సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ పశ్చిమ): గతంలో ఎప్పుడూ జరగనన్ని రెవెన్యూ సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో పెద్దఎత్తున జరిగాయని, తద్వారా లక్షలాది మందికి ప్రయోజనం కలిగిందని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రూ.76 వేలకోట్ల విలువైన భూమిని 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలుగా ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూమిని ఇచ్చాయని, ఈ ప్రభుత్వమే తొలిసారి వేలకోట్లతో భూమి కొని ఇళ్లస్థలాలు ఇచ్చిందని చెప్పారు. విజయవాడలో ఆదివారం జరిగిన రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్ భూములు, చుక్కల భూములు, షరతులు గల భూములు, సర్వీస్ ఈనాం వంటి లక్షల ఎకరాల భూములు త్వరలో ఓపెన్ మార్కెట్‌లోకి వస్తాయని తెలిపారు. రెవెన్యూశాఖ మరింత బలోపేతమవడంతోపాటు దాని గౌరవం కూడా పెరిగిందన్నారు. నీతి ఆయోగ్ ఇచ్చిన మోడల్ చట్టాన్ని తీసుకుని కొత్త టైటిలింగ్ చట్టాన్ని రూపొందించి రాష్ట్రపతి అనుమతి కోసం పంపామని, అది వస్తే రెవెన్యూశాఖ ఇంకా పవర్‌ఫుల్‌గా మారుతుందని చెప్పారు. రెవెన్యూశాఖ పేరును ల్యాండ్ అడ్మిస్ట్రేషషన్ అండ్ జనరల్ అడ్మిస్ట్రేషషన్‌గా మార్చాల్సిన అవసరం ఉందని, ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో మాట్లాడతానని తెలిపారు.
ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్–1977 చట్టాన్ని మార్చడంతో 30 లక్షల ఎకరాల భూమి మళ్లీ వ్యవస్థలోకి వస్తుందన్నారు. ఇన్ని లక్షల ఎకరాల భూమి టైటిల్ ఫ్రీగా అయితే రాష్ట్రంలో ఆరి్థక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు లేవనెత్తిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని, సీఎం మానవతాకోణం ఉన్న వ్యక్తి అని చెప్పారు.
ఉద్యోగులకు చేయాల్సినవన్నీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ సాయిప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులు టార్గెట్ సమయాన్ని కొంత ఎక్కువైనా తీసుకుని పనిచేయాలని, ఒత్తిడికి గురవ్వద్దని చెప్పారు. భవిష్యత్తులో ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ వ్యవస్థ వస్తుందని, వ్యవసాయ భూములతోపాటు నివాస, పారిశ్రామిక తదితర భూములన్నీ రెవెన్యూ పరిధిలోకి వస్తాయని తెలిపారు.
ప్రభుత్వం మన సమస్యల్ని పరిష్కరిస్తోంది
ఏపీ రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని చెప్పారు. అయితే ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. గత ప్రభుత్వ పాలనలో వీఆర్‌ఏ, వీఆర్‌వోలకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రూ.300 ఉన్న డీఏను రూ.500కు పెంచారని తెలిపారు. వచ్చే ఏడాదికి రెవెన్యూశాఖ ఏర్పడి 60 ఏళ్లవుతున్న నేపథ్యంలో జూన్ 20వ తేదీని రెవెన్యూ డేగా ప్రకటించాలని కోరారు.
రెవెన్యూ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరికీ ఉమ్మడి సర్విస్ రూల్స్ అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఎస్.ఢిల్లీరావు, వేణుగోపాలరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. తొలుత లెనిన్ సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్‌కు ఎన్నికైన 30 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment