భలే మంచి చౌక బేరం | Actually good, cheap bargain | Sakshi
Sakshi News home page

భలే మంచి చౌక బేరం

Published Tue, Mar 29 2016 3:03 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

Actually good, cheap bargain

ఏపీ ఎండోమెంటు భూముల వేలం
ఖరీదైన భూములు కారు చౌక
ఎకరా రూ.27 లక్షలు



చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు శాఖ వారి నిర్వాకం కారణంగా కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. దక్కిందే చాలనుకున్న ఏపీ ఎండోమెంటు అధికారులు వేలం పాటల ద్వారా పొందిన రూ.23 కోట్లతో సరిపెట్టుకున్నారు. అమరావతిలో శివాలయంలో పూజాది కార్యక్రమాల నిమిత్తం గుంటూరు జిల్లాకు చెందిన వాసిరెడ్డి వెంకటాద్రి రామలక్షమ్మ అనే మహిళ 471 ఎకరాల భూమిని అమరావతిలోని సభావర్తి సత్రానికి రాసిచ్చేశారు. కాంచీపురం జిల్లాలోని ఈ భూములను  1945-50 మధ్యకాలంలో ఆమె అప్పగించారు. అయితే ఇటీవలి వరకు ఆ భూములను ఎండోమెంటు వారు స్వాధీనం చేసుకోలేదు. ఏపీ విడిపోయిన సందర్భంలో రికార్డులను తిరగేస్తుండగా ఈ భూముల వివరాలు బైటపడ్డాయి. తమిళనాడు ప్రభుత్వం సహకారంతో భూములను గుర్తించే ప్రయత్నం చేయగా 471 ఎకరాలకు గానూ కేవలం కేవలం 83.11 ఎకరాల భూమిని మాత్రమే కనుగొనగలిగారు. ఈ కొద్దిపాటి భూములు సైతం ఎన్నో ఏళ్ల క్రితమే అన్యాక్రాంతం అయిపోయాయి.


ఈ భూములను వేలం వేసుకోవచ్చని కాంచీపురం జిల్లా కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ ఎండోమెంటు జాయింట్ కమిషనర్ కృష్ణాజీరావు, శ్రీకాళహస్తి ఆలయ ఎగ్జిక్యుటీవ్ ఆఫీసర్ భ్రమరాంబ, ఎస్టేట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం విజయరాజ, అమరావతి ఈఓ శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు ఉదయకుమార్ (చెన్నై), శేషుమోహన్ (గుంటూరు) సోమవారం చెన్నై రాయపేటలోని ఒక పాఠశాలలో టెండర్ల దాఖలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు టెండర్లను స్వీకరించారు. టెండర్లలో శాఖాపరంగా గిట్టుబాటైన ధరను కోడ్ చేసి ఉన్నట్లయితే వారికే భూములను అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరెడ్డి,గోపిరాజు, చెన్నైకి చెందిన రాధాకృష్ణ టెండర్లు వేశారు. అలాగే చెన్నైలో తెలుగు ప్రముఖులైన ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ అధ్యక్షులు తంగటూరి రామకృష్ణ, వీజీఏ హోమ్స్ డైరక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా టెండరు వేశారు. ఎండోమెంటు వారు ఎకరాకు రూ.50లక్షలు ఆశించగా గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరెడ్డి రూ.26లక్షలకు టెండరు వేశారు. దీంతో వేలంపాట నిర్వహించడం అనివార్యమైంది. ఎండోమెంటు వారిపాట రూ.50లక్షలు అంటూ ప్రారంభించగా టెండరుదారులు ఎవ్వరూ నోరుమెదపలేదు. వేలం పాటల్లో విలువ పెరగాల్సి ఉండగా ప్రతి ఐదు నిమిషాలకు రూ.5 లక్షల చొప్పున తగ్గించుకుంటూ వచ్చారు. రూ.35 లక్షల వద్ద, ఆ తరువాత రూ.30లక్షల వద్ద వేలంపాట ఎక్కువ సేపు స్థంభించిపోయినా నలుగురిలో ఎవ్వరూ నోరుమెదపలేదు. గిట్టుబాటు ధర పలకని పక్షంలో వేలం రద్దుచేస్తారా అన్ని అధికారులను ప్రశ్నించగా, ఏదో ఒక ధరకు సెటిల్ చేస్తామని బదులిచ్చారు.


ఎట్టకేలకూ గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరెడ్డి ఎకరా రూ.27 లక్షల 188లకు వేలం పాట ద్వారా సొంతం చేసుకున్నారు. అంటే మొత్తం 83.11 ఎకరాలను రూ.22 కోట్ల 44లక్షలా 12వేల 625లకు కొనుగోలు చేశారు.  పరాధీనంలో ఉన్న భూములను సొంతం చేసుకోవడం వల్ల లాభం కంటే నష్టం, న్యాయపరమైన చిక్కులే ఎక్కువని భావించి వేలం పాటలో వెనక్కు తగ్గినట్లు తంగుటూరి రామకృష్ణ, వెంకటేశ్వరావు తెలిపారు. కాంచీపురంలో 471 ఎకరాల భూమిని కలిగి ఉన్న ఏపీ ఎండోమెంటు శాఖ కేవలం 83.11 ఎకరాల భూమిని మాత్రమే సొమ్ముచేసుకుని 388 ఎకరాల భూమిని ఆక్రమితదారులకు అప్పగించేసిందని భావించవచ్చు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement