రెవెన్యూ పాలనకు తాళం! | Key to the rule! | Sakshi
Sakshi News home page

రెవెన్యూ పాలనకు తాళం!

Published Sat, Apr 11 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

రెవెన్యూ పాలనకు తాళం!

రెవెన్యూ పాలనకు తాళం!

ఎమ్మార్వో ఆఫీసుల్లో 13 లక్షల దరఖాస్తులు పెండింగ్
సిబ్బంది అంతా భూముల క్రమబద్ధీకరణ పనిలోనే..
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకూ దిక్కులేదు
తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులు
ఉచిత క్రమబద్ధీకరణకు 3,36,869 దరఖాస్తులు
అధికారులు సిఫారసు చేసినవి 72 వేలే...
 
 
(‘సాక్షి’ ప్రత్యేకం)
 రాష్ట్రంలో రెవెన్యూ పాలన స్తంభించిపోయింది.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి రైతులకు పహాణీల వరకూ ధ్రువపత్రాల జారీ ఆగిపోయింది.. వీఆర్వోల నుంచి తహసీల్దార్ల దాకా అంతా ‘భూ క్రమబద్ధీకరణ’ పనిలో పడి పౌరసేవలను గాలికొదిలేశారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో కలిపి ఏకంగా 13 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలే చెబుతుండడం గమనార్హం. పోనీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘క్రమబద్ధీకరణ’ అయినా వేగంగా సాగుతోందా? అంటే సమాధానం లేదు. రెవెన్యూ సిబ్బంది అంతా మూడు నెలలుగా ‘కష్టపడు’తున్నా.. ఇంకా 25 వేల వరకూ దరఖాస్తుల పరిశీలనే జరగలేదని తెలుస్తోంది.   


రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సేవలన్నీ నిలిచిపోయాయి. ఎమ్మార్వో కార్యాలయాల్లో విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కూడా అందని దుస్థితి నెలకొంది. మూడు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ వ్యవహారం తప్ప వేరొకపనిపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించడం లేదు. క్రమబద్ధీకరణపై రోజువారీ సమీక్షలు,  క్షేత్ర స్థాయిలో ఆక్రమణల పరిశీలనతోనే సమయమంతా గడచిపోతోందని.. మిగతా పనులు ముట్టుకుంటే ఉన్నతాధికారుల నుంచి మొట్టికాయలు పడుతున్నాయని అధికారులే వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా రెవెన్యూ విభాగం నుంచి ప్రజలకు అందించాల్సిన సేవల గురించి పట్టించుకోవడం లేదు. సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకు రెవెన్యూ విభాగం నుంచి 47 రకాల సేవలు పొందే వీలుంటుంది. ఈ సేవల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా... యంత్రాంగం పట్టించుకోక అవన్నీ పక్కనపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో కలిపి సుమారు 13 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి.
 - సాక్షి, హైదరాబాద్
 
క్రమబద్ధీకరణ కూడా అంతంతే..

భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్లే మిగతా సేవలను అందించలేకపోతున్నామని చెబుతున్న రెవెన్యూ అధికారులు.. ఆ ప్రక్రియనైనా వేగంగా పూర్తి చే యడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత క్రమబద్ధీకరణ కోసం 3,36,869 దర ఖాస్తులు రాగా.. పరిశీలన అనంతరం పట్టాలివ్వాల్సిందిగా అధికారులు సిఫార్సు చేసింది 72 వేల దరఖాస్తులనే. క్రమబద్ధీకరణకు అర్హత కలిగిన మరో 14 వేల దరఖాస్తులను చెల్లింపు కేటగిరీలోకి మార్చారు. 93,770 దరఖాస్తుల్లో పేర్కొన్న స్థలాలు రైల్వే, మిలటరీ, అటవీశాఖకు చెందినవిగా పేర్కొన్నారు. మిగతావి కోర్టు కేసుల్లో ఉన్నందున పక్కనపెట్టారు. మొత్తంగా 2.43 లక్షల దరఖాస్తుల్లో పేర్కొన్న స్థలాలపై అభ్యంతరాలున్నాయని అధికారులు తేల్చారు. అయినా ఇంకా పరిశీలన జరపాల్సిన దరఖాస్తులు పాతిక  వేలకుపైగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు అటవీ, రైల్వే, మిలటరీ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల భూముల్లోని ఆక్రమణలపై ఆయా విభాగాలతో చర్చిస్తామన్న ప్రభుత్వం... ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాల్లేవు. చివరికి సిద్ధం చేసిన పట్టాలను మాత్రమే ఈ నెల 14 నుంచి పంపిణీ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
 
అందాల్సిన సేవలివే..

మండల స్థాయిలో ప్రజలకు మొత్తం 47 రకాల సేవలను రెవెన్యూ యంత్రాంగం అందించాలి. వాటిలో ప్రధానంగా కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టు కోసం ప్రత్యేక నివాస ధ్రువీకరణ, ఇంటిగ్రేటెడ్(కుల, స్థానిక, పుట్టినతేదీ) సర్టిఫికెట్, ఎఫ్-లైన్ పిటిషన్స్, సబ్ డివిజన్ ఆఫ్ ల్యాండ్స్, మ్యుటేషన్ మరియు పట్టాదారు పాస్‌బుక్, నోఎర్నింగ్ మెంబర్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఓబీసీ, ఈబీసీ ధ్రువీకరణ పత్రాలు, వ్యవసాయ ఆదాయ ధ్రువపత్రం, కాపీ ఆఫ్ విలేజ్ మ్యాప్, మనీ లెండింగ్ లెసైన్సులు, పేరులో మార్పులు, నో ప్రాపర్టీ సర్టిఫికెట్, వ్యవసాయ భూమి విలువ ధ్రువపత్రం, సన్నకారు రైతు ధ్రువీకరణ, వాల్టా చట్టం ప్రకారం బోర్‌వెల్స్‌కు అనుమతి, డీ మార్కేషన్ ఆఫ్ బౌండరీస్, లోకలైజేషన్ ఆఫ్ ప్రాపర్టీస్, ప్రస్తుత అడంగల్/పహాణీ, రికార్డ్ ఆఫ్ రైట్స్ 1బి, ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ కాపీ/టిప్పన్, ఇంతకు ముందు జారీచేసిన ధ్రువపత్రాల నకళ్లు, అడంగల్/పహాణీల్లో మార్పులు, ఈ-పాస్ పుస్తకాల జారీ, పాత అడంగల్ కాపీల నకళ్లు, ఇళ్ల స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు, రుణ అర్హత కార్డుల మంజూరు, డీఫార్మ్ పట్టా, కాసరా, చేసలా పహాణీ నకళ్లు, వసూల్ బాకీ, ఫైసల్ పట్టీ, పంచనామా సర్టిఫైడ్ కాపీలు, రక్షిత కౌలుదారు ధ్రువీకరణ తదితర సేవలు ఉన్నాయి. ఆయా సేవలను నిర్ణీత వ్యవధిలోగా అందించాలని సిటిజన్ చార్టర్‌లో పేర్కొన్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.
 
అంతా అస్తవ్యస్తం..

 ‘‘భూముల క్రమబద్ధీకరణ మినహా ప్రభుత్వం వేరే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లే దు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వీఆర్వో నుం చి డిప్యూటీ తహసీల్దారు వరకు అన్నిస్థాయిల ఉద్యోగులను క్రమబద్ధీకరణ కోసమని పట్టణ ప్రాంతాలకు డెప్యుటేషన్‌పై పంపారు. దీంతో ఆయా మండలాల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. వివిధ రకాల రెవెన్యూ సేవలు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలిసినా.. ఆయా జిల్లాల కలెక్టర్లుగానీ, ప్రభుత్వ పెద్దలుగానీ పట్టించుకోవడం లేదు. నెలల తరబడి కొనసాగుతున్న క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం త్వరగా ముగిస్తే తప్ప ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పేలా లేవు.’’
 - లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం
 రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement