![Keep The Plot Auction Process Says High court - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/15/8888.jpg.webp?itok=H9Pq4o53)
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మియాపూర్ మయూరి నగర్ కాలేజీలో ఉన్న ప్లాట్ల వేలం ప్రక్రియను కొనసాగించుకోవచ్చని హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఏ ఒక్కరి బిడ్లను ఖరారు చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌ఎండీఏ కొన్నేళ్ల క్రితమే మియాపూర్‌లో పలు స్థలాలను ప్రజావసరాల కోసం ఇచ్చిందని, ఇప్పుడు వాటిని హెచ్‌ఎండీఏ అధికారులు వేలం వేస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని మయూరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం హైకోర్టును ఆశ్రయించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది తేలప్రోలు చరణ్ వాదన లు వినిపిస్తూ ప్రజావసరాల కోసం కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని హెచ్‌ఎండీఏ గతంలో అమ్మేసిందని, ఇప్పుడు మిగిలిన వాటిని కూడా వేలం ద్వారా విక్రయించాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ వాదనలను హెచ్‌ఎం డీఏ తరఫు న్యాయవాది వై.రామా రావు తోసిపుచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, వేలం ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment