అప్పనంగా చప్పరించారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని పట్టెడన్నం పెట్టే లక్ష్యంతో పిఠాపురం మహారాజాశ్రీ సంస్థానం పేరుతో సత్రాన్ని ఏర్పాటు చేశారు. దాని నిర్వహణకు తొండంగిలో 508 ఎకరాల భూమి కేటాయించారు. ఈ సాగుభూమిపై వచ్చే వేలం సొమ్ముతో శ్రీ సంస్థానం ఆధ్వర్యంలో అనాథ పిల్లలను సాకాలని దాత ఆశించారు. ప్రస్తుతం సంస్థానం భూముల ద్వారా వచ్చే ఆదాయంతో నిరుపేద విద్యార్థులకు పట్టెడన్నం పెడుతున్నారు.
సత్రం ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహణకు తొండంగి మండలంలో 508 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమికి మూడేళ్ల కాలపరిమితితో వేలం వేయాలని 2012 మార్చిలో 218.46 ఎకరాలు, జూన్ నెలలో 232 ఎకరాలకు రెండు దఫాలుగా నోటిఫికేషన్‌లు ఇచ్చారు. మొదటి నోటిఫికేషన్‌లో వేలం వేసిన 218.46 ఎకరాలకు ఎకరా రూ.4,000కు మించి పలకడం లేదని సంబంధిత శాఖ కమిషనర్‌కు తప్పుడు నివేదికలు అందచేసి అప్పనంగా భూములపై కౌలు హక్కులను 32 మందికి కట్టబెట్టేశారు. వాస్తవం తెలియని ఉన్నతాధికారులు మొదట ఆమోదించిన భూముల తరహాలోనే రెండో దఫా వేలాన్ని ఆమోదిస్తారనే ఉద్దేశంతో ఎకరాకు రూ.4,000 వంతున కట్టబెట్టేసేందుకు పథకం వేసుకున్నారు.
ఇందుకు అనుగుణంగా పాత కౌలుదారులు (అప్పటికున్న కౌలు ఎకరాకు రూ.3,500)నే ఎకరాకు రూ.4,000 వంతున లీజు పొడిగించేందుకు ప్రతిపాదించారు. అప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారం లీక్ అవ్వడంతో రెండో దఫా ఎకరాకు ప్రతిపాదించిన రూ.4000ను ఉన్నతాధికారులు అంగీకరించక ఫైల్‌ను దేవాదాయశాఖ కమిషనర్ తిప్పి పంపేశారని సమాచారం.విషయం బయటకు వస్తే వారి పథకం పారదనే ముందుచూపుతో జిల్లాలోని దేవాదాయ అధికారులు... ఉన్నతాధికారుల అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అనధికారికంగా ఎకరా భూమిని రూ.4,000కు లీజుకు కట్టబెట్టేశారు. ఈ భూ భాగోతంలో ఎవరికి దక్కాల్సిన వాటాలు వారికి అందడంతో ఈ వ్యవహారాన్ని గడచిన రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. మరో ఏడాది వరకు ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో వారు భూముల లీజు హక్కులు అనుభవిస్తున్నారు.
వాస్తవానికి ఆ భూములకు ఎకరం రూ.20వేలకు పైగానే లీజు పలుకుతోంది. ఇందుకు ఉదాహరణగా శ్రీ సంస్థానం భూములకు సమీపాన ఉన్న తొండంగి శివాలయం భూములు చెప్పుకోవచ్చు. ఇటీవల శివాలయ భూములకు వేలం నిర్వహించగా ఎకరం రూ.21వేల ధరకు కౌలుహక్కులు కల్పించారు. శ్రీ సంస్థానం భూములు ఎకరాకు రూ.4,000 ధర పలకడాన్ని లెక్కేస్తే దేవాదాయశాఖ ఎంత నష్టపోయిందీ తెలుస్తోంది. ఈ అవినీతి భాగోతం వెనుక దేవాదాయశాఖ అధికారుల నిర్వాకం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. మొత్తం 508 ఎకరాల్లో 218.46 ఎకరాలకు వేలం నిర్వహించగా, 232ఎకరాలను అనధికారికంగా ఇక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా కట్టబెట్టేయగా, 28 ఎకరాలు భూమిలేని నిరుపేదలకు అప్పగించారు. మరో 29 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అధికారులు చెబుతున్నారు.
భూముల వ్యవహారంపై వివరాలు అడుగుతుంటే అధికారులు రికార్డులు మాయమయ్యాయని తప్పించుకుంటున్నారు. శ్రీ సంస్థానం భూములపై వచ్చే ఆదాయాన్ని పరిరక్షించాల్సిన జిల్లా స్థాయి అధికారులే కుమ్మక్కై వేలంలేకుండా ఆ ఆదాయాన్ని గుట్కాయస్వాహా చేసేస్తున్నారు. మూడేళ్ల కాలపరిమితికి ఎకరాకు రూ.60 వేలకు తక్కువగాకుండా ఆదాయం వస్తుంది. రెండేళ్లుగా వేలం వేయని 218.46 భూముల ద్వారా కాజేసిన సొమ్ము రూ. అరకోటి పైమాటగానే ఉంటుందని అంచనా. చిత్తశుద్ధితో అధికారులు వేలం నిర్వహించినట్టయితే ఈ 218.46 ఎకరాలకు రూ.34 లక్షలు ఆదాయం వస్తుందని లెక్కలేస్తున్నారు. అదే బహిరంగ వేలమైతే కోటి రూపాయల పైమాటేనంటున్నారు.
ఈ మేరకు దేవాదాయశాఖ ఆదాయాన్ని అధికారులు, దళారులు కుమ్మక్కై అడ్డంగా బొక్కేశారని చెప్పొచ్చు. ఇదే వ్యవహారంపైఈవో ఎర్రా వెంకటరావు ఆరునెలల క్రితం సస్పెన్షన్‌కు గురయ్యారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వచ్చిన అధికారులు కూడా అదే పంథాను అనుసరిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కౌలు పాడుకుందామని ఆశతో ఉన్న రైతులు దేవాదాయధర్మాదాయశాఖ మంత్రికి, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ప్రస్తుత ఈవో చలపతిరావు అవకతవకలను నిర్ధారిస్తూ నివేదిక పంపారని సమాచారం. దేవాదాయధర్మాదాయశాఖ న్యాయవాది ఈనెల 3వ తేదీన ఇచ్చిన సలహాలో 232.66 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించాలని సూచించారు. కానీ ఆ శాఖ జిల్లా స్థాయి ఉన్నతాధికారుల సైతం పట్టనట్టుగా వ్యవహరించారు.
భూముల వేలానికి రైతుల డిమాండ్
ఆ భూములకు బహిరంగ వేలం నిర్వహించాలని రెండు రోజుల క్రితం రైతులు దేవాదాయధర్మాదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సత్రానికి చెందిన 508 ఎకరాలకు 218.36 ఎకరాల భూమికి మొక్కుబడిగా 2012లో అధికారులు వేలం నిర్వహించారని, అతి తక్కువ కౌలుకు ఈ భూమిని కొందరికి కట్టబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగిలిన 232.76 ఎకరాలకు కౌలు అనుమతులు లేకుండా అధికారులకు లంచాలు ఎరచూపి 2012-13లో సాగు చేసుకున్నారని వివరించారు. ఈ వ్యవ హారంపై దేవాదాయ ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, తక్షణమే సత్రం భూములకు వేలం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే సత్రం భూముల వేలానికి సంబంధించిన రికార్డులు గల్లంతయ్యాయని, విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించామని, వారి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారులకు ఈవో చలపతిరావు వివరించారు.
డీసీ వివరణ
ఈ విషయమై దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కె.హనుమంతరావును వివరణ కోరగా వేలం నిర్వహించకుండా భూములను కట్టబెట్టినట్టు రైతుల నుంచి తమకు ఫిర్యాదులు అందినమాట వాస్తవమేనన్నారు. అసలు వేలం నిర్వహించారా? లేదా? అనే విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నామని, ఇందుకోసం తమ శాఖ పరిధిలోని ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వసంతరావును విచారణ అధికారిగా నియమించామని తెలిపారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటుని స్పష్ట ంచేశారు.
సక్రమంగానే లీజుకు ఇస్తున్నాం
శ్రీసంస్థానానికి చెందిన 508 ఎకరాల భూములను మూడేళ్లకు ఒకసారి వేలం ద్వారా లీజుకు ఇస్తున్నాం. ప్రస్తుతం 479 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉంది. ఏటా రూ.18.59 లక్షల ఆదాయం వస్తోంది. ఎకరానికి రూ.4,000 చొప్పున లీజు వసూలు చేస్తున్నాం. ఇంతకు ఐదు రెట్లు లీజు వస్తున్న విషయం మా దృష్టికి రాలేదు.
- పీవీ చలపతిరావు,
శ్రీ సంస్థానం ఈఓ