అవినీతి రహిత సంక్షేమాన్ని సాధ్యం చేసిన జగన్‌ | minister dharmana prasada rao at Gajapatinagar public meeting | Sakshi
Sakshi News home page

అవినీతి రహిత సంక్షేమాన్ని సాధ్యం చేసిన జగన్‌

Published Sat, Oct 28 2023 4:44 AM | Last Updated on Sat, Oct 28 2023 5:33 AM

minister dharmana prasada rao at Gajapatinagar public meeting - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘సంక్షేమ పథకాలను బీదలకు నేరుగా అందించలేకపోతున్నామని గతంలో ఓ ప్రధాన మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో ఉన్న వారు తినేస్తుంటే ఏమీ చేయలేక చేతులెత్తేశారు. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పైసా అవినీతి జరగకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లక్షల కోట్లు బీదల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇలా అవినీతి రహిత సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే. వైఎస్‌ జగన్‌ పాలనలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూస్తు­న్నాం’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.

వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అధ్యక్షతన జరిగిన సభలో ధర్మాన ప్రసంగించారు. గత టీడీపీ పాలనలో పచ్చ జెండా కట్టిన వాడికి, జన్మభూమి కమిటీలకు, డబ్బు­లిచ్చిన వారికే పథకాలు అందేవని మంత్రి ధర్మాన చెప్పారు. ఇప్పుడు అర్హుడైతే చాలు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వివరించారు. ఎక్కడా ఏ అధికారీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్త నయా పైసా లంచం అడిగిన దాఖలాల్లేవ­న్నారు. వందేళ్ల క్రితం బ్రిటిష్‌ హయాంలో జరిగిన భూసర్వేతో కలుగుతున్న అవస్థల నుంచి తప్పించడానికి తమ ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. ఏ రైతునూ సర్వే రాళ్లు, పాసు పుస్తకం కోసం ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు. ఇటువంటి పరి­పాలనే కదా ప్రజలు కోరుకుంటారని చెప్పారు. రైతు­లను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను నమ్మించి వంచించిన చంద్రబాబు ముఠాకు ఎవరైనా ఓట్లేస్తారా అని ప్రశ్నించారు.

టీడీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్‌సీపీ పాలనలో చూపించడానికి లోపాల్లేక.. దేశమంతా పెరిగిన కరెంట్‌ బిల్లులు, పెట్రోల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు చూపిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన రాష్ట్ర ప్రజలను అడిగితే వాస్తవమేమిటో చెబుతారని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత దశాదిశా మార్చడా­నికి, ఇక్కడి పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విశాఖలో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

తన పాలనలో ఏనాడూ ఏ ఒక్క మేలూ చేయకపోయినా ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీని ఆదరించారని, వారినే చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. బాబుకు, టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని, అన్ని వర్గాల సంక్షేమ సారథి వైఎస్‌ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి  వెంకట చినఅప్పలనాయుడు, పాముల పుష్ప శ్రీవాణి, కంబాల జోగులు, బడ్డుకొండ అప్పల­నాయుడు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌ బాబు, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి : బొత్స
పజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుదిద్దు­తున్న సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని నిలబెట్టు­కోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స చెప్పారు. రాష్ట్రంలో సామాజిక సాధికారత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. నిష్పక్షపాతంగా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

చంద్రబాబు గిరిజనులకు, మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసిన మోసాన్ని మరిచిపోలేమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాతే ఈ వర్గాలకు మేలు చేకూరిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో బీసీలకు టికెట్టు ఇచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే అప్పలనర్సయ్య సవాలు విసిరారు. యాత్ర సందర్భంగా మీడియాతో బొత్స మాట్లాడుతూ..  చంద్రబాబు నిత్య నయవంచకుడు అని, సీఎం వైఎస్‌ జగన్‌  రాష్ట్రంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement