సాక్షి, సిటీబ్యూరో : ఓ అధికారి చేసిన నిర్వాకం హెచ్‌ఎండీఏకు తల పోటు తెచ్చిపెట్టింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా స్థలాన్ని ఒకే తేదీన రెండు సంస్థలకు లీజ్‌కు ఇవ్వడం వివాదానికి మూల కారణమైంది. లీజ్ ఒప్పందం ప్రకారం పీపుల్స్ ప్లాజా స్థలాన్ని తమకే ఇవ్వాలని ఆ రెండు సంస్థలూ పట్టుబట్టడంతో సమస్య ముదురు పాకానపడింది. ఓ వైపు హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్, మరో వైపు గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం‘ఫేషియల్ యోగా’ కార్యక్రమం.
ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఎటూ పాలుపోని పరిస్థితిలో ‘వన్ బై టు’ విధానాన్ని కొత్తగా ప్రవేశ పెట్టాల్సిన అగత్యం ఎదురైంది. విధానపరంగా ఇది హెచ్‌ఎండీఏను చిక్కుల్లో పడేయడమే సంస్థ ఇమేజ్‌కు మచ్చ తెచ్చిపెట్టింది.
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించుకొనేందుకు అసోసియేషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఆ స్థలాన్ని లీజ్‌కు తీసుకొంది. ఇందుకు గాను రోజుకు లక్ష రూపాయల చొప్పున లీజ్ మొత్తం చెల్లించేలా హెచ్‌ఎండీఏతో ఒప్పందం చేసుకొని ప్రాథమిక రుసుం మొత్తాన్ని చెల్లించింది. ఈ నేపథ్యంలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ కోసం ‘ఫేషియల్ యోగా’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ‘బీయింగ్ హ్యూమన్ ఆర్గనైజేషన్’పీపుల్స్ ప్లాజాను ఈ నెల 11న ఉదయం 6-10గం.ల వరకు లీజ్‌కు తీసుకొంది.
ఇందుకోసం రూ.10వేలు దరావత్తు సొమ్ము కూడా చెల్లించింది. అయితే అప్పటికే ఆ స్థలాన్ని హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కోసం లీజ్‌కు ఇచ్చిన బీపీపీ అధికారులు ఆ విషయాన్ని విస్మరించి బీయింగ్ హ్యూమన్ సంస్థకు కూడా లీజ్‌కు ఇస్తూ ఒప్పందం చేసుకొన్నారు. దీంతో ‘ఫేషియల్ యోగా’ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేసుకొనేందుకు శనివారం బీయింగ్ హ్యూమన్ సంస్థ నిర్వాహకులు రావడంతో అక్కడ ఎగ్జిబిషన్ కొనసాగుతున్న విషయాన్ని హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు.
తాము గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని ఒప్పందం మేరకు తమకు పీపుల్స్ ప్లాజాను అప్పగించాలని గట్టిగా కోరారు. అటు ఎగ్జిబిషన్ కూడా ఈనెల 11వరకు కొనసాగాల్సి ఉండడంతో వారు ఆ స్థలాన్ని ఖాళీ చేసేందుకు ససేమిరా అన్నారు. దీంతో పీపుల్స్ ప్లాజా లీజ్ వ్యవహారం పీటముడిలా మారింది. ఇందుకు బాధ్యులైన వారిపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సమస్యను ఏదోలా పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులకు పురమాయించారు.
ఈ మేరకు శనివారం అధికారులు పీపుల్స్ ప్లాజా వద్దకు చేరుకొని ఇరు సంస్థల నిర్వాహకులతో చర్చించి ఆ స్థలాన్ని వన్ బై టు చేసేందుకు ఒప్పించారు. దీంతో పీపుల్స్ ప్లాజాలోని డయాస్క్ ఎదురుగా కొంత స్థలాన్ని ఖాళీ చేయించి ప్రత్యేకంగా బారికేడ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ‘ఫేషియల్ యోగా’ కార్యక్రమానికి అంతరాయం కల్గకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ గందరగోళానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా పక్కా విధానాన్ని బీపీపీలో అనుసరించాలని శాలిని మిశ్రా అధికారుల్ని ఆదేశించారు.
వన్ బై టు!
Published Sun, Oct 11 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM
Advertisement