
అంజిత్
జన్నారం: కాలేజీ ఫీజు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని కళాశాల యాజమాన్యం చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో జరిగింది. విద్యార్థి తండ్రి జక్కుల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..కలమడుగు గ్రామానికి చెందిన జక్కుల అంజిత్(19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాడు.
ఇటీవల ఎంసెట్ రాశాడు. ఈనెల 28న జగిత్యాలలో కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కౌన్సెలింగ్‌కు ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరం ఉండటంతో అంజిత్ తండ్రి శ్రీనివాస్ ఇటీవల కళాశాలకు వెళ్లాడు. సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరగా ఫీజు బకాయి రూ.30 వేలు ఉందని, వాటిని చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. తమ వద్ద అంత డబ్బు లేదని, కౌన్సెలింగ్ తర్వాత చెల్లిస్తామని శ్రీనివాస్ వేడుకున్నా యాజమాన్యం పట్టించుకోలేదు.
దీంతో నిరాశగా వెనుదిరిగాడు. ఈ విషయం తెలుసుకున్న అంజిత్ మనస్తాపానికి లోనయ్యాడు. ఈ నెల 27న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జన్నారం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ, సోమవారం మృతి చెందాడు. తన కొడుకు మృతికి కారకులైన కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని మృతుని తండ్రి శ్రీనివాస్ కోరాడు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment