కాకినాడ సిటీ : శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 16 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు 19 తుది గడువు. జూలై 3న పోలింగ్ నిర్వహించి, 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలకు ఈ నెల 2న రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల నిర్వహణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా స్థాయి ప్రతినిధులతో మంగళవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు జేసీ తెలిపారు.
నియమావళి పటిష్టంగా అమలు చేయాలి
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను వెంటనే తొలగించాలని జేసీ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం నిర్వహించిన మండలస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఆర్‌డీఓలు, తహశీల్దార్, ఎంపీడీఓలతో సమీక్షించారు. రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశాలను వీడియో తీయాలన్నారు. ప్రభుత్వ అతిథి గృహాలను రాజకీయ నాయకులకు ఉచితంగా ఇవ్వరాదన్నారు.
కౌలు రైతులకు 2.50 లక్షల రుణ అర్హత కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఈ లక్ష్యసాధనకు కృషి చేయాలని జేసీ ఆదేశించారు. ఇప్పటివరకూ 91 వేల మందిని విచారణ జరిపి, వారిలో 87 వేల మంది అర్హులుగా గుర్తించి, రుణ అర్హత కార్డులు జారీ చేశామన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్తుల్లో ఆక్రమణల వివరాలను ఈ నెల 24లోగా తెలియజేయాలన్నారు. భూముల రిజిస్ట్రేషన్లు మాన్యువల్‌గా ఉండి ఆన్‌లైన్‌లో నమోదు కానివారి వివరాలను పంపించాలని, వాటిని ఆన్‌లైన్‌లో సీడింగ్ చేస్తామని చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ బి.యాదగిరి, రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయరామరాజు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు నోటిఫికేషన్
Published Tue, Jun 9 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement
Advertisement