land auction
-
దావూద్ కుటుంబీకుల ఆస్తులకు రూ.2 కోట్లకు పైగా ధర
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసు సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యులకు చెందిన రెండు స్థిరాస్తులు వేలంలో రూ.2 కోట్లకు పైగా ధర పలికినట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్సే్ఛంజి మానిప్యులేటర్స్ చట్టం కింద శుక్రవారం ముంబైలోని ఆయకార్ భవనంలో వేలం చేపట్టామన్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తహశీల్ ముంబాకే గ్రామంలోని నాలుగు చోట్ల ఉన్న భూములను వేలానికి ఉంచినట్లు చెప్పారు. వీటిలో సుమారు 171 చదరపు మీటర్ల భూమి ధర వేలంలో అత్యధికంగా రూ.2.01 కోట్లు, మరో 1,730 చదరపు మీటర్ల స్థలం రూ.3.28 కోట్లు పలికిందని చెప్పారు. ఈ రెండింటిని ఢిల్లీకి చెందిన లాయర్ కొనుగోలు చేశారని వివరించారు. మిగతా రెండు ప్లాట్లకు ఎవరూ టెండర్లు వేయలేదని వివరించారు. -
బుద్వేల్ భూం భూం.. ముగిసిన వేలం
Updates.. ►బుద్వేల్‌లో భూముల ఈ-వేలం ముగిసింది. మొత్తం 14 ప్లాట్లు 100.1 ఎకరాలను హెచ్ఎండీఏ విక్రయించింది. ఈ-వేలంలో రూ.3625.73 కోట్లు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరింది. ►ఈరోజు జరిగిన వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ.41.75కోట్లు పలికింది. ► అత్యల్పంగా ఎకరం ధర రూ.33.25 కోట్లు పలికింది. ► కాసేపట్లో బుద్వేలు భూముల ఈ-వేలం ముగియనుంది. ► భూముల వేలంంలో సరాసరి రూ.33 నుంచి 35 కోట్లతో బుద్వేల్ భూములు అమ్ముడవుతున్నాయి. ► ఈ క్రమంలో ప్రభుత్వానికి దాదాపు రూ.5వేల కోట్ల భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ► రెండో సెషన్లో రెండు ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ► రెండో సెషన్లో ప్లాట్ నెంబర్-13 కోసం హోరాహోరి బిడ్డింగ్ జరుగుతోంది. ప్లాన్ నెంబర్-13లో అత్యధికంగా ఎకరం ధర రూ.40.25కోట్లు పలుకుతోంది. ► ప్లాట్ నెంబర్-13లో మొత్తంగా 6.96 ఎకరాల ల్యాండ్ ఉంది. ► బుద్వేల్ భూముల ఈ-వేలం తొలి సెషన్ ముగిసింది. తొలిసెషన్లో 1,2,4,5,8,9,10 ప్లాట్లకు వేలం జరిగింది. ► తొలి సెషన్ బుద్వేల్ భూముల వేలంలో 58.19 ఎకరాలకు మెత్తం ఆదాయం రూ.2061 కోట్లు వచ్చింది. ► అత్యధికంగా ప్లాట్ నంబర్-4లో ఎకరం ధర రూ.39.25 కోట్లు. (14.33 ఎకరాలు) ► అత్యల్పంగా ఎకరం ధర ప్లాట్ నంబర్-2,5లో ఎకరం ధర. రూ.33.25 కోట్లు (plot no 2&5 total 18.74 ఎకరాలు) ► ప్లాట్ నెంబర్-1లో ఎకరం రూ.34.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-8లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-9లో ఎకరం రూ. 33.75 కోట్లు. ►ప్లాట్ నెంబర్-10లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► కొనసాగుతున్న బుద్వేల్ భూముల వేలం ► రెండో సెషన్ వేలం ప్రారంభం ► రెండో సెషన్లో 11, 12,13,14,15, 16,17 ప్లాట్ల వేలం జరుగనుంది. ► మొదటి సెషన్లో ఇంకా కొన్ని ప్లాట్లకు కొనసాగుతున్న వేలం. ► మొదటి సెషన్లో సరాసరి ఎకరం 25 కోట్లు దాటి నడుస్తున్న వేలం ► అత్యధికంగా 5వ నెంబరు ప్లాట్లోలో ఎకరం 32 కోట్లు దాటిన ధర. ► ప్లాట్ నంబర్-1.. ఎకరం రూ. 33.25 కోట్లు ► ప్లాట్ నంబర్-4.. ఎకరం రూ. 33.25 కోట్లు. తొలి సెషన్లో ఇలా.. ప్లాట్ నెంబర్-9లో ఎకరం 22.75కోట్లు ప్లాట్ నెంబర్ -10లో ఎకరం 23 కోట్లు. ప్లాట్ నెంబర్-7లో ఎకరం 27కోట్లు. ప్లాట్ నెంబర్-8లో ఎకరాకు 28 కోట్లు పలికింది. ► కోకాపేట తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా అత్యంత విలువైన బుద్వేల్ భూముల వేలానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఈ క్రమంలో వేలం కొనసాగుతోంది. కాగా, అత్యధికంగా 4వ నెంబర్‌కు 31 కోట్లు, 5వ నెంబరు ప్లాట్‌లో ఎకరం రూ.30 కోట్లు దాటి ధర పలికింది. ఇక పదో నెంబర్ ప్లాట్‌కి 23 కోట్లతో వేలం కంటిన్యూ అవుతోంది. ► ఇక, వేలం ప్రారంభం నుంచి ఈ-వేలం మందకోడిగా సాగుతోంది. వేలం ప్రారంభమై రెండు గంటలు దాటినా ధరలు మాత్రం పెద్దగా పలకడం లేదు. కాగా, సెషల్ ముగిసే సమయానికి ధరలు జోరందుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలం జోరందుకుంది. ఈ-వేలంలో ప్లాట్ నెంబర్ 9, 10లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. సరాసరి ఎకరం రూ. 25 కోట్లు దాటి వేలం నడుస్తోంది. కాగా, కనీస నిర్దేశిత ధర ఎకరం రూ.20 కోట్ల రూపాయలతో వేలం ప్రారంభమైన విషయం తెలిసిందే. ► ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 182 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బుద్వేల్ లే అవుట్ ప్లాట్ల అమ్మకంలో భాగంగా గురువారం ఈ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఫస్ట్ సెషన్ వేలంలో ప్లాట్ నెం.1,2,4,5,8,9,10 లకు బిడ్డర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్లను సమర్పిస్తున్నారు. ► మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు రెండో సెషన్‌గా నిర్వహించే వేలంలో మరో ఏడు ప్లాట్లకు వేలం జరగనుంది. ఇక్కడి లే అవుట్ లో ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు, గరిష్టంగా 14.3 ఎకరాలుగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వివరించారు. ఒక్కో ఎకరానికి మినిమమ్ అప్ సేట్ రేటుగా రూ. 20 కోట్లుగా నిర్ణయించి, ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత.. స్లోగన్స్‌తో దద్దరిల్లుతున్న పరిసరాలు -
బుద్వేల్ లో భూముల వేలం ఆపాలని హైకోర్ట్ న్యాయవాదుల సంఘం పిల్
-
హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల అమ్మకంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. ‘ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి’అంటూ కేటీఆర్ ఓ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పాత ఫొటోను జత చేస్తూ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు, అధికారంలోకి వచి్చన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా (నాన్న గారి మాటల్లోనే)!. మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ చరిత్రను మరిచిపోయేంత సన్నాసులం మేం కాదు. 75 ఏళ్ల నుంచి 99 శాతం ఉన్న బహుజనులు 1శాతం ఉన్న ఆధిపత్య పాలకులకు ఓట్లేసి గెలిపిస్తే పేదల భూములను కాపాడలేదు సరికదా అమాంతంగా మింగేసిండ్రు. బీఎస్పీ అధికారంలోకి వచి్చన వెంటనే పేదల భూములకు రక్షణ కలి్పస్తాం’అని తన ట్వీట్లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా వందల కోట్లకు అసైన్డ్ భూములను కొంటున్న కేసీఆర్, కేటీఆర్ బినామీల నుంచి భూములను తిరిగి తీసుకుంటామని, వాటిని పేద రైతులకు పంచుతామని ట్విట్టర్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. నిన్న కోకాపేట, రేపు బుద్వేల్, ఎల్లుండి ఆర్ఆర్ఎర్ చివరికి మిగిలేది గోచి గుడ్డనే అని ఎద్దేవాచేశారు. హలో... @KTRBRS గారు గీ ఫోటో గుర్తుందా? తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా(నాన్న గారి మాటల్లోనే) ! మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా… pic.twitter.com/XdWrEhdOtz — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 4, 2023 -
కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. కేసీఆర్ ఏమన్నారంటే...
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో భూముల ధర ఎకరాకు రూ.100 కోట్లకుపైగా పలకడం తెలంగాణ పరపతికి నిదర్శమని, రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి, ఇంత ధర చెల్లించి మరీ తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలని ప్రకటించారు. ‘‘ఇంతింతై వటుడింతై అన్నట్టుగా హైదరాబాద్ నగర అభివృద్ధి అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించపర్చిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరెంత నష్టం చేయాలని చూసినా దృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, కృషికి దక్కిన ఫలితమిది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ, మున్సిపల్ ఉన్నతాధికారులను అభినందించారు. (చదవండి: కోకాపేట ‘కనకమే’.. ఎకరం రూ.100 కోట్లు) -
HMDA: భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ). ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ వెలువరించింది. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జనవరి 16, 2023 గా పేర్కొంది. ప్రీ బిడ్ సమావేశాలు జనవరి 4,5,6 ఉంటాయని, ఈఎండీ చెల్లింపునకు జనవరి 17వ తేదీ వరకు గడువు విధించింది. భూముల వేలం జనవరి 18న ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలోని భూముల వేలానికి ముందుకు వచ్చింది. 300 గజాల నుండి 10 వేల గజాల వరకు ప్లాట్లను వేలంలో పెట్టింది హెచ్ఎండీఏ. ఈ వేలం ద్వారా భారీ ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. -
Uppal: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ మరోసారి అ‘ధర’హో అనిపించింది. గురువారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో చదరపు గజానికి ఏకంగా రూ.లక్షా ఒక వెయ్యి ధర పలికింది. ఓ కొనుగోలుదారు 222 చదరపు గజాల ప్లాట్‌ను సొంతం చేసుకోగా, మరొకరు ఇంతే ధర చెల్లించి 368 చదరపు గజాలను దక్కించుకున్నారు. 1,196 గజాలున్న మరో ప్లాట్‌కు రూ.77 వేల ధర లభించింది. మరోవైపు గురువారం నాటి బిడ్డింగ్‌లో 1,787 గజాలున్న మరో ప్లాట్‌కు గజానికి రూ.53 వేల చొప్పున కనిష్ట ధర లభించింది. ఈ వేలంలో సగటున గజానికి రూ.71,815.5 చొప్పున ధర పలికినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో హెచ్ఎండీఏకు రూ.141.61 కోట్ల ఆదాయం లభించింది. ఉప్పల్ భగాయత్‌లో వేలం నిర్వహించతలపెట్టిన 44 ప్లాట్లలో సుమారు 150 చదరపు గజాల నుంచి 1,787 చదరపు గజాల వరకు మొత్తం 19,719 చదరపు గజాల మేర విస్తరించి ఉన్న 23 ప్లాట్లకు ఆన్లైన్ బిడ్డింగ్ జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.77000, కనిష్టంగా రూ.53 వేలు పలికింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.లక్షా వెయ్యి చొప్పున, కనిష్టంగా రూ.73 వేల చొప్పున డిమాండ్ రావడం విశేషం. లుక్ ఈస్ట్ లక్ష్యంగా.. ►సుమారు రెండు వేల గజాల నుంచి 15 వేల గజాలకు పైగా ఉన్న మరో 21 ప్లాట్లకు శుక్రవారం ఈ– బిడ్డింగ్ జరగనుంది. ఉప్పల్ భగాయత్‌లోని హెచ్ఎండీఏ లేఅవుట్ ప్లాట్లకు వేలం నిర్వహించడం ఇది వరుసగా మూడోసారి. 2019లో నిర్వహించిన ఈ బిడ్డింగ్‌లో గజానికి గరిష్టంగా రూ.79 వేలు, కనిష్టంగా రూ.36 వేల వరకు ధర పలికింది. ఈ సారి పోటీ మరింత పెరిగింది. ►ఉప్పల్‌లో నిర్మాణ రంగం ఊపందుకుంది. పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణమవుతున్నాయి. మెట్రో రైలు సదుపాయంతో పాటు ఉప్పల్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనువైన రవాణా సదుపాయం ఉండడం, ఇటు వరంగల్ హైవేకు, అటు విజయవాడ హైవేకు అందుబాటులో ఉండడంతో మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాలు ఉప్పల్ భగాయత్‌పై ఆసక్తి చూపుతున్నాయి. ►ఈ క్రమంలోనే ప్రభుత్వం సైతం ‘లుక్ ఈస్ట్’ లక్ష్యంతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి సారించింది. దీంతో బడా బిల్డర్లు, నిర్మాణ సంస్థలు 10 అంతస్థుల నుంచి 26 అంతస్థుల వరకు కూడా అపార్ట్మెంట్ల నిర్మాణాలను చేపట్టాయి. ఈ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు హాట్ కేక్‌లా అమ్ముడవుతుండడంతో నిర్మాణ సంస్థలు ఈసారి మరింత పోటీ పడ్డాయి. ►గతంలో రూ.79 వేల వరకు డిమాండ్ రాగా ఈ సారి రూ.లక్ష దాటినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 1.35 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 44 ప్లాట్లలో 21 రెసిడెన్షియల్ ప్లాట్లు, 15 బహళ ప్రయోజన ప్లాట్లు ఉన్నాయి. షాపింగ్ కేంద్రాల కోసం మరో ప్లాట్లు, ఆస్పత్రులకు 2, విద్యాసంస్థలకు 2 ప్లాట్ల చొప్పున కేటాయించారు. -
ఆ ప్లాట్ల వేలం ఆపండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని భూముల వేలంపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పుప్పాలగూడలోని 11.02 ఎకరాల భూమిపై హక్కులు లేకపోయినా.. సంరక్షకుడిగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాందిశీకుల భూములను వేలం వేయడాన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఆ భూమిని వేలం వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ భూమిలో ఉన్న ప్లాట్ నంబర్లు 25 నుంచి 30 వరకు వేలం వేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సర్వే నంబర్ల జిమ్మిక్కులతో పిటిషనర్లను వేధింపులకు గురిచేయడం సరికాదని, పిటిషనర్లకు చెందిన భూమిని వేలం వేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. పుప్పాలగూడ సర్వే నంబర్ 301లోని 11.02 ఎకరాల భూమిని 2006, జూలై 31న తాము కొనుగోలు చేశామని, అయినా హెచ్ఎండీఏ ఆ భూముల్ని వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందంటూ లక్ష్మీ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ తరఫున సి.నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. కాందిశీకుల చట్టం కింద నవలాల్‌మాల్ ప్రజ్వానీ అనే కాందిశీకునికి ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు రాష్ట్రపతి 1950లో ఉత్తర్వులు జారీచేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ప్రజ్వానీ వారసుల నుంచి పిటిషనర్లు భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. 42 ఎకరాల వేలానికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అయినా నిబంధనలకు విరుద్ధంగా 99 ఎకరాలకు నోటిఫికేషన్ జారీచేశారని మరో న్యాయవాది నివేదించారు. పిటిషనర్ల భూములు సర్వే నంబర్ 302లో ఉన్నాయని, వేలం వేస్తున్న భూములపై పిటిషనర్లకు ఎటువంటి హక్కులు లేవని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరీందర్ పరిషద్ వాదనలు వినిపించారు. ఒకే ప్లాట్ రెండు సర్వే నంబర్లలో ఉన్నట్లుగా పేర్కొన్నారని, ఇదేలా సాధ్యమని ధర్మాసనం హరీందర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం..!
సాక్షి, హైదరాబాద్: భూముల వేలం ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుండటంతో తాజాగా మరో 117.35 ఎకరాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా ఖానామెట్, పుప్పాలగూడలోని 35 ప్లాట్లను వచ్చే నెల 27, 29 తేదీల్లో వేలం వేసేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆదివారం సాయంత్రం నుంచే ఆన్లైన్లో వేలం వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఖానామెట్‌లో 22.79 ఎకరాల విస్తీర్ణంలో 9 ప్లాట్లు, పుప్పాలగూడలో 94.56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 26 ప్లాట్లు వేలం వేయనున్నారు. సెప్టెంబర్ 27న ఖానామెట్, 29న పుప్పాలగూడలో ఈ వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ నిర్వహణకు టీఎస్ఐఐసీని రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు విధానం, వేలం ప్రక్రియ తదితరాలపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో టీఎస్ఐఐసీ ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం తేదీలు, అప్సెట్ ధర, ఈఎండీ, ఇతర నిబంధనలు సోమవారం వెలువడే నోటిఫికేషన్లో ఉంటాయని టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే 6 నెలల్లో మరిన్ని భూములు సైతం! ప్రభుత్వ భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ.20వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కరోనా, లాక్డౌన్ తదితర పరిస్థితుల్లో గత నెలలో జరిగిన వేలం పాటలో రూ.2729.78 కోట్లు సమకూరాయి. ప్రస్తుత వేలం ద్వారా సుమారు రూ. 6 వేల కోట్లు సమకూరుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే 6 నెలల్లో ఉప్పల్ భగాయత్ పరిధిలో ఖాళీగా ఉన్న ప్లాట్లతోపాటు మియాపూర్ మెట్రో సమీపంలోని స్థలాలను కూడా వేలం వేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మియాపూర్ సమీపంలోని హెచ్ఎండీఏ భూములతోపాటు జవహర్‌నగర్, బుద్వేల్, రావిర్యాల, కొంగర ఖుర్ద్, మహేశ్వరం, తుమ్మలూరు ప్రాంతాల్లోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్లాట్లను రాబోయే రోజుల్లో వేలం వేసే అవకాశమున్నట్లు తెలిసింది. -
కోకాపేట భూముల వేలం ఆపాలా?
సాక్షి, హైదరాబాద్: చెరువు క్యాచ్మెంట్ ఏరియా వెలుపల ఉన్న వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను జీవో 111 నుంచి తొలగించడానికి ప్రభుత్వం విముఖత చూపడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వట్టినాగులపల్లిలోని భూములను జీవో 111 నుంచి మినహాయిస్తే అక్కడ నిర్మాణమయ్యే బహుళ అంతస్తుల భవనాల నుంచి వచ్చే నీటితో కోకాపేట చెరువు కలుషితమవుతుందన్న ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. ఒకవైపు కోకాపేటలోని ప్ర భుత్వ భూములు వేలం వేస్తూ, మరోవైపు క్యాచ్మెంట్ ఏరియా వెలుపల ఉన్న రైతుల భూములు మాత్రం జీవో 111 పరిధిలో ఉండాలంటూ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను పాటించడం ఏంటని ప్రశ్నించింది. జీవో 111 పరిధికి దగ్గర్లోని కోకాపేటలో ప్రభుత్వం 49.8 ఎకరాలను ఇటీవల వేలం వేసి రూ.2 వేల కోట్లు సమకూర్చుకుందని, ప్రభుత్వం వేలం వేసిన కోకాపేట భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణాల నుంచి మురికినీరు వచ్చి కోకాపేట చెరువులో కలిసే అవకాశం లేదా అని నిలదీసింది. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే కోకాపేట భూముల వేలం తుది కేటాయింపులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కోకాపేట భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు గతంలో నిరాకరించామని, ఇప్పుడు ఈ పిటిషన్‌తో కలిపి ఆ పిల్లను విచారించి ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది. జీవో 111 పరిధి నిర్ణయానికి సంబంధించి ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ సమావేశాల మినిట్స్, నోటింగ్ ఫైల్స్‌ను బుధవారంలోగా తమకు సమర్పించాలని ప్రభుతాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్‌త్గీ వాదనలు వినిపించారు. కోకాపేట చెరువు కలుషితం కావొచ్చేమో! జీవో 111 పరిధి నుంచి గ్రామంలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ వట్టినాగులపల్లికి చెందిన కొందరు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లను జీవో 111 నుంచి తొలగిస్తే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరిగి అక్కడి నుంచి మురికినీరు వచ్చి కోకాపేట చెరువు కలుషితం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్‌త్గీ వాదనలు వినిపించారు. విరుద్ధంగా వాదనలు వినిపిస్తామంటే ఎలా? ‘‘వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లను తొలగించాలని 2006లోనే ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయించింది. ఈ నివేదిక మేరకే 2010లో ప్రభుత్వం అనుమతి కోరుతూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వాదనలు వినిపిస్తామంటే ఎలా? జీవో 111 పరిధి నిర్ణయించేందుకు హైపవర్ కమిటీని 2016లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపుగా 55 నెలలుగా కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 2018లో ఓ కేసు విచారణ సందర్భంగా 45 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్జీటీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటికీ ఈ కమిటీ నిరుపయోగంగా ఉంది. పనిచేయని ఇటువంటి కమిటీలను తక్షణం రద్దు చేయాలి’’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నా వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలన్న రైతుల పిటిçషన్ను విచారించి ఉత్తర్వులు జారీచేస్తామని ధర్మాసనం పేర్కొంది. -
కోకాపేట భూములు.. కేక!
హైదరాబాద్: కోర్టు తీర్పు, హైడ్రామా మధ్య ఎట్టకేలకు కోకాపేట భూముల వేలం ముగిసింది. హెచ్ఎండీఏకు చెందిన 49 ఎకరాల్లో 8 ప్లాట్లుకు జరిగిన ఈ-వేలంలో భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. ఈ-ఆక్షన్‌లో 60 మంది బిడ్డర్స్ పాల్గొన్నారు. కాగా, కోకాపేట భూములు ప్రభుత్వానికి కోట్లు కురిపించాయి. ఈ-వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కోకాపేటలో 49.9 ఎకరాలు హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ వేలంలో గజానికి రూ.లక్షన్నర ధర పలికినట్లు సమాచారం. దీంతో ఒక ఎకరాకు రూ.30 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ధర పలికింది. ఇక గరిష్టంగా ఒక ఎకరాకు రూ.60.2 కోట్ల ధర పలికింది. గోల్డెన్ మైల్ సైట్‌లోని 2పి ప్లాట్‌లో 1.65 ఎకరాలు, 1.65 ఎకరాలకు రూ.99.33 కోట్ల రాజ్‌పుష్ప రియాల్టీ ఎల్ఎల్పీ బిడ్ వేసింది. ఇక ప్లాట్ నంబర్ Aలోని ఒక ఎకరం భూమి రూ.31.2 కోట్లకు అత్యల్ప ధరకు హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ వేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నాలుగు ఫ్లాట్లు, ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో నాలుగు ఫ్లాట్ల వేలం జరిగింది. రేపు(శుక్రవారం) ఖానామెట్‌లో వున్న 15 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. మొత్తం మీద భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని అంచనా. కోకాపేటల భూములను వేలం వేయడానికి ప్రభుత్వం గత ఏడాదే నుంచి ప్రయత్నాలు ఆరంభించింది. ఈ క్రమంలోనే ఆ ప్లాట్లను అత్యాధునిక హంగులతో కూడిన వెంచర్స్‌గా మార్చేసి వేలానికి సమాయత్తమైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపాలనే పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టేయాలని విజయశాంతి హైకోర్టును కోరారు. ఈ విచారణలో భాగంగా భూముల వేలం ఆపేందుకు నిరాకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో భూములను వేలం వేయడానికి మార్గం సుగుమం అయ్యింది. -
Telangana: ప్రభుత్వ భూముల అమ్మకాలకు మార్గదర్శకాలు ఖరారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ-వేలం ద్వారా పారదర్శకంగా ప్రభుత్వ భూముల విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల విక్రయానికి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకానుంది. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ పనిచేస్తుందని తెలిపింది. భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ, భూముల అమ్మకాల పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. -
వేలానికి వేళాయె.. త్వరలో అసైన్డ్ భూముల వేలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద భారీగా 30 వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించిన ప్రభుత్వం... ఆ నిధుల సమీకరణకు ఉద్యుక్తమవుతోంది. అందులో భాగంగా రాజధాని శివార్లలోని అసైన్డ్ భూముల అమ్మకం వ్యవహారంపై దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, గండిపేట మండలాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అమ్మకానికి అనువుగా ఉన్నాయని గుర్తించిన 1,636 ఎకరాల భూమిని ప్రభుత్వం త్వరలోనే వేలానికి పెట్టనున్నట్లు సమాచారం. ఈ భూముల అమ్మకాల ద్వారా రూ.4 వేల కోట్ల దాకా వస్తాయని తొలుత అంచనా వేశారు. కానీ ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల ప్రకారం రూ.5 వేల కోట్ల వరకు రావొచ్చని రెవెన్యూ అధికారులు లెక్కలు గడుతున్నారు. వీటికి తోడు గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో ఖాళీగా ఉన్న మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయిస్తే రూ.3,500 కోట్ల వరకు సమకూరే అవకాశాలున్నాయి. ఈ లెక్కన అసైన్డ్ భూముల అమ్మకాల ద్వారా తొలివిడతలో రూ.8,500 కోట్ల వరకు రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లబ్ధిదారులకు నష్టం లేకుండా వాస్తవానికి నగర శివార్లలో ప్రభుత్వం వేలాది ఎకరాలను పలు దశల్లో పేదలకు అసైన్ చేసింది. ఎలాంటి ఆసరాలేని సదరు పేదలు ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని ఉపాధి పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ భూములు కొన్ని వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడం, పేదలు తమ అవసరాలకు భూములను ఇతరులకు విక్రయించడంతో... ఇప్పుడు ఎక్కువ భూములు అటు ప్రభుత్వం దగ్గర, ఇటు అసైన్డ్‌దారుల దగ్గర కాకుండా థర్డ్‌పార్టీ చేతిలో ఉన్నాయి. ఇలాంటి భూములెన్ని ఉన్నాయన్న లెక్క భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇదివరకే ఓ కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరఖుర్దు, మాదాపూర్, రావిర్యాల, తుమ్మలూరు, రాయన్నగూడ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించింది. ఈ గ్రామాల్లో అసైన్ చేసిన భూముల్లో అన్యాక్రాంతమైనవి, నిరుపయోగంగా ఉన్నవి కలిపి మొత్తం 1,636 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చింది. గత ఏడాది కేవలం సర్వేకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వేలం వేయడం లేదా బహుళ జాతి సంస్థలకు విక్రయించే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను మరోమారు తెప్పించుకున్న ఉన్నతాధికారులు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రెవెన్యూవర్గాలు చెపుతున్నాయి. అయితే అసైన్డ్ చేసిన పేదలకు నష్టం కలగకుండా ఈ భూములను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసైనీల చేతిలో ఉన్నప్పటికీ వారు వ్యవసాయం చేయకుండా ఉన్న భూములు, అసైనీలు ఇతరులకు అమ్ముకున్న భూములను తీసుకోవాలని, ఈ క్రమంలో అసైనీలకు లేదంటే థర్డ్‌పార్టీకి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని యోచిస్తోంది. ఇందుకు గాను రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని కూడా రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పద్దు పూడాలంటే... అమ్మాల్సిందే! రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.30,557 కోట్లను చూపెట్టింది. కానీ గత మూడేళ్ల లెక్కలను పరిశీలిస్తే ఎప్పుడూ పన్నేతర ఆదాయం రూ.10 వేల కోట్లను దాటలేదు. 2018–19లో రూ. 10,007 కోట్లు, 2019–20లో రూ.7,360 కోట్లు, 2020–21లో అయితే రూ.5వేల కోట్లు దాటలేదు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పన్నేతర ఆదాయం కింద రూ. 30,600 కోట్లు పద్దు చూపెట్టినా అందులో ఆరో వంతు మాత్రమే వచ్చింది. గత ఏడాదిలోనూ ప్రభుత్వ భూముల అమ్మకం ప్రతిపాదనలున్నప్పటికీ అమల్లోకి రాకపోవడంతో పన్నేతర ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 30,557 కోట్లను పన్నేతర పద్దు కింద ప్రభుత్వం చూపెట్టడంతో ఈసారి భూముల అమ్మకాలు అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఈ పరిస్థితుల్లోనే నగర శివార్లలోని అసైన్డ్ భూముల అమ్మకాల ప్రతిపాదన ఫైలును మరోమారు ప్రభుత్వం తెరుస్తోంది. భూములు అమ్మకాల తొలిదశలో భాగంగా ఈ అసైన్డ్ భూములతో పాటు మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడం లేదంటే బహుళ జాతి సంస్థలకు నిర్దేశిత ధరకు విక్రయించడం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చిన అసైన్డ్ భూముల లెక్క ఇది గ్రామం ఎకరాలు ఆదాయం అంచనా (రూ.కోట్లలో) మాదాపూర్ 243.35 243 రావిర్యాల 281.19 843 తుమ్మలూరు 418.01 1254 రాయన్నగూడ 69.09 48.30 కొంగరఖుర్దు 435.18 1,196 (ఇవి గాక గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో 188 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని అమ్మితే రూ.3,500 కోట్లు వస్తాయని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.) చదవండి: సీరియస్‌గా ఉంటేనే అడ్మిషన్ -
మహబూబ్ నగర్లో అగ్రిగోల్డ్ భూముల వేలం పాట
-
కథ మొదటికొచ్చింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికిన భూముల కథ మొదటికొచ్చింది. పోటాపోటీగా వేలంలో పాల్గొని అత్యధిక రేట్లు కోట్ చేసి భూములు దక్కించుకున్న బిడ్డర్లు ఇపుడు వీటివైపు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు వేలం వేసిన ప్లాట్లు తమకే చెందుతాయని కొందరు కోర్టుకెక్కారు. దీంతో భారీ ఆదాయం వస్తుందనుకున్న హెచ్ఎండీఏ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. హెచ్ఎండీఏ మూడు నెలల కిందట ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయానికి పెట్టగా మాదాపూర్‌లోని ప్లాట్లు అత్యధికంగా చదరపు గజానికి రూ.1.52 లక్షల చొప్పున ధర పలికాయి. అంచనాలకు మించి ధరలు నమోదవడంతో 189 ప్లాట్లకు వేలం వేసిన సంస్థ.. రూ.352 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలేసుకుంది. కానీ బిడ్డర్లు ధర చెల్లించకపోవడంతో ఆదాయం రూ.200 కోట్లు కూడా దాటేటట్లు లేదని హెచ్ఎండీఏ అధికారులు తల పట్టుకుంటున్నారు. ఆదిలోనే చుక్కెదురు హెచ్ఎండీఏ అమ్మకానికి పెట్టిన ప్లాట్లకు ఆరంభంలోనే చుక్కెదురైంది. 189 ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేయగా.. 80 ప్లాట్లపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి తమ వద్ద పత్రాలు ఉన్నాయని, తమకే చెందుతాయని హెచ్ఎండీఏ వాదించడంతో వేలం కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. కానీ విక్రయాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. దీంతో వేలం త్రిశంకుస్వర్గంలో పడినట్లయింది. వేలంలో ప్లాట్లను దక్కించుకున్న కొనుగోలుదారులు డబ్బులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా.. కోర్టు తీర్పు కారణంగా స్వాధీనం చేసే పరిస్థితి లేదు. దీంతో హెచ్ఎండీఏ అధికారులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మియాపూర్‌లో మయూరీ నగర్ లే అవుట్లో 42 ప్లాట్లు, బాచుపల్లి, నల్లగండ్ల ప్రాంతాల్లో మిగతా ప్లాట్లు కోర్టు కేసుల జాబితాలో ఉన్నాయి. వేలంలో అత్యధికంగా రేటు పలికిన ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉండటం గమనార్హం. 31 మందికి నోటీసులు! అత్యధిక రేట్లతో భూములు కొనుగోలు చేసిన బిడ్డర్లు కొందరు కోర్టు కేసుల వల్ల ముఖం చాటేశారు. డబ్బులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. కోర్టు కేసుల్లేని 109 ప్లాట్లను దక్కించుకున్న వారిలో ఇప్పటివరకు 78 మంది ఈఎండీతో పాటు 25 శాతం బిడ్డింగ్ సొమ్మునూ చెల్లించారని.. మిగతా 31 మంది కొనుగోలుదారులు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఎస్ఎంఎస్, ఈ–మెయిళ్ల ద్వారా సమాచారం పంపించినా స్పందన లేకపోవడంతో ఆఖరి అస్త్రంగా నోటీసులు జారీ చేసి, ఈఎండీని జప్తు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ జరిపిన సమీక్షలో భూముల వేలం, నోటీసుల వ్యవహారం చర్చకు వచ్చినట్లు సమాచారం. -
ప్లాట్ల వేలం ప్రక్రియను కొనసాగించుకోండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మియాపూర్ మయూరి నగర్ కాలేజీలో ఉన్న ప్లాట్ల వేలం ప్రక్రియను కొనసాగించుకోవచ్చని హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఏ ఒక్కరి బిడ్లను ఖరారు చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీఏ కొన్నేళ్ల క్రితమే మియాపూర్‌లో పలు స్థలాలను ప్రజావసరాల కోసం ఇచ్చిందని, ఇప్పుడు వాటిని హెచ్ఎండీఏ అధికారులు వేలం వేస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని మయూరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తేలప్రోలు చరణ్ వాదన లు వినిపిస్తూ ప్రజావసరాల కోసం కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని హెచ్ఎండీఏ గతంలో అమ్మేసిందని, ఇప్పుడు మిగిలిన వాటిని కూడా వేలం ద్వారా విక్రయించాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ వాదనలను హెచ్ఎం డీఏ తరఫు న్యాయవాది వై.రామా రావు తోసిపుచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, వేలం ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేశారు. -
కౌలు వేలం తక్షణమే నిర్వహించాలి
జిల్లాలో సుమారు 85 ఎకరాల జెడ్పీ వ్యవసాయ భూములు జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ గుంటూరు వెస్ట్: జిల్లా పరిషత్‌కు చెందిన వ్యవసాయ భూములకు కౌలు వేలం తక్షణమే నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ కోరారు. జిల్లాలోని దాచేపల్లి, పిడుగురాళ్ల, అచ్చంపేట, దుర్గి, నూజెండ్ల, కర్లపాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, ముప్పాళ్ల, పీవీ పాలెం, తుళ్లూరు, కారంపూడి మండలాల్లో సుమారు 85 ఎకరాల జెడ్పీ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయా మండలాలలో కొంతకాలంగా కౌలు వేలం పాటలు నిర్వహించడం లేదు. ఈనేపథ్యంలో ఆయా మండలాల ఎంపీడీవోలతో శనివారం జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో మండలాల వారీగా వ్యవసాయ భూముల వేలంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ జానీమూన్ మాట్లాడుతూ వ్యవసాయ, కమర్షియల్ భూములను గుర్తించి ప్రస్తుతం ఉన్న ధరల మేరకు కౌలు వేలంపాటలు నిర్వహించి జెడ్పీ ఆదాయం పెంచాలని సూచించారు. జెడ్పీ ఆస్తులను గుర్తించి, ఆస్థలంలో బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 57 మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లతో సంయుక్తంగా జెడ్పీ ఆస్తులపై త్వరలో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఆ ఆదాయాన్ని జెడ్పీకి మళ్లించాలి.. తుళ్లూరు మండలం నెక్కలులోని జెడ్పీ చెరువు వ్యవహారం సమావేశం దష్టికి వచ్చింది. చెరువులో ‘నీరు–చెట్టు’ కింద మట్టితవ్వకాలు జరిపినట్లు ఆ మండల ఎంపీడీవో జె.మోహనరావు సమావేశంలో ప్రస్తావించారు. జెడ్పీ చెరువులో తవ్వకాలు చేపట్టిన గ్రామసర్పంచ్ దానిపై వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి బదలాయించుకోవడాన్ని తప్పుపట్టారు. ఆ ఆదాయాన్ని జెడ్పీకి జమ చేసేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని జానీమూన్ మండల ఎంపీడీవోను ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో పొందుపరచాలి.. జెడ్పీ ఇన్చార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జెడ్పీ ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరచడం ద్వారా ఆక్రమణలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఎంపీడీవోలు తహశీల్దార్లుతో సమన్వయం చేసుకుంటూ జెడ్పీ ఆస్తుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో జి.జోసఫ్‌కుమార్, అక్కౌంట్స్ అధికారి సీహెచ్.రవిచంద్రారెడ్డి, 12 మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
మళ్లీ భూముల వేలానికి ప్రభుత్వం నోటిఫికేషన్
హైదరాబాద్ : మళ్లీ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ పరిధిలో 62 ప్రాంతాల్లోని భూముల వేలానికి తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. సదరు భూములను ఇటీవల వేలం వేశారు. అయితే స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఖానామెట్, రాజేంద్రనగర్, మణికొండ, నార్సింగి,పుప్పాలగూడ, నిజాంపేట ప్రాంతాల్లో భూములు వేలం వేయనున్నారు గజానికి అత్యల్పంగా రూ. 7 వేలు, అత్యధికంగా రూ. 45 వేల ఆప్ సెట్ ధరను ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 22వ తేదీన ఈ ఆక్షన్ ద్వారా సదరు ప్రాంతాల్లోని భూములను విక్రయించనున్నారు. -
భలే మంచి చౌక బేరం
ఏపీ ఎండోమెంటు భూముల వేలం ఖరీదైన భూములు కారు చౌక ఎకరా రూ.27 లక్షలు చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు శాఖ వారి నిర్వాకం కారణంగా కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. దక్కిందే చాలనుకున్న ఏపీ ఎండోమెంటు అధికారులు వేలం పాటల ద్వారా పొందిన రూ.23 కోట్లతో సరిపెట్టుకున్నారు. అమరావతిలో శివాలయంలో పూజాది కార్యక్రమాల నిమిత్తం గుంటూరు జిల్లాకు చెందిన వాసిరెడ్డి వెంకటాద్రి రామలక్షమ్మ అనే మహిళ 471 ఎకరాల భూమిని అమరావతిలోని సభావర్తి సత్రానికి రాసిచ్చేశారు. కాంచీపురం జిల్లాలోని ఈ భూములను 1945-50 మధ్యకాలంలో ఆమె అప్పగించారు. అయితే ఇటీవలి వరకు ఆ భూములను ఎండోమెంటు వారు స్వాధీనం చేసుకోలేదు. ఏపీ విడిపోయిన సందర్భంలో రికార్డులను తిరగేస్తుండగా ఈ భూముల వివరాలు బైటపడ్డాయి. తమిళనాడు ప్రభుత్వం సహకారంతో భూములను గుర్తించే ప్రయత్నం చేయగా 471 ఎకరాలకు గానూ కేవలం కేవలం 83.11 ఎకరాల భూమిని మాత్రమే కనుగొనగలిగారు. ఈ కొద్దిపాటి భూములు సైతం ఎన్నో ఏళ్ల క్రితమే అన్యాక్రాంతం అయిపోయాయి. ఈ భూములను వేలం వేసుకోవచ్చని కాంచీపురం జిల్లా కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ ఎండోమెంటు జాయింట్ కమిషనర్ కృష్ణాజీరావు, శ్రీకాళహస్తి ఆలయ ఎగ్జిక్యుటీవ్ ఆఫీసర్ భ్రమరాంబ, ఎస్టేట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం విజయరాజ, అమరావతి ఈఓ శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు ఉదయకుమార్ (చెన్నై), శేషుమోహన్ (గుంటూరు) సోమవారం చెన్నై రాయపేటలోని ఒక పాఠశాలలో టెండర్ల దాఖలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు టెండర్లను స్వీకరించారు. టెండర్లలో శాఖాపరంగా గిట్టుబాటైన ధరను కోడ్ చేసి ఉన్నట్లయితే వారికే భూములను అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరెడ్డి,గోపిరాజు, చెన్నైకి చెందిన రాధాకృష్ణ టెండర్లు వేశారు. అలాగే చెన్నైలో తెలుగు ప్రముఖులైన ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ అధ్యక్షులు తంగటూరి రామకృష్ణ, వీజీఏ హోమ్స్ డైరక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా టెండరు వేశారు. ఎండోమెంటు వారు ఎకరాకు రూ.50లక్షలు ఆశించగా గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరెడ్డి రూ.26లక్షలకు టెండరు వేశారు. దీంతో వేలంపాట నిర్వహించడం అనివార్యమైంది. ఎండోమెంటు వారిపాట రూ.50లక్షలు అంటూ ప్రారంభించగా టెండరుదారులు ఎవ్వరూ నోరుమెదపలేదు. వేలం పాటల్లో విలువ పెరగాల్సి ఉండగా ప్రతి ఐదు నిమిషాలకు రూ.5 లక్షల చొప్పున తగ్గించుకుంటూ వచ్చారు. రూ.35 లక్షల వద్ద, ఆ తరువాత రూ.30లక్షల వద్ద వేలంపాట ఎక్కువ సేపు స్థంభించిపోయినా నలుగురిలో ఎవ్వరూ నోరుమెదపలేదు. గిట్టుబాటు ధర పలకని పక్షంలో వేలం రద్దుచేస్తారా అన్ని అధికారులను ప్రశ్నించగా, ఏదో ఒక ధరకు సెటిల్ చేస్తామని బదులిచ్చారు. ఎట్టకేలకూ గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరెడ్డి ఎకరా రూ.27 లక్షల 188లకు వేలం పాట ద్వారా సొంతం చేసుకున్నారు. అంటే మొత్తం 83.11 ఎకరాలను రూ.22 కోట్ల 44లక్షలా 12వేల 625లకు కొనుగోలు చేశారు. పరాధీనంలో ఉన్న భూములను సొంతం చేసుకోవడం వల్ల లాభం కంటే నష్టం, న్యాయపరమైన చిక్కులే ఎక్కువని భావించి వేలం పాటలో వెనక్కు తగ్గినట్లు తంగుటూరి రామకృష్ణ, వెంకటేశ్వరావు తెలిపారు. కాంచీపురంలో 471 ఎకరాల భూమిని కలిగి ఉన్న ఏపీ ఎండోమెంటు శాఖ కేవలం 83.11 ఎకరాల భూమిని మాత్రమే సొమ్ముచేసుకుని 388 ఎకరాల భూమిని ఆక్రమితదారులకు అప్పగించేసిందని భావించవచ్చు. -
అప్పనంగా చప్పరించారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని పట్టెడన్నం పెట్టే లక్ష్యంతో పిఠాపురం మహారాజాశ్రీ సంస్థానం పేరుతో సత్రాన్ని ఏర్పాటు చేశారు. దాని నిర్వహణకు తొండంగిలో 508 ఎకరాల భూమి కేటాయించారు. ఈ సాగుభూమిపై వచ్చే వేలం సొమ్ముతో శ్రీ సంస్థానం ఆధ్వర్యంలో అనాథ పిల్లలను సాకాలని దాత ఆశించారు. ప్రస్తుతం సంస్థానం భూముల ద్వారా వచ్చే ఆదాయంతో నిరుపేద విద్యార్థులకు పట్టెడన్నం పెడుతున్నారు. సత్రం ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహణకు తొండంగి మండలంలో 508 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమికి మూడేళ్ల కాలపరిమితితో వేలం వేయాలని 2012 మార్చిలో 218.46 ఎకరాలు, జూన్ నెలలో 232 ఎకరాలకు రెండు దఫాలుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. మొదటి నోటిఫికేషన్లో వేలం వేసిన 218.46 ఎకరాలకు ఎకరా రూ.4,000కు మించి పలకడం లేదని సంబంధిత శాఖ కమిషనర్‌కు తప్పుడు నివేదికలు అందచేసి అప్పనంగా భూములపై కౌలు హక్కులను 32 మందికి కట్టబెట్టేశారు. వాస్తవం తెలియని ఉన్నతాధికారులు మొదట ఆమోదించిన భూముల తరహాలోనే రెండో దఫా వేలాన్ని ఆమోదిస్తారనే ఉద్దేశంతో ఎకరాకు రూ.4,000 వంతున కట్టబెట్టేసేందుకు పథకం వేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా పాత కౌలుదారులు (అప్పటికున్న కౌలు ఎకరాకు రూ.3,500)నే ఎకరాకు రూ.4,000 వంతున లీజు పొడిగించేందుకు ప్రతిపాదించారు. అప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారం లీక్ అవ్వడంతో రెండో దఫా ఎకరాకు ప్రతిపాదించిన రూ.4000ను ఉన్నతాధికారులు అంగీకరించక ఫైల్‌ను దేవాదాయశాఖ కమిషనర్ తిప్పి పంపేశారని సమాచారం.విషయం బయటకు వస్తే వారి పథకం పారదనే ముందుచూపుతో జిల్లాలోని దేవాదాయ అధికారులు... ఉన్నతాధికారుల అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అనధికారికంగా ఎకరా భూమిని రూ.4,000కు లీజుకు కట్టబెట్టేశారు. ఈ భూ భాగోతంలో ఎవరికి దక్కాల్సిన వాటాలు వారికి అందడంతో ఈ వ్యవహారాన్ని గడచిన రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. మరో ఏడాది వరకు ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో వారు భూముల లీజు హక్కులు అనుభవిస్తున్నారు. వాస్తవానికి ఆ భూములకు ఎకరం రూ.20వేలకు పైగానే లీజు పలుకుతోంది. ఇందుకు ఉదాహరణగా శ్రీ సంస్థానం భూములకు సమీపాన ఉన్న తొండంగి శివాలయం భూములు చెప్పుకోవచ్చు. ఇటీవల శివాలయ భూములకు వేలం నిర్వహించగా ఎకరం రూ.21వేల ధరకు కౌలుహక్కులు కల్పించారు. శ్రీ సంస్థానం భూములు ఎకరాకు రూ.4,000 ధర పలకడాన్ని లెక్కేస్తే దేవాదాయశాఖ ఎంత నష్టపోయిందీ తెలుస్తోంది. ఈ అవినీతి భాగోతం వెనుక దేవాదాయశాఖ అధికారుల నిర్వాకం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. మొత్తం 508 ఎకరాల్లో 218.46 ఎకరాలకు వేలం నిర్వహించగా, 232ఎకరాలను అనధికారికంగా ఇక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా కట్టబెట్టేయగా, 28 ఎకరాలు భూమిలేని నిరుపేదలకు అప్పగించారు. మరో 29 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అధికారులు చెబుతున్నారు. భూముల వ్యవహారంపై వివరాలు అడుగుతుంటే అధికారులు రికార్డులు మాయమయ్యాయని తప్పించుకుంటున్నారు. శ్రీ సంస్థానం భూములపై వచ్చే ఆదాయాన్ని పరిరక్షించాల్సిన జిల్లా స్థాయి అధికారులే కుమ్మక్కై వేలంలేకుండా ఆ ఆదాయాన్ని గుట్కాయస్వాహా చేసేస్తున్నారు. మూడేళ్ల కాలపరిమితికి ఎకరాకు రూ.60 వేలకు తక్కువగాకుండా ఆదాయం వస్తుంది. రెండేళ్లుగా వేలం వేయని 218.46 భూముల ద్వారా కాజేసిన సొమ్ము రూ. అరకోటి పైమాటగానే ఉంటుందని అంచనా. చిత్తశుద్ధితో అధికారులు వేలం నిర్వహించినట్టయితే ఈ 218.46 ఎకరాలకు రూ.34 లక్షలు ఆదాయం వస్తుందని లెక్కలేస్తున్నారు. అదే బహిరంగ వేలమైతే కోటి రూపాయల పైమాటేనంటున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఆదాయాన్ని అధికారులు, దళారులు కుమ్మక్కై అడ్డంగా బొక్కేశారని చెప్పొచ్చు. ఇదే వ్యవహారంపైఈవో ఎర్రా వెంకటరావు ఆరునెలల క్రితం సస్పెన్షన్‌కు గురయ్యారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వచ్చిన అధికారులు కూడా అదే పంథాను అనుసరిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కౌలు పాడుకుందామని ఆశతో ఉన్న రైతులు దేవాదాయధర్మాదాయశాఖ మంత్రికి, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ప్రస్తుత ఈవో చలపతిరావు అవకతవకలను నిర్ధారిస్తూ నివేదిక పంపారని సమాచారం. దేవాదాయధర్మాదాయశాఖ న్యాయవాది ఈనెల 3వ తేదీన ఇచ్చిన సలహాలో 232.66 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించాలని సూచించారు. కానీ ఆ శాఖ జిల్లా స్థాయి ఉన్నతాధికారుల సైతం పట్టనట్టుగా వ్యవహరించారు. భూముల వేలానికి రైతుల డిమాండ్ ఆ భూములకు బహిరంగ వేలం నిర్వహించాలని రెండు రోజుల క్రితం రైతులు దేవాదాయధర్మాదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సత్రానికి చెందిన 508 ఎకరాలకు 218.36 ఎకరాల భూమికి మొక్కుబడిగా 2012లో అధికారులు వేలం నిర్వహించారని, అతి తక్కువ కౌలుకు ఈ భూమిని కొందరికి కట్టబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగిలిన 232.76 ఎకరాలకు కౌలు అనుమతులు లేకుండా అధికారులకు లంచాలు ఎరచూపి 2012-13లో సాగు చేసుకున్నారని వివరించారు. ఈ వ్యవ హారంపై దేవాదాయ ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, తక్షణమే సత్రం భూములకు వేలం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే సత్రం భూముల వేలానికి సంబంధించిన రికార్డులు గల్లంతయ్యాయని, విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించామని, వారి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారులకు ఈవో చలపతిరావు వివరించారు. డీసీ వివరణ ఈ విషయమై దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కె.హనుమంతరావును వివరణ కోరగా వేలం నిర్వహించకుండా భూములను కట్టబెట్టినట్టు రైతుల నుంచి తమకు ఫిర్యాదులు అందినమాట వాస్తవమేనన్నారు. అసలు వేలం నిర్వహించారా? లేదా? అనే విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నామని, ఇందుకోసం తమ శాఖ పరిధిలోని ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వసంతరావును విచారణ అధికారిగా నియమించామని తెలిపారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటుని స్పష్ట ంచేశారు. సక్రమంగానే లీజుకు ఇస్తున్నాం శ్రీసంస్థానానికి చెందిన 508 ఎకరాల భూములను మూడేళ్లకు ఒకసారి వేలం ద్వారా లీజుకు ఇస్తున్నాం. ప్రస్తుతం 479 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉంది. ఏటా రూ.18.59 లక్షల ఆదాయం వస్తోంది. ఎకరానికి రూ.4,000 చొప్పున లీజు వసూలు చేస్తున్నాం. ఇంతకు ఐదు రెట్లు లీజు వస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. - పీవీ చలపతిరావు, శ్రీ సంస్థానం ఈఓ