విశాఖలో ‘ఫైనాన్షియల్‌ హబ్‌’ ఏర్పాటుకు వినతి  | A request to establish a financial hub in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ‘ఫైనాన్షియల్‌ హబ్‌’ ఏర్పాటుకు వినతి 

Published Fri, Dec 1 2023 3:07 AM | Last Updated on Fri, Dec 1 2023 8:46 PM

A request to establish a financial hub in Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి : ఉత్తర కోస్తా జిల్లాల్లో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు విశాఖపట్నంలో ‘ఫైనాన్షియల్‌ హబ్‌’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజి్రస్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం లేఖ రాశారు. ఉత్తర కోస్తా జిల్లాల అభివృద్ధికి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ధర్మాన.. రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచీలో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర విభజన (2014) తర్వాత విశాఖపట్నం కాస్మోపాలిటన్‌ నగరంగా ఎదిగిందని, అత్యధిక సంఖ్యలో కార్పొరేషన్లు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కేంద్రమైందని పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌ హబ్‌ కోసం విశాఖపట్నంలో 100 ఎకరాలు కేటాయించాలని సీఎంను అభ్యర్థించారు. ఈ ప్రాంతంలో అన్ని షెడ్యూల్డ్‌ బ్యాంకులు, ఇతర లీడ్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థల జోనల్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వస్తాయన్నారు.

వీటితోపాటు ఆర్థిక సేవల సంస్థలు, ప్రముఖ న్యాయ సంస్థలు, రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మద్దతుగా విశాఖపట్నంలో రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరాలని విజ్ఞప్తి చేశారు.  

‘సోషల్‌ రెస్పాన్సిబిలిటీ అథారిటీ’ నెలకొల్పండి 
విశాఖ ప్రాంతంలో అత్యధిక కంపెనీలు ఉన్నాయని, కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంస్థలు సైతం సేవలు అందిస్తున్నాయని మంత్రి ధర్మాన తెలిపారు. వీటికి అనుబంధంగా రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ అథారిటీ’ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్లు ఏటా దాదాపు రూ.1,000 కోట్లను సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ఇస్తున్నాయని, విశాఖలోని కార్పొరేషన్లు, కంపెనీలు అందించే సీఎస్‌ఆర్‌ నిధులు కూడా ఈ అథారిటీకి వస్తాయని సూచించారు. ఈ నిధులను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ తరహాలో వినియోగించవచ్చన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement