శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన తెలుపు రంగు రేషన్ కార్డులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. బియ్యం, ఇతర సరుకులు అందజేయాలని కోరుతూ జిల్లా వీఆర్‌ఏ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్‌ఏలు చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను, సంక్షేమాలను, రెవెన్యూ సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు సక్రమంగా అందిస్తున్నారని చెప్పారు. వీఆర్‌ఏలను అన్ని పనులకు, పౌర సరఫరాల పనులకు వాడుకుంటున్నారని, అయితే తమ తెలుపు రంగు రేషన్ కార్డులు ఎత్తివేశారని ఆవేదన చెందారు. దీంతో కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రేషన్ కార్డులు పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏ సంఘం నాయకులు వై.అప్పలస్వామి, జె.ఎర్రయ్య, పి.శ్రీనివాసరావు, రాజయ్య, ప్రసాదరావు, రామచంద్రుడు, పున్నయ్య, రమణ, రాజారావు, లక్ష్మి, చిట్టయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు అఖిల పక్షాల నాయకులతో కలిసి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో రత్నాల నర్సింహమూర్తి, చౌదరి సతీష్, ఎ.రాధ, చాపర సుందర్‌లాల్, చౌదరి తేజేశ్వరరావు, తాండ్ర ఆరుణ, తదితరులు ఉన్నారు.
తెలుపు రేషన్ కార్డులు పునరుద్ధరించాలి
Published Tue, May 16 2017 4:50 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
Advertisement