మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా
-
నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్
-
ఈ నెల 13 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ
-
21న పరిశీలన
-
ఉపసంహరణకు 23 వరకు గడువు
-
మార్చి 13న పోలింగ్, 15న కౌంటింగ్
-
ఎన్నికల కోడ్ అమల్లోకి..
అనంతపురం అర్బన్:
పశ్చిమ రాయలసీమ (అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. నోటిఫికేషన్ వెలువడిన మరుక్షణమే మూడు జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెల 13 నుంచి 20 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 23వ తేదీ ఆఖరి గడువు. మార్చి 13న పోలింగ్ జరుగుతుంది. 15వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు.
పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్లు 2,74,159
పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల పరి«ధిలో మొత్తం 2,74,159 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్ర నియోజకవర్గ పరిధిలో 2,53,515 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,75,134 మంది, మహిళలు 76,666 మంది, ఇతరులు 1,715 మంది ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో 20,644 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 13,597 మంది, మహిళలు 6,959, ఇతరులు 88 మంది ఉన్నారు.
508 పోలింగ్ కేంద్రాలు
ఎమ్మెల్సీ ఎన్నికలకు 508 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను 336 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాలో 119, వైఎస్‌ఆర్ జిల్లాలో 105, కర్నూలు జిల్లాలో 112 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను 171 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాలో 65 కేంద్రాలు, వైఎస్‌ఆర్ జిల్లాలో 52, కర్నూలులో 54 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది : బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కారణంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. కోడ్ ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలుంటాయి.