హైదరాబాద్: కోర్టు తీర్పు, హైడ్రామా మధ్య ఎట్టకేలకు కోకాపేట భూముల వేలం ముగిసింది. హెచ్ఎండీఏకు చెందిన 49 ఎకరాల్లో 8 ప్లాట్లుకు జరిగిన ఈ-వేలంలో భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. ఈ-ఆక్షన్‌లో 60 మంది బిడ్డర్స్ పాల్గొన్నారు. కాగా, కోకాపేట భూములు ప్రభుత్వానికి కోట్లు కురిపించాయి. ఈ-వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కోకాపేటలో 49.9 ఎకరాలు హెచ్‌ఎండీఏ వేలం వేసింది. ఈ వేలంలో గజానికి రూ.లక్షన్నర ధర పలికినట్లు సమాచారం. దీంతో ఒక ఎకరాకు రూ.30 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ధర పలికింది.
ఇక గరిష్టంగా ఒక ఎకరాకు రూ.60.2 కోట్ల ధర పలికింది. గోల్డెన్ మైల్ సైట్‌లోని 2పి ప్లాట్‌లో 1.65 ఎకరాలు, 1.65 ఎకరాలకు రూ.99.33 కోట్ల రాజ్‌పుష్ప రియాల్టీ ఎల్‌ఎల్‌పీ బిడ్ వేసింది. ఇక ప్లాట్ నంబర్ Aలోని ఒక ఎకరం భూమి రూ.31.2 కోట్లకు అత్యల్ప ధరకు హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ వేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నాలుగు ఫ్లాట్లు, ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో నాలుగు ఫ్లాట్ల వేలం జరిగింది.
రేపు(శుక్రవారం) ఖానామెట్‌లో వున్న 15 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. మొత్తం మీద భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని అంచనా. కోకాపేటల భూములను వేలం వేయడానికి ప్రభుత్వం గత ఏడాదే నుంచి ప్రయత్నాలు ఆరంభించింది. ఈ క్రమంలోనే ఆ ప్లాట్లను అత్యాధునిక హంగులతో కూడిన వెంచర్స్‌గా మార్చేసి వేలానికి సమాయత్తమైంది.
కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపాలనే పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టేయాలని విజయశాంతి హైకోర్టును కోరారు. ఈ విచారణలో భాగంగా భూముల వేలం ఆపేందుకు నిరాకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో భూములను వేలం వేయడానికి మార్గం సుగుమం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment