్చాయని, ఈ ప్రభుత్వమే తొలిసారి వేలకోట్లతో భూమి కొని ఇళ్లస్థలాలు ఇచ్చిందని చెప్పారు. విజయవాడలో ఆదివారం జరిగిన రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్ భూములు, చుక్కల భూములు, షరతులు గల భూములు, సర్వీస్ ఈనాం వంటి లక్షల ఎకరాల భూములు త్వరలో ఓపెన్ మార్కెట్లోకి వస్తాయని తెలిపారు. రెవెన్యూశాఖ మరింత బలోపేతమవడంతోపాటు దాని గౌరవం కూడా పెరిగిందన్నారు. నీతి ఆయోగ్ ఇచ్చిన మోడల్ చట్టాన్ని తీసుకుని కొత్త టైటిలింగ్ చట్టాన్ని రూపొందించి రాష్ట్రపతి అనుమతి కోసం పంపామని, అది వస్తే రెవెన్యూశాఖ ఇంకా పవర్‌ఫుల్‌గా మారుతుందని చెప్పారు. రెవెన్యూశాఖ పేరును ల్యాండ్ అడ్మిస్ట్రేషషన్ అండ్ జనరల్ అడ్మిస్ట్రేషషన్గా మార్చాల్సిన అవసరం ఉందని, ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో మాట్లాడతానని తెలిపారు. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్–1977 చట్టాన్ని మార్చడంతో 30 లక్షల ఎకరాల భూమి మళ్లీ వ్యవస్థలోకి వస్తుందన్నారు. ఇన్ని లక్షల ఎకరాల భూమి టైటిల్ ఫ్రీగా అయితే రాష్ట్రంలో ఆరి్థక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు లేవనెత్తిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని, సీఎం మానవతాకోణం ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఉద్యోగులకు చేయాల్సినవన్నీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ సాయిప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులు టార్గెట్ సమయాన్ని కొంత ఎక్కువైనా తీసుకుని పనిచేయాలని, ఒత్తిడికి గురవ్వద్దని చెప్పారు. భవిష్యత్తులో ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ వ్యవస్థ వస్తుందని, వ్యవసాయ భూములతోపాటు నివాస, పారిశ్రామిక తదితర భూములన్నీ రెవెన్యూ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వం మన సమస్యల్ని పరిష్కరిస్తోంది ఏపీ రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని చెప్పారు. అయితే ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. గత ప్రభుత్వ పాలనలో వీఆర్ఏ, వీఆర్వోలకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రూ.300 ఉన్న డీఏను రూ.500కు పెంచారని తెలిపారు. వచ్చే ఏడాదికి రెవెన్యూశాఖ ఏర్పడి 60 ఏళ్లవుతున్న నేపథ్యంలో జూన్ 20వ తేదీని రెవెన్యూ డేగా ప్రకటించాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరికీ ఉమ్మడి సర్విస్ రూల్స్ అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఎస్.ఢిల్లీరావు, వేణుగోపాలరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. తొలుత లెనిన్ సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్‌కు ఎన్నికైన 30 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. -
పొర‘పాట్లు’ లేకుండా ఓటరు జాబితా!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీ చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఒకే వ్యక్తి పేరు రెండుచోట్ల, ఒకరి పేరు దగ్గర మరొకరి ఫొటో ఉంటే తొలగించడంతోపాటు అర్హులైనవారి ఓట్లు, ముఖ్యంగా వీఐపీలవి గల్లంతు కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందుకుగాను తొలిసారిగా రెవెన్యూ సేవల్ని కూడా వినియోగించుకోనున్నారు. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రవి నేతృత్వంలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, 15 మంది తహసీల్దార్లు, 100 మంది వీఆర్వోలు జిల్లాలోని ఓటర్ల జాబితాను జల్లెడ పట్టనున్నారు. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారి పేర్లను నమోదు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుతో కలసి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ నిర్వహించిన రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. గడిచిన ఐదేళ్లలో జిల్లాలో 1,22,700 మంది మరణించినట్లు రికార్డులు తెలుపుతుండగా, వీరి ఓట్లూ తొలగించలేదు. కొత్తగా ఓటు హక్కు పొందేవారు సాధారణంగా జనాభాలో 3.75 శాతం ఉండగా, ఆ మేరకు నమోదు కాలేదు. వీటిపై కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోనున్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ దానకిశోర్ ఈ వివరాలు వెల్లడించారు. ‘ముసాయిదా జాబితాలను మూడురోజులు పరిశీలించాక, గుర్తించిన లోపాల్ని సరిదిద్దేందుకు ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళతారు. ఒక్కరికే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే తొలగిస్తారు. ఇతర జిల్లాల పరిధిలో ఉన్నా గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఇటీవల అందించిన ఆధునిక సాఫ్ట్వేర్ ఇ.ఆర్.ఓ నెట్ 2.5 ద్వారా గుర్తిస్తారు. నోటీసులు అందజేసి ఓటరు కోరుకున్న చోట మాత్రమే ఉంచి, మిగతా చోట్ల తొలగిస్తారు. ఈ ప్రక్రియను హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్‌రావు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ఆమ్రపాలి పర్యవేక్షిస్తార’ని తెలిపారు. నూతన ఓటర్ల నమోదు, చిరునామా మార్పిడి, అనర్హుల తొలగింపు తదితర అంశాలపై సందేహాల నివృత్తి కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 15 లైన్లతో టోల్ ఫ్రీ నంబర్ 1800–599–2999ను శనివారం నుంచే అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుకు నగరంలో 600కుపైగా ఉన్న సీనియర్ సిటిజన్ క్లబ్‌ల సహకారం తీసుకుంటామన్నారు. దివ్యాంగ ఓటర్ల పేర్లూ నమోదు చేయడంతోపాటు పోలింగ్ బూత్‌ల్లో వారు ఓటేసేందుకు ర్యాంపులు, తదితర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో వెయ్యి వీఐపీ ఓట్ల పరిశీలన.. ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి మంది వీఐపీల ఓట్లను ఎన్నికల సిబ్బంది పరిశీలిస్తారని దానకిశోర్ చెప్పా రు. ఓటరు జాబితాలో వారి పేర్లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూడటంతోపాటు ఫొటోలు, చిరునామా సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారన్నారు. ఇప్పటి వరకు పేర్ల నమోదు, చిరునామా మార్పిడి తదితర అంశాలకు సంబంధించి ఆయా ఫారాల ద్వారా 6,680 క్లెయిమ్లందాయని, ఇవి కాక ఆన్లైన్ ద్వారా అందాయన్నారు. ఓటరు చైతన్య ప్రచార రథాలు ఓటర్ల నమోదు, సవరణతోపాటు అర్హులైన వారందరూ పోలింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు ఓటరు చైతన్య ప్రచార రథాలను ఏర్పాటు చేయనున్నట్లు దానకిశోర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఆధునిక సాంకేతికతతో కూడిన ఈవీఎంలతోపాటు వీవీ ప్యాట్లూ వినియోగిస్తారని, దీంతో ఓటరు తాము వేసిన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవచ్చన్నారు. -
తెలుపు రేషన్ కార్డులు పునరుద్ధరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన తెలుపు రంగు రేషన్ కార్డులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. బియ్యం, ఇతర సరుకులు అందజేయాలని కోరుతూ జిల్లా వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలు చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను, సంక్షేమాలను, రెవెన్యూ సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు సక్రమంగా అందిస్తున్నారని చెప్పారు. వీఆర్ఏలను అన్ని పనులకు, పౌర సరఫరాల పనులకు వాడుకుంటున్నారని, అయితే తమ తెలుపు రంగు రేషన్ కార్డులు ఎత్తివేశారని ఆవేదన చెందారు. దీంతో కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రేషన్ కార్డులు పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం నాయకులు వై.అప్పలస్వామి, జె.ఎర్రయ్య, పి.శ్రీనివాసరావు, రాజయ్య, ప్రసాదరావు, రామచంద్రుడు, పున్నయ్య, రమణ, రాజారావు, లక్ష్మి, చిట్టయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు అఖిల పక్షాల నాయకులతో కలిసి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో రత్నాల నర్సింహమూర్తి, చౌదరి సతీష్, ఎ.రాధ, చాపర సుందర్‌లాల్, చౌదరి తేజేశ్వరరావు, తాండ్ర ఆరుణ, తదితరులు ఉన్నారు. -
‘కొత్త’ జిల్లా తొలి రోజు నుంచే పోలీస్, రెవెన్యూ సేవలు
కలెక్టర్లోకేష్కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్త జిల్లాలో పోలీస్, రెవెన్యూ శాఖలు ప్రారంభం రోజు నుంచి కార్యక్రమాలు చేపట్టాల్సుంటుందని, మిగతా శాఖలు వాటి అ«ధికారుల నిర్ణయించిన ప్రకారం పనిచేస్తాయని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తెలిపారు. జిల్లా పునర్విభజపై జిల్లా అధికారులతో ఆయన బుధవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను సంబందిత శాఖల వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. సిబ్బంది సర్వీస్, సీనియారిటీ, ఐడీ నెంబర్, ఆధార్ కార్డు నంబర్ సహా అప్లోడ్ చేయాలన్నారు. కరెంట్ ఫైల్, డిస్పోజల్ ఫైల్, మూవబుల్ అసెట్స్, వాహనాలు, కొత్త పోస్టుల ఏర్పాటు, మంజూరు పోస్టుల వివరాలను ఆయా రాష్ట్ర శాఖ అధికారులు చూసుకుంటారని వివరించారు. కొన్ని శాఖలు విలీనమవుతున్నందున ఆయా శాఖల అధికారులతోపాటు ఆ శాఖ మొత్తానికి ఒక జిల్లా బాధ్యుడు ఉంటారని చెప్పారు. కొత్త జిల్లాలో ఆయా శాఖల ట్రస్ట్ ఏరియానుబట్టి పోస్టులు ఉండే అవకాశముందన్నారు. పాత, కొత్త జిల్లాలకు సంబందించి శాఖాపరంగా ఒక పేజీకి మించకుండా నివేదికను శుక్రవారం సాయంత్రానికి సీపీఓకు ఇవ్వాలన్నారు. కామన్ ఫైల్స్ స్కానింగ్ చేసి సంబంధిత జిల్లాకు పంపాలని, ఇతర జిల్లాలకు వెళ్ళిన మండలాల వివరాలను కూడా పొందుపర్చాలని చెప్పారు. ఒకొక్క శాఖకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించేందుకు సంబందిత శాఖ రాష్ట్ర బాద్యులతో మాట్లాడతానన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి.దివ్య, ఏఎస్పీ సాయికృష్ణ, డీఆర్వో శ్రీనివాస్, జిల్లాపరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, సీపీఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు. -
తహశీల్దార్లు కరువు
ఏడాది కాలంగా ఇన్‌చార్జులదే పాలన కుప్పలు తె ప్పలుగా పేరుకుపోయిన ఫైళ్లు ఆఫీసుల చుట్టూ తిరగలేక అల్లాడుతున్న ప్రజానీకం జిల్లాలో రెవెన్యూ సేవలు మందగిస్తున్నాయి. మండలాల్లో ప్రజలకు సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందడం లేదు. భూ సర్వేలు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, అడంగళ్ల నమోదు, మీ భూమి.. వంటి పనుల్లో తీవ్రమైన జాప్యం కనిపిస్తోంది. జనం పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి దస్త్రాలకే పరిమితమవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ఫైళ్లకు వారాల తరబడి మోక్షం లభించడం లేదు. జిల్లా, మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగలేక జనం అల్లాడిపోతున్నారు. సమస్యను పట్టించుకుని పరిష్కరించాల్సిన జిల్లా పాలనా యంత్రాంగం నిత్యం సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో మునిగి తేలుతోంది. తిరుపతి: జిల్లాలోని ఆరు మండలాలకు రెగ్యులర్ తహశీల్దార్లు లేరు. ఏడాది కాలంగా ఇక్కడ ఇన్చార్జి తహశీల్దార్లే విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 8 మండలాల్లో సర్వేయర్లు కరువు. అంతేకాకుండా మరో ఆరుచోట్ల డిప్యూటీ తహశీల్దార్లు కూడా లేకుండా పోయారు. చిత్తూరు తహశీల్దార్‌గా పనిచేసే శివకుమార్‌ను ఏడు నెలల కిందట బదిలీ చేయడంతో ఆర్డీవో ఆఫీస్‌లో ఏవోగా పనిచేస్తోన్న అరుణ్‌కుమార్‌ను ఇన్చార్జి తహశీల్దార్‌గా నియమించారు. అటు ఏవో బాధ్యతల్లోనూ, ఇటు ఇన్చార్జి తహశీల్దార్గానూ అరుణ్‌కుమార్ సేవలందించాల్సి వస్తోంది. పనిఒత్తిడి పెరగడంతో ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యం నెలకొంటుంది. ఏర్పేడు తహశీల్దార్ లక్ష్మీనరసయ్యను రెండు నెలల కిందట కలెక్టర్ ఆఫీస్‌కు బదిలీ చేయడంతో రేణిగుంట తహశీల్దార్ మనోహర్‌కు ఏర్పేడు మండల బాధ్యతలు కూడా అప్పగించారు. అప్పటినుంచి అటు రేణిగుంట, ఇటు ఏర్పేడు మండలాల రైతులకు ఇక్కట్లు మొదలయ్యాయి. వెదురుకుప్పం తహశీల్దార్ ఇంద్రసేనను ఏడాది కిందట సస్పెండ్ చేసిన ప్రభుత్వం అప్పటినుంచి పెనుమూరు తహశీల్దార్ మునిరత్నంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. సత్యవేడు మండలానికి కూడా ఏడాది కాలంగా రెగ్యులర్ తహశీల్దార్ లేరు. ఏడాది కిందట ఇక్కడి తహశీల్దార్ అనారోగ్యంతో చనిపోవడంతో వరదయ్యపాళెం తహశీల్దార్ బాబూరాజేంద్రప్రసాద్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. సేవల్లో ఎడతెగని జాప్యం సాధారణంగా అటు జిల్లా కేంద్రాల్లో, ఇటు మండల కేంద్రాల్లో పాలనపరంగా రెవెన్యూ అధికారులదే కీలకపాత్ర. పౌరసరఫరాల విభాగంలోని రేషన్ దుకాణాల పర్యవేక్షణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, వ్యవసాయభూముల అడంగళ్లు, వాటికి సంబంధించిన రికార్డుల పర్యవేక్షణ, పట్టాదారుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ పంపిణీ, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి పనులన్నింటికీ మండలాల్లో పర్యవేక్షణాధికారి తహశీల్దారే. స్కూళ్లు, కళాశాలు, హాస్టళ్లు తెరిచే రోజులు దగ్గర పడటంతో జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం నిత్యం ఎంతోమంది కార్యాయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇన్చార్జుల ఏలుబడిలో ఉన్న మండలాల్లో మాత్రం సర్టిఫికెట్ల జారీ, భూ సంబంధ సమస్యల పరిష్కారం, భూముల సర్వే వంటి పనులన్నీ వెనకబడ్డాయి. భూ సర్వేల కోసం రైతులు పెట్టుకున్న అర్జీలు పెద్దఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి. సర్వేయర్లు దొరక్క రైతులు తలలు పట్టుకుంటున్నారు. అటు చిత్తూరు, ఇటు తిరుపతి రెవెన్యూ కార్యాలయాల్లోనూ ఫైళ్లు నెలల తరబడి క్లియరెన్సుకు నోచుకోవడం లేదు. తిరుపతిలోని ప్రొటోకాల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని ప్రభుత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, మేజిస్ట్రేట్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వంటి వారు తిరుపతి వచ్చినపుడు వీరికి ప్రొటోకాల్ సేవలందించే అధికారి లేక స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు కల్పించకపోవడం, లూప్‌లైన్లలో ఉన్న తహశీల్దార్లకు అవకాశం కల్పించకపోవడం వంటి కారణాల వల్ల కొన్ని మండలాలు ఇన్చార్జిల చేతుల్లోనే ఉన్నాయి. జనం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా సమస్యను పరిష్కరించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
రెవెన్యూ శాఖలో గందర గోళం
► టైటిల్డీడ్లు, పాసుపుస్తకాలు రద్దంటూనే జీవో ఇవ్వని వైనం ► ఆన్లైన్ 1బి రికార్డుతోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంటూ ప్రచారం ► పూర్తి కాని ఆన్లైన్ నమోదు ► ఇబ్బందులకు గురవుతున్న కక్షిదారులు ఆనందపురం : రెవెన్యూ సేవలలో పారదర్శకత, అవి నీతి లేని కార్యకలాపాల నిర్వాహణ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ఆచరణలో మా త్రం కనిపించడం లేదు. రోజుకో ప్రకటన చేస్తున్న ప్రభుత్వం జీవోలు విడుదల చేయకపోవడంతో సంస్కరణలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కార్య కలాపాలన్నీ పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయి. ఇదీ పరిస్థితి గతంలో 10-1, అడంగల్‌లో పేర్లు నమోదైన రైతులకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్డీడ్లు మంజూరు చేసేవారు. భూ రికార్డుల కంప్యూటరీకరణ పేరుతో వెబ్ ల్యాండ్‌ని ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఐదేళ్లైనా ప్రక్రియ కొన సాగుతూనే ఉంది. పట్టాదారు పాసు పుస్తకం తయారు చేసి జారీ చేసే అధికారం తహశీల్దారుకు, టైటిల్ డీడ్లు అందించే అధికారం ఆర్డీవోలకు కట్టబెట్టారు. అక్కడ కూడా మామ్మూళ్లు తంతు కొనసాగుతుందనిఆరోపణలు రావడంతో టైటిల్ డీడ్లు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పాసుపుస్తకాల తయారీని ఆన్లైన్ విధానంలో ప్రవేశ పెట్టింది. అక్కడ కూడా సిఫార్సులకు పెద్ద పీట వేస్తుండడంతో తాజాగా పట్టాదారు పాసుపుస్తకం జారీ విధానాన్ని రద్దు చేశారు. కేవలం ఆన్లైన్లో ఉన్న 1బి, అడంగల్ సమాచారం పై ఆధారపడాలని ఇక నుంచి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కూడా ఆన్లైన్లో ఉన్న సమాచారంతోనే జరుగుతుందని ప్రకటించినా ఇంత వరకూ అమలకు నోచుకోలేదు. దీంతో అంతటా అయోమయ పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్ల విషయంలో గందరగోళం రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు ప్రవేశ పెడుతున్నా వాటికి సంబంధించిన స్పష్టమై ఆదేశాలను మాత్రం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జారీ చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకుంటున్నాయి. ఆన్లైన్ 1బి, పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్లు ఉంటేనే వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ చేయాలని నిబంధన ఉంది. కానీ పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్డీడ్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మాత్రం 1బి రికార్డుతో రిజిస్ట్రేషన్లు చేయ వచ్చని జీవో ఇవ్వక పోవడంతో సబ్ రిజిస్ట్రార్లు అయోమయానికి గురవుతున్నారు. -
రెవెన్యూ సేవల్లో అమలాపురం స్టేట్ ఫస్ట్
అమలాపురం:రాష్ర్టంలో రెవెన్యూ సేవలందించడంలో అమలాపురం రెవెన్యూ డివిజన్ ప్రథమ స్థానంలో నిలిచినట్టు ఆర్డీవో జి.గణేష్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నాలుగు రెవెన్యూ విభాగాల్లో ప్రథమ స్థానం, రెండు విభాగాల్లో తృతీయ స్థానాలను అమలాపురం కైవసం చేసుకున్నట్టు ఆయన వివరించారు. రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఈ డివిజన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ పత్రం పంపించారని ఆర్డీవో తెలిపారు. సేవల్లో అమలాపురం డివిజన్ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా తమ కార్యాలయంలో డివిజన్లోని తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు,సిబ్బందితో గురువారం సాయంత్రం జరిగిన ఆత్మీయ, అభినందన సభలో ఆర్డీవో గణేష్‌కుమార్ మాట్లాడారు. ల్యాండ్ కన్వర్షన్లో డివిజన్ నూరుశాతం దరఖాస్తులను పరిష్కరించిందని చెప్పారు. కరక్షన్ ఇన్ కరెంట్ అడంగళ్‌లో... ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లలో... వెబ్ ల్యాండ్ ఆధార్ సీడింగ్‌లో డివిజన్ రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచిందని పేర్కొన్నారు. లేట్ రిజస్ట్రేషన్ ఆఫ్ బర్త్‌లో...మాడ్యులేషన్ ఆఫ్ ఇ-పాస్ బుక్స్ సేవల్లో డివిజన్ రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానాలను సాధించిందని ఆర్డీవో వివరించారు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఆర్డీవో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అభినందించారు. కలెక్టర్ అరుణకుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణల ప్రోత్సాహం కూడా తమ విజయంలో భాగస్వామ్యం అవుతుందని ఆర్డీవో అన్నారు. అనంతరం డివిజన్ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఆర్డీవో కట్ చేశారు. ఆర్డీవోకు పూలగుచ్ఛాలు అందజేసి తహసీల్దార్లు అభినందించారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వీఎస్ దివాకర్, తహసీల్దార్లు నక్కా చిట్టిబాబు, పాము సుబ్బారావు, బేబీ జ్ఞానాంబ, సత్యవతి, సుధాకర్‌రాజు, లక్ష్మీపతి తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. -
రెవెన్యూ పాలనకు తాళం!
⇒ఎమ్మార్వో ఆఫీసుల్లో 13 లక్షల దరఖాస్తులు పెండింగ్ ⇒ సిబ్బంది అంతా భూముల క్రమబద్ధీకరణ పనిలోనే.. ⇒ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకూ దిక్కులేదు ⇒ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులు ⇒ ఉచిత క్రమబద్ధీకరణకు 3,36,869 దరఖాస్తులు ⇒ అధికారులు సిఫారసు చేసినవి 72 వేలే... (‘సాక్షి’ ప్రత్యేకం) రాష్ట్రంలో రెవెన్యూ పాలన స్తంభించిపోయింది.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి రైతులకు పహాణీల వరకూ ధ్రువపత్రాల జారీ ఆగిపోయింది.. వీఆర్వోల నుంచి తహసీల్దార్ల దాకా అంతా ‘భూ క్రమబద్ధీకరణ’ పనిలో పడి పౌరసేవలను గాలికొదిలేశారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో కలిపి ఏకంగా 13 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలే చెబుతుండడం గమనార్హం. పోనీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘క్రమబద్ధీకరణ’ అయినా వేగంగా సాగుతోందా? అంటే సమాధానం లేదు. రెవెన్యూ సిబ్బంది అంతా మూడు నెలలుగా ‘కష్టపడు’తున్నా.. ఇంకా 25 వేల వరకూ దరఖాస్తుల పరిశీలనే జరగలేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సేవలన్నీ నిలిచిపోయాయి. ఎమ్మార్వో కార్యాలయాల్లో విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కూడా అందని దుస్థితి నెలకొంది. మూడు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ వ్యవహారం తప్ప వేరొకపనిపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించడం లేదు. క్రమబద్ధీకరణపై రోజువారీ సమీక్షలు, క్షేత్ర స్థాయిలో ఆక్రమణల పరిశీలనతోనే సమయమంతా గడచిపోతోందని.. మిగతా పనులు ముట్టుకుంటే ఉన్నతాధికారుల నుంచి మొట్టికాయలు పడుతున్నాయని అధికారులే వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా రెవెన్యూ విభాగం నుంచి ప్రజలకు అందించాల్సిన సేవల గురించి పట్టించుకోవడం లేదు. సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకు రెవెన్యూ విభాగం నుంచి 47 రకాల సేవలు పొందే వీలుంటుంది. ఈ సేవల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా... యంత్రాంగం పట్టించుకోక అవన్నీ పక్కనపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో కలిపి సుమారు 13 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. - సాక్షి, హైదరాబాద్ క్రమబద్ధీకరణ కూడా అంతంతే.. భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్లే మిగతా సేవలను అందించలేకపోతున్నామని చెబుతున్న రెవెన్యూ అధికారులు.. ఆ ప్రక్రియనైనా వేగంగా పూర్తి చే యడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత క్రమబద్ధీకరణ కోసం 3,36,869 దర ఖాస్తులు రాగా.. పరిశీలన అనంతరం పట్టాలివ్వాల్సిందిగా అధికారులు సిఫార్సు చేసింది 72 వేల దరఖాస్తులనే. క్రమబద్ధీకరణకు అర్హత కలిగిన మరో 14 వేల దరఖాస్తులను చెల్లింపు కేటగిరీలోకి మార్చారు. 93,770 దరఖాస్తుల్లో పేర్కొన్న స్థలాలు రైల్వే, మిలటరీ, అటవీశాఖకు చెందినవిగా పేర్కొన్నారు. మిగతావి కోర్టు కేసుల్లో ఉన్నందున పక్కనపెట్టారు. మొత్తంగా 2.43 లక్షల దరఖాస్తుల్లో పేర్కొన్న స్థలాలపై అభ్యంతరాలున్నాయని అధికారులు తేల్చారు. అయినా ఇంకా పరిశీలన జరపాల్సిన దరఖాస్తులు పాతిక వేలకుపైగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు అటవీ, రైల్వే, మిలటరీ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల భూముల్లోని ఆక్రమణలపై ఆయా విభాగాలతో చర్చిస్తామన్న ప్రభుత్వం... ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాల్లేవు. చివరికి సిద్ధం చేసిన పట్టాలను మాత్రమే ఈ నెల 14 నుంచి పంపిణీ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందాల్సిన సేవలివే.. మండల స్థాయిలో ప్రజలకు మొత్తం 47 రకాల సేవలను రెవెన్యూ యంత్రాంగం అందించాలి. వాటిలో ప్రధానంగా కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టు కోసం ప్రత్యేక నివాస ధ్రువీకరణ, ఇంటిగ్రేటెడ్(కుల, స్థానిక, పుట్టినతేదీ) సర్టిఫికెట్, ఎఫ్-లైన్ పిటిషన్స్, సబ్ డివిజన్ ఆఫ్ ల్యాండ్స్, మ్యుటేషన్ మరియు పట్టాదారు పాస్‌బుక్, నోఎర్నింగ్ మెంబర్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఓబీసీ, ఈబీసీ ధ్రువీకరణ పత్రాలు, వ్యవసాయ ఆదాయ ధ్రువపత్రం, కాపీ ఆఫ్ విలేజ్ మ్యాప్, మనీ లెండింగ్ లెసైన్సులు, పేరులో మార్పులు, నో ప్రాపర్టీ సర్టిఫికెట్, వ్యవసాయ భూమి విలువ ధ్రువపత్రం, సన్నకారు రైతు ధ్రువీకరణ, వాల్టా చట్టం ప్రకారం బోర్‌వెల్స్‌కు అనుమతి, డీ మార్కేషన్ ఆఫ్ బౌండరీస్, లోకలైజేషన్ ఆఫ్ ప్రాపర్టీస్, ప్రస్తుత అడంగల్/పహాణీ, రికార్డ్ ఆఫ్ రైట్స్ 1బి, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ కాపీ/టిప్పన్, ఇంతకు ముందు జారీచేసిన ధ్రువపత్రాల నకళ్లు, అడంగల్/పహాణీల్లో మార్పులు, ఈ-పాస్ పుస్తకాల జారీ, పాత అడంగల్ కాపీల నకళ్లు, ఇళ్ల స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు, రుణ అర్హత కార్డుల మంజూరు, డీఫార్మ్ పట్టా, కాసరా, చేసలా పహాణీ నకళ్లు, వసూల్ బాకీ, ఫైసల్ పట్టీ, పంచనామా సర్టిఫైడ్ కాపీలు, రక్షిత కౌలుదారు ధ్రువీకరణ తదితర సేవలు ఉన్నాయి. ఆయా సేవలను నిర్ణీత వ్యవధిలోగా అందించాలని సిటిజన్ చార్టర్లో పేర్కొన్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. అంతా అస్తవ్యస్తం.. ‘‘భూముల క్రమబద్ధీకరణ మినహా ప్రభుత్వం వేరే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లే దు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వీఆర్వో నుం చి డిప్యూటీ తహసీల్దారు వరకు అన్నిస్థాయిల ఉద్యోగులను క్రమబద్ధీకరణ కోసమని పట్టణ ప్రాంతాలకు డెప్యుటేషన్‌పై పంపారు. దీంతో ఆయా మండలాల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. వివిధ రకాల రెవెన్యూ సేవలు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలిసినా.. ఆయా జిల్లాల కలెక్టర్లుగానీ, ప్రభుత్వ పెద్దలుగానీ పట్టించుకోవడం లేదు. నెలల తరబడి కొనసాగుతున్న క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం త్వరగా ముగిస్తే తప్ప ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పేలా లేవు.’’ - లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
రెవెన్యూ సేవలు వేగవంతం చేయాలి
ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనకాపల్లిరూరల్, న్యూస్‌లైన్: రెవెన్యూ సేవలు వేగవంతం చేయాలని, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయంలో శనివారం డివిజన్ తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఉద్యోగులంతా విధులకు అంకి తం కావాలని సూచించారు. నియోజకవర్గంలోని పేదలను గుర్తించి వారికి ఇళ్లందిస్తామని, ప్రతి పౌరునికి రేషన్ కార్డు సత్వరం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలను ఖండించారు. నూతన ఎమ్మెల్యే గోవింద మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాసుపుస్తకాల్లేవని ఎక్కువ మంది తన దృష్టికి తీసుకువచ్చారని, అర్హులైన వారందరికీ పాసుపుస్తకాలు అందేలా చూడాలని కోరారు. ప్రజలు ఏ సమస్యపైనైనా తనను నేరుగా సంప్రదించవచ్చునన్నారు. తన పేరు చెప్పుకుని ఎవరైనా అధికారుల వద్దకు వచ్చి సిఫారసులు చేస్తే వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వసంతరాయుడు పాల్గొన్నారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ‘రెవెన్యూ’ సమ్మె
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవో సంఘం పిలుపు మేరకు.. జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ విషయాన్ని జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా ఆధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీకాంత్‌లు మంగళవారం తెలిపారు. గురువారం నుంచి వీఆర్ఏ, వీఆర్ఓ నుంచి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంటామన్నారు. సమ్మెకు అందరూ సహకరిం చాలని కోరారు.