కోకాపేట భూముల వేలం ఆపాలా? | Telangana Kokapet Land Auction | Sakshi
Sakshi News home page

కోకాపేట భూముల వేలం ఆపాలా?

Published Tue, Aug 17 2021 2:54 AM | Last Updated on Tue, Aug 17 2021 2:54 AM

Telangana Kokapet Land Auction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చెరువు క్యాచ్‌మెంట్‌ ఏరియా వెలుపల ఉన్న వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను జీవో 111 నుంచి తొలగించడానికి ప్రభుత్వం విముఖత చూపడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వట్టినాగులపల్లిలోని భూములను జీవో 111 నుంచి మినహాయిస్తే అక్కడ నిర్మాణమయ్యే బహుళ అంతస్తుల భవనాల నుంచి వచ్చే నీటితో కోకాపేట చెరువు కలుషితమవుతుందన్న ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. ఒకవైపు కోకాపేటలోని ప్ర భుత్వ భూములు వేలం వేస్తూ, మరోవైపు క్యాచ్‌మెంట్‌ ఏరియా వెలుపల ఉన్న రైతుల భూములు మాత్రం జీవో 111 పరిధిలో ఉండాలంటూ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను పాటించడం ఏంటని ప్రశ్నించింది.

జీవో 111 పరిధికి దగ్గర్లోని కోకాపేటలో ప్రభుత్వం 49.8 ఎకరాలను ఇటీవల వేలం వేసి రూ.2 వేల కోట్లు సమకూర్చుకుందని, ప్రభుత్వం వేలం వేసిన కోకాపేట భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణాల నుంచి మురికినీరు వచ్చి కోకాపేట చెరువులో కలిసే అవకాశం లేదా అని నిలదీసింది. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే కోకాపేట భూముల వేలం తుది కేటాయింపులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కోకాపేట భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు గతంలో నిరాకరించామని, ఇప్పుడు ఈ పిటిషన్‌తో కలిపి ఆ పిల్‌లను విచారించి ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది. జీవో 111 పరిధి నిర్ణయానికి సంబంధించి ఏర్పాటు చేసిన హైపర్‌ కమిటీ సమావేశాల మినిట్స్, నోటింగ్‌ ఫైల్స్‌ను బుధవారంలోగా తమకు సమర్పించాలని ప్రభుతాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీకి చెందిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్‌త్గీ వాదనలు వినిపించారు. 

కోకాపేట చెరువు కలుషితం కావొచ్చేమో! 
జీవో 111 పరిధి నుంచి గ్రామంలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ వట్టినాగులపల్లికి చెందిన కొందరు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లను జీవో 111 నుంచి తొలగిస్తే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరిగి అక్కడి నుంచి మురికినీరు వచ్చి కోకాపేట చెరువు కలుషితం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీకి చెందిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్‌త్గీ వాదనలు వినిపించారు.

విరుద్ధంగా వాదనలు వినిపిస్తామంటే ఎలా?  
‘‘వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లను తొలగించాలని 2006లోనే ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయించింది. ఈ నివేదిక మేరకే 2010లో ప్రభుత్వం అనుమతి కోరుతూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వాదనలు వినిపిస్తామంటే ఎలా? జీవో 111 పరిధి నిర్ణయించేందుకు హైపవర్‌ కమిటీని 2016లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపుగా 55 నెలలుగా కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 2018లో ఓ కేసు విచారణ సందర్భంగా 45 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్‌జీటీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటికీ ఈ కమిటీ నిరుపయోగంగా ఉంది. పనిచేయని ఇటువంటి కమిటీలను తక్షణం రద్దు చేయాలి’’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నా వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలన్న రైతుల పిటిçషన్‌ను విచారించి ఉత్తర్వులు జారీచేస్తామని ధర్మాసనం పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement