ష్... గప్ చుప్! | HMDA Pending files clearance | Sakshi
Sakshi News home page

ష్... గప్ చుప్!

Published Thu, Apr 23 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

HMDA Pending files clearance

గుట్టుగా సర్దుకుంటున్న అక్రమార్కులు
లొసుగులు బయటపడకుండా జాగ్రత్త
దాచేసిన ఫైళ్లు బీరువాల్లో ప్రత్యక్షం
ఆగమేఘాలపై పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్
ఒక్కరోజులోనే 30 దస్త్రాలకు గ్రీన్‌సిగ్నల్

 
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో ప్రస్తుత పరిస్థితి ‘ఎక్కడి దొంగలు అక్కడే... గప్ చుప్’ అన్నట్లుగా ఉంది. కొత్త కమిషనర్‌గా శాలిని మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరిస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తమ పరిధిలోని ఫైళ్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో.. ? లేదోనన్న విషయాన్ని మరోసారి పరిశీలించుకొని వాటిని ఓ క్రమపద్ధతిలో పెట్టుకొన్నారు. కొత్త కమిషనర్ ఛార్జి తీసుకున్న వెంటనే విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తే... ఎక్కడా లొసుగులు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

ఏదైనా ఫైల్‌పై కమిషనర్ ఆరా తీస్తే అందరూ ఒకే విధంగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకించి  ప్లానింగ్ విభాగంలో ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ఒకే మాట... ఒకే బాట.. అన్నట్లుగా వ్యవహరించేందుకు పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నట్లు వినికిడి. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు బుధవారంనాడు దుమ్ము దులిపారు. వీటిలో ఇప్పటికే హెచ్‌ఎండీఏకు డబ్బు చెల్లించి ఉన్న ఫైళ్లను ఆఘమేఘాలపై రిలీజ్ చేశారు. నిజానికి వీటికి సంబంధించి నిర్ణీత ఫీజు చెల్లింపులు జరిగినా ... మూమూళ్లు ముట్టలేదన్న కారణంతో వాటిని పక్కకు పెట్టేశారు. అయితే... వీటిపై ఫిర్యాదులు వస్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో వాటిని బుధవారం నాడే రిలీజ్ చేశారు.

కొన్ని ఫైళ్లకు సపోర్టు డాక్యుమెంట్లు లేవన్న కారణాన్ని సాకుగా చూపుతూ రిజెక్టు చేస్తూ మరికొన్నింటికి డీసీ లెటర్లు పంపడం గమనార్హం. ఇటీవలి వరకు ఇన్‌స్పెక్షన్ల పేరుతో బయటకు వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకొంటున్న కొందరు అధికారులు బుధవారం సాయంత్రం వరకు కార్యాయలంలో కూర్చొని ఫైళ్లను పక్కాగా సర్దిపెట్టుకొన్నారు. ఇదే తరుణంలో కొన్ని అనుమతుల విషయంలో తమ అక్రమాలు, అవకతవకలు బయటపడకుండా ఆయా ఫైళ్లను దాచేశారు. ఇదే క్రమంలో గతంలో తమ ఇళ్లలో దాచేసిన ఫైళ్లను గుట్టుగా బ్యాగుల్లో తెచ్చి బీరువాల్లో పెట్టేశారు. ఇన్‌వార్డ్... అవుట్ వార్డ్ రిజిస్టర్లను సైతం సరిదిద్ది జాగ్రత్త చేశారు.

ఇదే అదనుగా... రూ.4-5 కోట్లు జుర్రేశారు?
కొత్త కమిషనర్ చార్జి తీసుకొంటే అక్రమాలకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు పక్కాగా చ క్రం తిప్పారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ఫైళ్ల క్లియర్ చేసి సుమారు రూ.4-5కోట్లు దండుకొన్నట్లు హెచ్‌ఎండీఏలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అన్ని అనుమతులున్న ఫైళ్లకు అప్రూవల్ ఇస్తూ అందినకాడికి జుర్రుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకించి ఘట్‌కేసర్, శంకర్‌పల్లి, శామీర్‌పేట, మేడ్చల్ జోనల్ కార్యాలయాల పరిధిలో అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఇటీవలనోటీసులు జారీ చేశారు. వీటిని అందుకొన్న రియల్టర్లు బుధవారం తార్నాకకు వచ్చి ఆ జాబితాలో తమ పేర్లు లేకుండా పెద్దసార్లను కలిసి భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మేడ్చల్, సంగారెడ్డి, శామీర్‌పేట ప్రాంతాల్లోని పరిశ్రమలకు సంబంధించిన ఫైళ్లను కూడా చాలావరకు బుధవారం నాడే క్లియర్ చేయడం గమనార్హం. అలాగే లేఅవుట్స్, గ్రూపు హౌసింగ్ కాలనీలకు కూడా పెద్దసంఖ్యలో అనుమతులు మంజూరు చేశారని సిబ్బందే చెప్తున్నారు.   పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పలువురు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని చకచకా పూర్తిచేయడంతో బుధవారం హెచ్‌ఎండీఏలో అక్రమార్కుల కాసుల వర్షం కురిసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి.  వీరిని పట్టించుకొనే నాథుడే లేకపోవడంతో తార్నాక కార్యాలయంలో ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement