సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: బోగస్ విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన 42 మంది ఉపాధ్యాయులపై సీబీసీఐడీ కేసు నమోదు చేసింది. విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు సీబీసీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 2009 జనవరి 31న జిల్లా విద్యాశాఖ చేపట్టిన పదోన్నతుల కౌన్సెలింగ్‌లో పలువురు ఉపాధ్యాయులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు ఫిర్యాదులు అందాయి. 2009లో చేపట్టిన పదోన్నతుల్లో మొత్తం 330 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా వీరిలో చాలామంది పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లను సమర్పించారు. దీంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి పీజీ చేసిన ఉపాధ్యాయులు సీనియారిటీ లేక పదోన్నతుల్లో తీవ్రంగా నష్టపోయారు. వీరి ఫిర్యాదుతో లోకాయుక్త విచారణకు ఆదేశించింది. దీంతో బోగస్ సర్టిఫికెట్లను గుర్తించేందుకు విద్యాశాఖ డెరైక్టరేట్ 4 ఏప్రిల్ 2010లో 14 మార్గదర్శకాలను సూచిస్తూ సర్టిఫికెట్లను పరిశీలించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పట్లో డిప్యూటీ ఈఓల ద్వారా సర్టిఫికెట్లను పరిశీలించారు.
సర్టిఫికెట్ల పునః పరిశీలనలో వినాయక మిషన్ (తమిళనాడు), జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్, కువ్వెంపు, మధ్యప్రదేశ్(భోజ్) యూనివర్సిటీల పేరుతో జారీ చేసిన ధ్రువీకరణ పత్రాల్లో చాలావరకు బోగస్ ఉన్నట్లు విద్యాశాఖ నిర్ధారణకు వచ్చింది. సదరు సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల జాబితాను రూపొందించిన విద్యాశాఖ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీబీసీఐడీని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన మూడు వేల మందికిపైగా ఉపాధ్యాయులపై సీబీసీఐడీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు సమాచారం. జిల్లాకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న 42 మంది ఉపాధ్యాయులు వీరిలో ఉన్నారు. సీబీసీఐడీ డీఎస్పీ స్థాయి అధికారి మూడు రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన ఉపాధ్యాయులకు సంబంధించి వివరాలు సేకరించినట్టు సమాచారం. వారు సర్టిఫికెట్లు ఎక్కడ, ఎలా పొందారు? అనే కోణంలోనూ సీబీసీఐడీ అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సీబీసీఐడీ దర్యాప్తు పూర్తయితే బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
42 మంది టీచర్లపై క్రిమినల్ కేసులు
Published Sun, Oct 20 2013 12:28 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement