
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం కాకినాడ జిల్లా తునిలో విజయయాత్ర చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. పరిసర ప్రాంత గ్రామాలన్నీ తుని బాటపట్టాయి. కొట్టాం సెంటర్ వద్ద ప్రారంభమైన యాత్రకు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళల బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీనివాససెంటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, సినిమా రోడ్డు, శాంతినగర్ మీదుగా రాజా కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం తుని ఎమ్మెల్యే, మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలు, సాధికారతకు చేస్తున్న కృషిని నేతలు వివరించారు. సభ ఆద్యంతం ‘జగనే రావాలి – జగనే కావాలి’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు.
సీఎం జగన్‌తోనే అణగారిన వర్గాల బతుకుల్లో మార్పు : మంత్రి ధర్మాన
సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో అణగారిన వర్గాల బతుకుల్లో మార్పు వచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. దశాబ్దాలుగా నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచి, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎవరికీ తలవంచకుండా, ఎవరికీ పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. సంస్కరణలకు నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో 30 ఏళ్ళు సీఎంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అంతరాలను తగ్గించడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దమ్మున్న ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు.
చంద్రబాబును రాజకీయాలకు దూరం చేద్దాం: మంత్రి అప్పలరాజు
గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ వర్గాలను అక్కున చేర్చుకొని, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను నీచంగా చూసి, హేళనగా మాట్లాడిన చంద్రబాబుకి మరోమారు గుణపాఠం చెప్పాలన్నారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని పిలుపునిచ్చారు.
సామాజిక విప్లవకారుల ఆశయాలను నిజం చేసిన జగన్: మంత్రి నాగార్జున
మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే వంటి సామాజిక విప్లవకారుల ఆశయాలను నిజం చేసిన సీఎం దేశంలో జగన్ ఒక్కరేనని తెలిపారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవన ప్రమాణాలను సీఎం జగన్ మెరుగు పరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం అందని ఇల్లు లేదంటే అది సీఎం జగన్ సుపరిపాలనే అని తెలిపారు.
వంచనకు గురైన వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారు: మంత్రి వేణుగోపాలకృష్ణ
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. గత పాలనలో వంచనకు గురైన సామాజిక వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారన్నారు. సామాజిక సాధికారత అంటే ఏమిటో దేశానికి చూపించారని తెలిపారు. బీసీల్లో మార్పు కోసం సీఎం జగన్ కుల గణన చేపడుతున్నారన్నారు. మోసం, అబద్దం, కుట్ర, కుతంత్రం అంటే చంద్రబాబేనన్నారు.
ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం జగన్: మంత్రి అనిల్‌కుమార్
అన్ని పదవుల్లో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి, ఈ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. సీఎం జగన్‌ను మనమంతా గుండెల్లో పెట్టుకోవాలన్నారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు అంతకు ఐదు రెట్లు పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారని, మరోసారి మోసం చేసేందుకే ఈ రకమైన హామీలిస్తున్న ఆ ఇద్దరినీ ఎప్పటికీ నమ్మొద్దని చెప్పారు. ఎంపీ వంగా గీత, వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తుని సామాజిక సాధికార సభలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి, సభకు పోటెత్తిన అశేష జన సందోహంలో ఓ భాగం
Comments
Please login to add a commentAdd a comment