
మియాపూర్ పరిధిలో విషాద ఘటన
మియాపూర్: మనవడి పుట్టిన రోజు నాడే అతడి తాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌కు చెందిన రాఘవేందర్ రావు(60) భార్య విజయలక్ష్మితో కలిసి మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాఘవేందర్‌రావు కాలనీలో విజయ స్వగృహ ఫుడ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాఘవేందర్‌రావు మనవడు అర్జున్ పుట్టిన రోజు కావడంతో సాయంత్రం వేడుకలు నిర్వహించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కలిసి షాపింగ్‌కు వెళ్లారు. రాఘవేందర్ రావును కూడా రావాలని కోరగా.. తాను ఇంట్లోనే ఉంటానని, మీరు వెళ్లి రండి అని చెప్పారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా బెడ్రూం లోపలి నుంచి డోర్ వేసి ఉంది.
రాఘవేందర్‌రావును ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో.. కిటికిలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపు బద్దలు కొట్టి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా రాఘవేందర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, దీంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మనవడి పుట్టిన రోజు నాడే రాఘవేందర్ రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.
Comments
Please login to add a commentAdd a comment