సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికిన భూముల కథ మొదటికొచ్చింది. పోటాపోటీగా వేలంలో పాల్గొని అత్యధిక రేట్లు కోట్ చేసి భూములు దక్కించుకున్న బిడ్డర్లు ఇపుడు వీటివైపు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు వేలం వేసిన ప్లాట్లు తమకే చెందుతాయని కొందరు కోర్టుకెక్కారు. దీంతో భారీ ఆదాయం వస్తుందనుకున్న హెచ్‌ఎండీఏ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. హెచ్‌ఎండీఏ మూడు నెలల కిందట ఓపెన్ ప్లాట్లను ఆన్‌లైన్ వేలంలో విక్రయానికి పెట్టగా మాదాపూర్‌లోని ప్లాట్లు అత్యధికంగా చదరపు గజానికి రూ.1.52 లక్షల చొప్పున ధర పలికాయి. అంచనాలకు మించి ధరలు నమోదవడంతో 189 ప్లాట్లకు వేలం వేసిన సంస్థ.. రూ.352 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలేసుకుంది. కానీ బిడ్డర్లు ధర చెల్లించకపోవడంతో ఆదాయం రూ.200 కోట్లు కూడా దాటేటట్లు లేదని హెచ్‌ఎండీఏ అధికారులు తల పట్టుకుంటున్నారు.
ఆదిలోనే చుక్కెదురు
హెచ్‌ఎండీఏ అమ్మకానికి పెట్టిన ప్లాట్లకు ఆరంభంలోనే చుక్కెదురైంది. 189 ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేయగా.. 80 ప్లాట్లపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి తమ వద్ద పత్రాలు ఉన్నాయని, తమకే చెందుతాయని హెచ్‌ఎండీఏ వాదించడంతో వేలం కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. కానీ విక్రయాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. దీంతో వేలం త్రిశంకుస్వర్గంలో పడినట్లయింది. వేలంలో ప్లాట్లను దక్కించుకున్న కొనుగోలుదారులు డబ్బులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా.. కోర్టు తీర్పు కారణంగా స్వాధీనం చేసే పరిస్థితి లేదు. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మియాపూర్‌లో మయూరీ నగర్ లే అవుట్‌లో 42 ప్లాట్లు, బాచుపల్లి, నల్లగండ్ల ప్రాంతాల్లో మిగతా ప్లాట్లు కోర్టు కేసుల జాబితాలో ఉన్నాయి. వేలంలో అత్యధికంగా రేటు పలికిన ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉండటం గమనార్హం.
31 మందికి నోటీసులు!
అత్యధిక రేట్లతో భూములు కొనుగోలు చేసిన బిడ్డర్లు కొందరు కోర్టు కేసుల వల్ల ముఖం చాటేశారు. డబ్బులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. కోర్టు కేసుల్లేని 109 ప్లాట్లను దక్కించుకున్న వారిలో ఇప్పటివరకు 78 మంది ఈఎండీతో పాటు 25 శాతం బిడ్డింగ్ సొమ్మునూ చెల్లించారని.. మిగతా 31 మంది కొనుగోలుదారులు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఎస్‌ఎంఎస్, ఈ–మెయిళ్ల ద్వారా సమాచారం పంపించినా స్పందన లేకపోవడంతో ఆఖరి అస్త్రంగా నోటీసులు జారీ చేసి, ఈఎండీని జప్తు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ జరిపిన సమీక్షలో భూముల వేలం, నోటీసుల వ్యవహారం చర్చకు వచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment