Shalini mishra
-
ఎందుకిలా?
ఆరు నెలల్లోనే బదిలీ అయిన శాలిని మిశ్రా ముక్కుసూటి తనమే ముంచిందా...? సంస్థలో చర్చోప చర్చలు సిటీబ్యూరో : ఆన్లైన్లో అన్ని అనుమతులు ఇవ్వడం ద్వారా అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ఉన్నఫలంగా బదిలీ అవ్వడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది. హెచ్ఎండీఏలో ఆన్లైన్ సేవలు ప్రారంభించకుండానే ఆమెను తప్పించడం వెనుక రకరకాల కారణాలున్నట్లు వదంతులు విన్పిస్తున్నాయి. హెచ్ఎండీఏ కమిషనర్‌గా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే శాలిని మిశ్రాపై బదిలీ వేటు వేయడం వెనుక పలువురు రియల్టర్ల వత్తిళ్లు గట్టిగా పనిచేసినట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హెచ్ఎండీఏను సంస్కరించేందుకు శాలిని మిశ్రాను నియమించినట్లు ప్రకటించిన సీఎం...ఆరు నెలలు తిరక్కుండానే బదిలీ చేయడం ఏమిటన్న ప్రశ్న సర్వత్రా విన్పిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో లెక్కకుమించి పుట్టుకొచ్చిన అక్రమ లేఅవుట్లపై ఇటీవల శాలిని మిశ్రా ఉక్కుపాదం మోపారు. వరుస దాడులు నిర్వహిస్తూ పలు లే అవుట్లలోని నిర్మాణాలను కూల్చివేసి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలను తొలగించారు. నగరం నలువైపులా ఉన్న అక్రమ లేఅవుట్లపై హెచ్ఎండీఏ సిబ్బంది దాడులు నిర్వహిస్తుండటంతో కొందరు రియల్టర్లు ప్రభుత్వ పెద్దలపై వత్తిడి తెచ్చి శాలిని మిశ్రాను హెచ్ఎండీఏ నుంచి తప్పించినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనికితోడు వివిధ అనుమతులన్నీ ఆన్లైన్లో ఇస్తే అక్రమార్కుల ఆటలు సాగవు క నుక ఆ విధానాన్ని అడ్డుకొనేందుకు కొందరు తమకున్న పలుకుబడిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. గాడితప్పిన ప్లానింగ్ విభాగాన్ని సంస్కరించేందుకు ఆమె చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కండ్లకోయ, కోకాపేట భూ సేకరణకు సంబంధించిన కేసులు, ఐటీ బకాయిలు వంటి సమస్యలు సంస్థను చుట్టుముట్టడంతో వీటి పైనే ఆమె దృష్టిపెట్టి ఓ కొలిక్కి తెచ్చారు. ప్రధానంగా ప్లానింగ్ విభాగం నుంచి తప్పించిన ఓ అధికారిని ప్రభుత్వం తిరిగి అదే పోస్టులో నియమించడం శాలిని మిశ్రాకు మింగుడు పడలేదు. కారణాలివేనా...? శాలిని మిశ్రా హెచ్ఎండీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్న అపవాదు ఉంది. విశ్వనగరం ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా సాధించలేక పోయారు.కొత్త లేఅవుట్లకు అనుమతులిచ్చే విషయంలో కూడా తుచ తప్పకుండా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడకుండా చేశారు.హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ రూపకర్తల్లో ప్రధాన భూమిక పోషించిన ప్లానింగ్ కన్సల్టెంట్ శర్మకు అకారణంగా ఉద్వాసన పలకడంపై ఉద్యోగుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.నిర్ణీత సమయం ముగిశాక కూడా విధులు నిర్వహించాలని సిబ్బందికి హుకుం జారీ చేసి ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకొన్నారు. -
వన్ బై టు!
సాక్షి, సిటీబ్యూరో : ఓ అధికారి చేసిన నిర్వాకం హెచ్ఎండీఏకు తల పోటు తెచ్చిపెట్టింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా స్థలాన్ని ఒకే తేదీన రెండు సంస్థలకు లీజ్‌కు ఇవ్వడం వివాదానికి మూల కారణమైంది. లీజ్ ఒప్పందం ప్రకారం పీపుల్స్ ప్లాజా స్థలాన్ని తమకే ఇవ్వాలని ఆ రెండు సంస్థలూ పట్టుబట్టడంతో సమస్య ముదురు పాకానపడింది. ఓ వైపు హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్, మరో వైపు గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం‘ఫేషియల్ యోగా’ కార్యక్రమం. ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఎటూ పాలుపోని పరిస్థితిలో ‘వన్ బై టు’ విధానాన్ని కొత్తగా ప్రవేశ పెట్టాల్సిన అగత్యం ఎదురైంది. విధానపరంగా ఇది హెచ్ఎండీఏను చిక్కుల్లో పడేయడమే సంస్థ ఇమేజ్‌కు మచ్చ తెచ్చిపెట్టింది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించుకొనేందుకు అసోసియేషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఆ స్థలాన్ని లీజ్‌కు తీసుకొంది. ఇందుకు గాను రోజుకు లక్ష రూపాయల చొప్పున లీజ్ మొత్తం చెల్లించేలా హెచ్ఎండీఏతో ఒప్పందం చేసుకొని ప్రాథమిక రుసుం మొత్తాన్ని చెల్లించింది. ఈ నేపథ్యంలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ కోసం ‘ఫేషియల్ యోగా’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ‘బీయింగ్ హ్యూమన్ ఆర్గనైజేషన్’పీపుల్స్ ప్లాజాను ఈ నెల 11న ఉదయం 6-10గం.ల వరకు లీజ్‌కు తీసుకొంది. ఇందుకోసం రూ.10వేలు దరావత్తు సొమ్ము కూడా చెల్లించింది. అయితే అప్పటికే ఆ స్థలాన్ని హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కోసం లీజ్‌కు ఇచ్చిన బీపీపీ అధికారులు ఆ విషయాన్ని విస్మరించి బీయింగ్ హ్యూమన్ సంస్థకు కూడా లీజ్‌కు ఇస్తూ ఒప్పందం చేసుకొన్నారు. దీంతో ‘ఫేషియల్ యోగా’ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేసుకొనేందుకు శనివారం బీయింగ్ హ్యూమన్ సంస్థ నిర్వాహకులు రావడంతో అక్కడ ఎగ్జిబిషన్ కొనసాగుతున్న విషయాన్ని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. తాము గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని ఒప్పందం మేరకు తమకు పీపుల్స్ ప్లాజాను అప్పగించాలని గట్టిగా కోరారు. అటు ఎగ్జిబిషన్ కూడా ఈనెల 11వరకు కొనసాగాల్సి ఉండడంతో వారు ఆ స్థలాన్ని ఖాళీ చేసేందుకు ససేమిరా అన్నారు. దీంతో పీపుల్స్ ప్లాజా లీజ్ వ్యవహారం పీటముడిలా మారింది. ఇందుకు బాధ్యులైన వారిపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సమస్యను ఏదోలా పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులకు పురమాయించారు. ఈ మేరకు శనివారం అధికారులు పీపుల్స్ ప్లాజా వద్దకు చేరుకొని ఇరు సంస్థల నిర్వాహకులతో చర్చించి ఆ స్థలాన్ని వన్ బై టు చేసేందుకు ఒప్పించారు. దీంతో పీపుల్స్ ప్లాజాలోని డయాస్క్ ఎదురుగా కొంత స్థలాన్ని ఖాళీ చేయించి ప్రత్యేకంగా బారికేడ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ‘ఫేషియల్ యోగా’ కార్యక్రమానికి అంతరాయం కల్గకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ గందరగోళానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా పక్కా విధానాన్ని బీపీపీలో అనుసరించాలని శాలిని మిశ్రా అధికారుల్ని ఆదేశించారు. -
ఇలా.. మొదలైంది..!
► హెచ్ఎండీఏలో డెప్యుటేషన్లకు చెక్ ► 77 మంది మాతృసంస్థలకు బదిలీ ► 47 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు బాధ్యతలు స్వీకరించిన శాలిని మిశ్రా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొత్త కమిషనర్‌గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాలిని మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 9.30 గంటలకు ఆమె కమిషనర్ సీట్లో ఆసీనులయ్యారు. కొత్త కమిషనర్‌ను కలిసి అభినందించేందుకు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది ఆసక్తి చూపారు. ఆమె ఎవరినీ అనుమతించకపోవడంతో పుష్పగుచ్ఛాలతో వచ్చిన పలువురు అధికారులు ఉస్సూరుమంటూ వెనుదిరిగారు. కమిషనర్ వచ్చీరాగానే ప్రక్షాళన ప్రారంభించడంతో సిబ్బందిలో కలవరం మొదలైంది. అవసరానికి మించి అధికంగా ఉన్నారన్న కార ణాన్ని చూపుతూ 47 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు నిబద్ధతతో పనిచేస్తున్న వారూ ఉన్నారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్క కలం పోటుతో ఉద్యోగం నుంచి తప్పించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కొత్త కమిషనర్ వచ్చీ రాగానే చిరుద్యోగులమైన తమపై కొరడా ఝుళిపిస్తారని ఊహించలేదని ఔట్సోర్సింగ్ సిబ్బంది ఘొల్లుమంటున్నారు. మలి దశలో మరికొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్వాసనకు జాబితా సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లానింగ్ విభాగంలోని పలువురు అవినీతి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి... కష్టపడి పనిచేస్తున్న తమను బదిలీ చేయడం ప్రభుత్వ పెద్దల దుర్ణీతికి అద్దం పడుతోందని డెప్యూటేషన్‌పై వచ్చిన కొంతమంది అధికారులు బాహాటంగా విమర్శిస్తున్నారు. అదనపు బాధ్యలు ఇలా... హెచ్ఎండీఏలో పరిపాలనాపరంగా కీలకమైన సెక్రటరీ, మెంబర్ ఎస్టేట్, ఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలాజీ రంజిత్ ప్రసాద్‌ను మాతృశాఖ రెవెన్యూ విభాగానికి బదిలీ చేశారు. ఆ బాధ్యతలను ఎస్టాబ్లిష్మెంట్ విభాగం డీఏఓ ఎం.సరస్వతికి అదనంగా అప్పగించారు. మహా నగరాభివృద్ధి సంస్థకు గుండెకాయ లాంటి అకౌంట్స్ విభాగం సీఈఓ నరసింహన్‌ను మాతృసంస్థకు బదిలీ చేశారు. అదే విభాగంలో డీఏఓ-1గా పనిచేస్తున్న డి.విజితకు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. సీపీఓగా వి.ధీరజ్‌కుమార్‌కు, డెరైక్టర్ ప్లానింగ్-1 గా డి.యాదగిరిరావుకు, అడిషనల్ డెరైక్టర్‌గా కె.వికాస్, పీఓలుగా కల్పక కౌది, గోపికా రమ్యలకు బాధ్యతలు అప్పగించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో ప్రధానమైన ఓఎస్డీ, డెరైక్టర్ అర్బన్‌ఫారెస్ట్రీ, అసిస్టెంట్ డెరైక్టర్ 1, 2 పోస్టులను బీపీపీ మెంబర్ ఎన్విరాన్మెంట్ బి.చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగించారు. హెచ్ఎండీఏ డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్ల బాధ్యతను శ్రీనివాసాచారికి, ఫారెస్ట్ రేంజి ఆఫీసర్స్ పోస్టులను ఏఓ డి.సుధాకర్, ఎం.ఎస్.ఎన్.మూర్తికి అదనంగా అప్పగించారు. భూ విభాగంలోని తహశీల్దారులు, డిప్యూటీ తహశీల్దారులు, సూపరింటెండెంట్ల పోస్టులకు ఇన్చార్జిలను నియమించారు. -
ష్... గప్ చుప్!
► గుట్టుగా సర్దుకుంటున్న అక్రమార్కులు ► లొసుగులు బయటపడకుండా జాగ్రత్త ► దాచేసిన ఫైళ్లు బీరువాల్లో ప్రత్యక్షం ► ఆగమేఘాలపై పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ ► ఒక్కరోజులోనే 30 దస్త్రాలకు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ప్రస్తుత పరిస్థితి ‘ఎక్కడి దొంగలు అక్కడే... గప్ చుప్’ అన్నట్లుగా ఉంది. కొత్త కమిషనర్‌గా శాలిని మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరిస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తమ పరిధిలోని ఫైళ్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో.. ? లేదోనన్న విషయాన్ని మరోసారి పరిశీలించుకొని వాటిని ఓ క్రమపద్ధతిలో పెట్టుకొన్నారు. కొత్త కమిషనర్ ఛార్జి తీసుకున్న వెంటనే విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తే... ఎక్కడా లొసుగులు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఏదైనా ఫైల్‌పై కమిషనర్ ఆరా తీస్తే అందరూ ఒకే విధంగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకించి ప్లానింగ్ విభాగంలో ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ఒకే మాట... ఒకే బాట.. అన్నట్లుగా వ్యవహరించేందుకు పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నట్లు వినికిడి. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు బుధవారంనాడు దుమ్ము దులిపారు. వీటిలో ఇప్పటికే హెచ్ఎండీఏకు డబ్బు చెల్లించి ఉన్న ఫైళ్లను ఆఘమేఘాలపై రిలీజ్ చేశారు. నిజానికి వీటికి సంబంధించి నిర్ణీత ఫీజు చెల్లింపులు జరిగినా ... మూమూళ్లు ముట్టలేదన్న కారణంతో వాటిని పక్కకు పెట్టేశారు. అయితే... వీటిపై ఫిర్యాదులు వస్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో వాటిని బుధవారం నాడే రిలీజ్ చేశారు. కొన్ని ఫైళ్లకు సపోర్టు డాక్యుమెంట్లు లేవన్న కారణాన్ని సాకుగా చూపుతూ రిజెక్టు చేస్తూ మరికొన్నింటికి డీసీ లెటర్లు పంపడం గమనార్హం. ఇటీవలి వరకు ఇన్స్పెక్షన్ల పేరుతో బయటకు వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకొంటున్న కొందరు అధికారులు బుధవారం సాయంత్రం వరకు కార్యాయలంలో కూర్చొని ఫైళ్లను పక్కాగా సర్దిపెట్టుకొన్నారు. ఇదే తరుణంలో కొన్ని అనుమతుల విషయంలో తమ అక్రమాలు, అవకతవకలు బయటపడకుండా ఆయా ఫైళ్లను దాచేశారు. ఇదే క్రమంలో గతంలో తమ ఇళ్లలో దాచేసిన ఫైళ్లను గుట్టుగా బ్యాగుల్లో తెచ్చి బీరువాల్లో పెట్టేశారు. ఇన్వార్డ్... అవుట్ వార్డ్ రిజిస్టర్లను సైతం సరిదిద్ది జాగ్రత్త చేశారు. ఇదే అదనుగా... రూ.4-5 కోట్లు జుర్రేశారు? కొత్త కమిషనర్ చార్జి తీసుకొంటే అక్రమాలకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు పక్కాగా చ క్రం తిప్పారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ఫైళ్ల క్లియర్ చేసి సుమారు రూ.4-5కోట్లు దండుకొన్నట్లు హెచ్ఎండీఏలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అన్ని అనుమతులున్న ఫైళ్లకు అప్రూవల్ ఇస్తూ అందినకాడికి జుర్రుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకించి ఘట్కేసర్, శంకర్పల్లి, శామీర్‌పేట, మేడ్చల్ జోనల్ కార్యాలయాల పరిధిలో అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఇటీవలనోటీసులు జారీ చేశారు. వీటిని అందుకొన్న రియల్టర్లు బుధవారం తార్నాకకు వచ్చి ఆ జాబితాలో తమ పేర్లు లేకుండా పెద్దసార్లను కలిసి భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మేడ్చల్, సంగారెడ్డి, శామీర్‌పేట ప్రాంతాల్లోని పరిశ్రమలకు సంబంధించిన ఫైళ్లను కూడా చాలావరకు బుధవారం నాడే క్లియర్ చేయడం గమనార్హం. అలాగే లేఅవుట్స్, గ్రూపు హౌసింగ్ కాలనీలకు కూడా పెద్దసంఖ్యలో అనుమతులు మంజూరు చేశారని సిబ్బందే చెప్తున్నారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పలువురు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని చకచకా పూర్తిచేయడంతో బుధవారం హెచ్ఎండీఏలో అక్రమార్కుల కాసుల వర్షం కురిసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. వీరిని పట్టించుకొనే నాథుడే లేకపోవడంతో తార్నాక కార్యాలయంలో ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమే. -
ఏపీఎండీసీ ఎండీగా షాలినీ మిశ్రా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు ఎండీగా షాలినీ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చే శారు. ప్రస్తుతం షాలినీ మిశ్రా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రస్తుతం ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో కూడా కొనసాగుతారు. సెర్ప్ సలహాదారుగా రామలక్ష్మి సెర్ప్ కన్సల్టెంట్‌గా ఇటీవల నియమితులైన రిటైర్డు ఐఎఫ్ఎస్ అధికారి రామలక్ష్మి హోదాను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ కన్సల్టెంట్‌కు బదులుగా సెర్ప్ సలహాదారు హోదాలో ఆమె విధులు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.