ఎందుకిలా?
ఆరు నెలల్లోనే బదిలీ అయిన శాలిని మిశ్రా
ముక్కుసూటి తనమే ముంచిందా...?
సంస్థలో చర్చోప చర్చలు
సిటీబ్యూరో : ఆన్‌లైన్‌లో అన్ని అనుమతులు ఇవ్వడం ద్వారా అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ఉన్నఫలంగా బదిలీ అవ్వడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఎండీఏలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభించకుండానే ఆమెను తప్పించడం వెనుక రకరకాల కారణాలున్నట్లు వదంతులు విన్పిస్తున్నాయి. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే శాలిని మిశ్రాపై బదిలీ వేటు వేయడం వెనుక పలువురు రియల్టర్ల వత్తిళ్లు గట్టిగా పనిచేసినట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హెచ్‌ఎండీఏను సంస్కరించేందుకు శాలిని మిశ్రాను నియమించినట్లు ప్రకటించిన సీఎం...ఆరు నెలలు తిరక్కుండానే బదిలీ చేయడం ఏమిటన్న ప్రశ్న సర్వత్రా విన్పిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో లెక్కకుమించి పుట్టుకొచ్చిన అక్రమ లేఅవుట్లపై ఇటీవల శాలిని మిశ్రా ఉక్కుపాదం మోపారు.
వరుస దాడులు నిర్వహిస్తూ పలు లే అవుట్లలోని నిర్మాణాలను కూల్చివేసి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలను తొలగించారు. నగరం నలువైపులా ఉన్న అక్రమ లేఅవుట్లపై హెచ్‌ఎండీఏ సిబ్బంది దాడులు నిర్వహిస్తుండటంతో కొందరు రియల్టర్లు ప్రభుత్వ పెద్దలపై వత్తిడి తెచ్చి శాలిని మిశ్రాను హెచ్‌ఎండీఏ నుంచి తప్పించినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనికితోడు వివిధ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లో ఇస్తే అక్రమార్కుల ఆటలు సాగవు క నుక ఆ విధానాన్ని అడ్డుకొనేందుకు కొందరు తమకున్న పలుకుబడిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. గాడితప్పిన ప్లానింగ్ విభాగాన్ని సంస్కరించేందుకు ఆమె చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
కండ్లకోయ, కోకాపేట భూ సేకరణకు సంబంధించిన కేసులు, ఐటీ బకాయిలు వంటి సమస్యలు సంస్థను చుట్టుముట్టడంతో వీటి పైనే ఆమె దృష్టిపెట్టి ఓ కొలిక్కి తెచ్చారు. ప్రధానంగా ప్లానింగ్ విభాగం నుంచి తప్పించిన ఓ అధికారిని ప్రభుత్వం తిరిగి అదే పోస్టులో నియమించడం శాలిని మిశ్రాకు మింగుడు పడలేదు.
కారణాలివేనా...?
శాలిని మిశ్రా హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్న అపవాదు ఉంది. విశ్వనగరం ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా సాధించలేక పోయారు.కొత్త లేఅవుట్లకు అనుమతులిచ్చే విషయంలో కూడా తుచ తప్పకుండా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడకుండా చేశారు.హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్ రూపకర్తల్లో ప్రధాన భూమిక పోషించిన ప్లానింగ్ కన్సల్టెంట్ శర్మకు అకారణంగా ఉద్వాసన పలకడంపై ఉద్యోగుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.నిర్ణీత సమయం ముగిశాక కూడా విధులు నిర్వహించాలని సిబ్బందికి హుకుం జారీ చేసి ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకొన్నారు.