అవసరానికి మించి అధికంగా ఉన్నారన్న కార ణాన్ని చూపుతూ 47 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
► హెచ్‌ఎండీఏలో డెప్యుటేషన్లకు చెక్
► 77 మంది మాతృసంస్థలకు బదిలీ
► 47 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
బాధ్యతలు స్వీకరించిన శాలిని మిశ్రా
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కొత్త కమిషనర్‌గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాలిని మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 9.30 గంటలకు ఆమె కమిషనర్ సీట్లో ఆసీనులయ్యారు. కొత్త కమిషనర్‌ను కలిసి అభినందించేందుకు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది ఆసక్తి చూపారు. ఆమె ఎవరినీ అనుమతించకపోవడంతో పుష్పగుచ్ఛాలతో వచ్చిన పలువురు అధికారులు ఉస్సూరుమంటూ వెనుదిరిగారు. కమిషనర్ వచ్చీరాగానే ప్రక్షాళన ప్రారంభించడంతో సిబ్బందిలో కలవరం మొదలైంది.
అవసరానికి మించి అధికంగా ఉన్నారన్న కార ణాన్ని చూపుతూ 47 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు నిబద్ధతతో పనిచేస్తున్న వారూ ఉన్నారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్క కలం పోటుతో ఉద్యోగం నుంచి తప్పించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కొత్త కమిషనర్ వచ్చీ రాగానే చిరుద్యోగులమైన తమపై కొరడా ఝుళిపిస్తారని ఊహించలేదని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఘొల్లుమంటున్నారు.
మలి దశలో మరికొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్వాసనకు జాబితా సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లానింగ్ విభాగంలోని పలువురు అవినీతి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి... కష్టపడి పనిచేస్తున్న తమను బదిలీ చేయడం ప్రభుత్వ పెద్దల దుర్ణీతికి అద్దం పడుతోందని డెప్యూటేషన్‌పై వచ్చిన కొంతమంది అధికారులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
అదనపు బాధ్యలు ఇలా...
హెచ్‌ఎండీఏలో పరిపాలనాపరంగా కీలకమైన సెక్రటరీ, మెంబర్ ఎస్టేట్, ఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలాజీ రంజిత్ ప్రసాద్‌ను మాతృశాఖ రెవెన్యూ విభాగానికి బదిలీ చేశారు. ఆ బాధ్యతలను ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం డీఏఓ ఎం.సరస్వతికి అదనంగా అప్పగించారు. మహా నగరాభివృద్ధి సంస్థకు గుండెకాయ లాంటి అకౌంట్స్ విభాగం సీఈఓ నరసింహన్‌ను మాతృసంస్థకు బదిలీ చేశారు. అదే విభాగంలో డీఏఓ-1గా పనిచేస్తున్న డి.విజితకు ఆ బాధ్యతలు కట్టబెట్టారు.
సీపీఓగా వి.ధీరజ్‌కుమార్‌కు, డెరైక్టర్ ప్లానింగ్-1 గా డి.యాదగిరిరావుకు, అడిషనల్ డెరైక్టర్‌గా కె.వికాస్, పీఓలుగా కల్పక కౌది, గోపికా రమ్యలకు బాధ్యతలు అప్పగించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో ప్రధానమైన ఓఎస్‌డీ, డెరైక్టర్ అర్బన్‌ఫారెస్ట్రీ, అసిస్టెంట్ డెరైక్టర్ 1, 2 పోస్టులను బీపీపీ మెంబర్ ఎన్విరాన్‌మెంట్ బి.చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగించారు. హెచ్‌ఎండీఏ డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల బాధ్యతను శ్రీనివాసాచారికి, ఫారెస్ట్ రేంజి ఆఫీసర్స్ పోస్టులను ఏఓ డి.సుధాకర్, ఎం.ఎస్.ఎన్.మూర్తికి అదనంగా అప్పగించారు. భూ విభాగంలోని తహశీల్దారులు, డిప్యూటీ తహశీల్దారులు, సూపరింటెండెంట్ల పోస్టులకు ఇన్‌చార్జిలను నియమించారు.