అమలాపురం:రాష్ర్టంలో రెవెన్యూ సేవలందించడంలో అమలాపురం రెవెన్యూ డివిజన్ ప్రథమ స్థానంలో నిలిచినట్టు ఆర్డీవో జి.గణేష్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నాలుగు రెవెన్యూ విభాగాల్లో ప్రథమ స్థానం, రెండు విభాగాల్లో తృతీయ స్థానాలను అమలాపురం కైవసం చేసుకున్నట్టు ఆయన వివరించారు.
రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఈ డివిజన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ పత్రం పంపించారని ఆర్డీవో తెలిపారు. సేవల్లో అమలాపురం డివిజన్ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా తమ కార్యాలయంలో డివిజన్‌లోని తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు,సిబ్బందితో గురువారం సాయంత్రం జరిగిన ఆత్మీయ, అభినందన సభలో ఆర్డీవో గణేష్‌కుమార్ మాట్లాడారు.
ల్యాండ్ కన్వర్షన్‌లో డివిజన్ నూరుశాతం దరఖాస్తులను పరిష్కరించిందని చెప్పారు. కరక్షన్ ఇన్ కరెంట్ అడంగళ్‌లో... ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లలో... వెబ్ ల్యాండ్ ఆధార్ సీడింగ్‌లో డివిజన్ రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచిందని పేర్కొన్నారు. లేట్ రిజస్ట్రేషన్ ఆఫ్ బర్త్‌లో...మాడ్యులేషన్ ఆఫ్ ఇ-పాస్ బుక్స్ సేవల్లో డివిజన్ రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానాలను సాధించిందని ఆర్డీవో వివరించారు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఆర్డీవో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అభినందించారు.
కలెక్టర్ అరుణకుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణల ప్రోత్సాహం కూడా తమ విజయంలో భాగస్వామ్యం అవుతుందని ఆర్డీవో అన్నారు. అనంతరం డివిజన్ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఆర్డీవో కట్ చేశారు. ఆర్డీవోకు పూలగుచ్ఛాలు అందజేసి తహసీల్దార్లు అభినందించారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వీఎస్ దివాకర్, తహసీల్దార్లు నక్కా చిట్టిబాబు, పాము సుబ్బారావు, బేబీ జ్ఞానాంబ, సత్యవతి, సుధాకర్‌రాజు, లక్ష్మీపతి తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.
రెవెన్యూ సేవల్లో అమలాపురం స్టేట్ ఫస్ట్
Published Fri, Apr 22 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM
Advertisement
Advertisement