రెవెన్యూ శాఖలో గందర గోళం
► టైటిల్‌డీడ్లు, పాసుపుస్తకాలు రద్దంటూనే జీవో ఇవ్వని వైనం
► ఆన్‌లైన్ 1బి రికార్డుతోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంటూ ప్రచారం
► పూర్తి కాని ఆన్‌లైన్ నమోదు
► ఇబ్బందులకు గురవుతున్న కక్షిదారులు
ఆనందపురం : రెవెన్యూ సేవలలో పారదర్శకత, అవి నీతి లేని కార్యకలాపాల నిర్వాహణ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ఆచరణలో మా త్రం కనిపించడం లేదు. రోజుకో ప్రకటన చేస్తున్న ప్రభుత్వం జీవోలు విడుదల చేయకపోవడంతో సంస్కరణలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కార్య కలాపాలన్నీ పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయి.
ఇదీ పరిస్థితి
గతంలో 10-1, అడంగల్‌లో పేర్లు నమోదైన రైతులకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్‌లు మంజూరు చేసేవారు. భూ రికార్డుల కంప్యూటరీకరణ పేరుతో వెబ్ ల్యాండ్‌ని ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఐదేళ్లైనా ప్రక్రియ కొన సాగుతూనే ఉంది. పట్టాదారు పాసు పుస్తకం తయారు చేసి జారీ చేసే అధికారం తహశీల్దారుకు, టైటిల్ డీడ్‌లు అందించే అధికారం ఆర్డీవోలకు కట్టబెట్టారు. అక్కడ కూడా మామ్మూళ్లు తంతు కొనసాగుతుందనిఆరోపణలు రావడంతో టైటిల్ డీడ్‌లు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పాసుపుస్తకాల తయారీని ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పెట్టింది. అక్కడ కూడా సిఫార్సులకు పెద్ద పీట వేస్తుండడంతో తాజాగా పట్టాదారు పాసుపుస్తకం జారీ విధానాన్ని రద్దు చేశారు. కేవలం ఆన్‌లైన్‌లో ఉన్న 1బి, అడంగల్ సమాచారం పై ఆధారపడాలని ఇక నుంచి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కూడా ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారంతోనే జరుగుతుందని ప్రకటించినా ఇంత వరకూ అమలకు నోచుకోలేదు. దీంతో అంతటా అయోమయ పరిస్థితి నెలకొంది.
రిజిస్ట్రేషన్ల విషయంలో గందరగోళం
రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు ప్రవేశ పెడుతున్నా వాటికి సంబంధించిన స్పష్టమై ఆదేశాలను మాత్రం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జారీ చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకుంటున్నాయి. ఆన్‌లైన్ 1బి, పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌లు ఉంటేనే వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ చేయాలని నిబంధన ఉంది. కానీ పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్‌లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మాత్రం 1బి రికార్డుతో రిజిస్ట్రేషన్లు చేయ వచ్చని జీవో ఇవ్వక పోవడంతో సబ్ రిజిస్ట్రార్లు అయోమయానికి గురవుతున్నారు.