inter student died
-
అనూష ఆత్మహత్య.. నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనూష కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో అనూష ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆదివారమే అనూషను పేరెంట్స్ హాస్టల్లో దింపి వెళ్లారు. ఆమెను డ్రాప్ చేసిన కాసేపటికే గదిలో ఉరివేసుకుని అనూష ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం అనూష పేరెంట్స్‌కి ఫోన్ చేసి.. విద్యార్థి పేరెంట్స్‌కు స్పృహ తప్పి కిందపడిపోయినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో, సిటీ దాటకముందే.. పేరెంట్స్ కాలేజీకి బయలుదేరారు. వారు.. కాలేజీకి వెళ్ళే సరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని యాజమాన్యం తెలిపింది యాజమాన్యం. పేరెంట్స్ కాలేజీకి రాకముందే అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది నారాయణ కాలేజీ యాజమాన్యం. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, తాజాగా బాచుపల్లి నారాయణ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనూష బంధువులు నారాయణ కాలేజీలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనూష సూసైడ్ చేసుకున్న విషయాన్ని తమకు ముందే ఎందుకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో తాము అనూష డెడ్‌బాడీని చూడకముందే ఎందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారని అడిగారు. ఈ క్రమంలో కాలేజీ ఎదుట వారు ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించే ప్రయత్నం చేయగా.. వాగ్వాదం చోటుచేసుకుంది. -
ఫీజు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పడంతో.. విద్యార్థి అఘాయిత్యం
జన్నారం: కాలేజీ ఫీజు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని కళాశాల యాజమాన్యం చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో జరిగింది. విద్యార్థి తండ్రి జక్కుల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..కలమడుగు గ్రామానికి చెందిన జక్కుల అంజిత్(19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాడు. ఇటీవల ఎంసెట్ రాశాడు. ఈనెల 28న జగిత్యాలలో కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కౌన్సెలింగ్‌కు ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరం ఉండటంతో అంజిత్ తండ్రి శ్రీనివాస్ ఇటీవల కళాశాలకు వెళ్లాడు. సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరగా ఫీజు బకాయి రూ.30 వేలు ఉందని, వాటిని చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. తమ వద్ద అంత డబ్బు లేదని, కౌన్సెలింగ్ తర్వాత చెల్లిస్తామని శ్రీనివాస్ వేడుకున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగాడు. ఈ విషయం తెలుసుకున్న అంజిత్ మనస్తాపానికి లోనయ్యాడు. ఈ నెల 27న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జన్నారం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ, సోమవారం మృతి చెందాడు. తన కొడుకు మృతికి కారకులైన కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని మృతుని తండ్రి శ్రీనివాస్ కోరాడు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విషాదం: పబ్జీ గేమ్ ఆడిన యువకుడు..
సాక్షి, ద్వారకాతిరుమల: పబ్జీ గేమ్‌కు బానిసైన ఒక యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమలలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు కొంత కాలంగా పబ్జీ (ఫ్రీ ఫైర్)గేమ్‌కు బానిసయ్యాడు. లాక్డౌన్ వల్ల ఇంటర్మీడియెట్ చదువుతున్న ఈ యువకుడు ఇంటి వద్దే ఖాళీగా ఉంటూ, ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతున్నాడు. నిద్రాహారాలు మానేసి రాత్రి, పగలు అనే తేడాలేకుండా పబ్జీ గేమ్‌ను ఆడేవాడు. నాలుగు రోజుల నుంచి అతడి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఉదయం ఆ యువకుడ్ని ఏలూరుకు తీసుకెళ్లి, సంజీవని వాహనంలో కరోనా టెస్ట్ చేయించగా, నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దిండి రిసార్ట్స్ వద్ద తేలిన మృతదేహం పాలకొల్లు సెంట్రల్: ఆచంట మండలం భీమలాపురానికి చెందిన యర్రగొండ్ల పవన్‌కుమార్ శర్మ(24) గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలలో సోమవారం సాయంత్రం 6గంటలకు దిండి రిసార్ట్స్ వద్ద అతని మృతదేహం దొరికినట్లు యలమంచిలి ఎస్సై గంగాధర్ తెలిపారు. శర్మ మృతదేహాన్నీ పంచనామా నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి తరలించనున్నట్లు తెలిపారు. పాలకొల్లు గాయత్రి స్మార్త పురోహిత సంఘం సెక్రటరీ ఈరంకి కాశీ విశ్వనాథం తెలిపిన వివరాలు ప్రకారం భీమలాపురానికి చెందిన పవన్‌కుమార్ శర్మ సంస్కృతంలో ఎంఏ చేశారు. సంస్కృతానికి విలువ లేకపోవడంతో ఉద్యోగం దొరకక పాలకొల్లు పట్టణంలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి వృద్ధుడైన తండ్రి, మానసిక ఇబ్బందితో ఉన్న తల్లి, కదలలేని స్థితిలో బాబాయ్, 90 సంవత్సరాల నానమ్మ ఉన్నారు. వీరు ఉంటున్న ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. వీరందరినీ శర్మ జీవనాధారంతోనే పోషించుకుంటూ వస్తున్నాడు. గత నాలుగు నెలలుగా కోవిడ్ 19 వల్ల ఆలయాలు మూసివేయడం పెళ్లిళ్లు పేరంటాలు, పూజలు, హోమాలు లేకపోవడంతో ఆదాయ మార్గాలు లేక ఆర్థిక భారంతో అనేక ఇబ్బందులకు గురయ్యాడని తెలిపారు. ఈ బాధలు భరించలేక ఆదివారం తన ద్విచక్ర వాహనంపై చించినాడ గోదావరి వంతెన వద్దకు వెళ్లి గోదావరిలో దూకినట్లు అక్కడి స్థానికులు తెలిపారన్నారు. -
ట్రాక్టర్ కింద పడి ఇంటర్ విద్యార్ధిని మృతి
-
డెత్ మిస్టరీ
ఒంగోలు: నగర శివారు పేర్నమిట్ట శ్రీ ప్రతిభ కాలేజీ వద్ద గురువారం అర్ధరాత్రి 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి సజీవ దహనం మిస్టరీగా మారింది. కాలేజీ నుంచి అదృశ్యమై 24 గంటలు గడవక ముందే కాలేజీకి పట్టుమని పది అడుగుల దూరంలో గేటుకు ఆవలి వైపు మృతి చెంది కనిపించడం కలకలం రేపుతోంది. కొద్దిసేపు మృతదేహాన్ని గుర్తించలేని తల్లి రాత్రికి బంధువులతో కలిసి వచ్చి మృతదేహం తమ కుమారుడిదేనంటూ నిర్థారించింది. వివరాలు.. కనుమర్ల సుబ్బలక్షమ్మ స్వగ్రామం అర్ధవీడు మండలం నాగులవరం. భర్త 12 ఏళ్లు క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి నుంచి పిల్లలను చదివించుకుంటోంది. పెద్ద కుమారుడు రాజారెడ్డిని, చిన్న కుమారుడు రాహుల్‌రెడ్డిని ప్రతిభ విద్యా సంస్థల్లో చేర్పించింది. రాజారెడ్డి జూనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతుండగా చిన్న కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. ప్రోకబడ్డీ వంటి వాటిపై కాలేజీలో చిన్న చిన్న బెట్టింగులు పెట్టుకుంటూ డబ్బులు పోగొట్టుకొని రాజారెడ్డి తన తమ్ముడి నుంచి 50 రూపాయలు తీసుకొని కాలేజీ నుంచి అదృశ్యమయ్యాడు. గతంలో కూడా కాలేజీ నుంచి అదృశ్యమై తర్వాత తిరిగి వచ్చే వాడు. మంటలు రావడంతో ఆందోళన నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రతిభ కాలేజీలో విద్యార్థులు డ్యాన్స్‌లు నేర్చుకుంటున్నారు. అర్ధరాత్రి దాటినా విద్యార్థులు డ్యాన్స్‌లు వేస్తుండటంతో ఇన్చార్జి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జూనియర్ లెక్చరర్ సుబ్బారెడ్డి ఇక పడుకోండంటూ విద్యార్థులకు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో కాలేజీ ప్రహరీ అవతలి వైపు పొలంలో మంటలు కనిపించాయి. ఏదో తగలబడుతోందని భావించిన విద్యార్థులు, లెక్చరర్లు అక్కడకు పరుగున చేరుకున్నారు. గేటు వేసి ఉండటంతో గేటుకు ఉన్న రంధ్రం నుంచి పరిశీలించారు. బయట ఓ యువకుడు తగలబడుతున్నట్లు గుర్తించారు. గేటు తాళం బలవంతంగా తెరిచి నీటితో విద్యార్థులు మంటలు ఆర్పేశారు. కానీ మృతుడు ఎవరనేది విద్యార్థులు గుర్తించలేకపోయారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి ఇన్చార్జి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సుబ్బారెడ్డి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. విచారణపై ప్రత్యేక దృష్టి విషయం తెలియగానే ఎస్పీ సత్యఏసుబాబు పోలీసు అధికారులను పరుగులెత్తించారు. ట్రైనీ ఎస్పీ బిందు మాధవ్, టౌన్ డీఎస్పీ రాథేష్ మురళి, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లుతో పాటు డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు రంగ ప్రవేశం చేశారు. కాలేజీ ఆవరణ నుంచి విద్యార్థులు పారిపోయేందుకు అవకాశం ఉన్న రెండు ప్రాంతాలను గుర్తించారు. అందులో ఒకటి ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతం. పోలీసు జాగిలం కాలేజీలోని వంటగది తదితరాలను పరిశీలించింది. వేలిముద్రల నిపుణులు ఘటన స్థలంలోని మట్టి నమూనాలు, వెంట్రుకలు సీజ్ చేశారు. అనంతరం కాలేజీ సిబ్బంది, విద్యార్థులను విచారించి కాలేజీ నుంచి గురువారం ఉదయం అదృశ్యమైన రాజారెడ్డి ఆచూకీ కోసం సీసీ టీవీ పుటేజిని పరిశీలించారు. బుధవారం రాత్రి తమ్ముడు నుంచి రూ.50లు తీసుకున్న తర్వాత నుంచి అదృశ్యమైనట్లు నిర్థారణకు వచ్చారు. గురువారం కర్నూల్ రోడ్డులోని అన్నా క్యాంటీన్లో కూడా భోజనం చేసినట్లు నిర్థారించుకున్నారు. రాత్రికి సమతానగర్ వద్ద ఒక పెట్రోలు బంకులో ఒక యువకుడు అరలీటరు పెట్రోలును ఒక థమ్సప్ బాటిల్లో కొట్టించుకున్నట్లు గుర్తించి పెట్రోలు బంకులో సీసీ పుటేజి పరిశీలనలో నిమగ్నమయ్యారు. వ్యక్తమవుతున్న అనుమానాలు రాజారెడ్డి వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఘటన స్థలిని పరిశీలిస్తే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మంటల ధాటికి పరుగులు పెడతారు. ఎక్కడా పరిగెత్తిన ఆనవాళ్లు లేవు. ఒకచోట మాత్రమే తగలబడినట్లు ఉండటంతో ఎవరైనా చంపి తీసుకొచ్చి కాలేజీ వద్ద పడేశారా..అనే అనుమానం వ్యక్తం అవుతోంది. దానికితోడు కాలేజీ వరకు వచ్చిన విద్యార్థి అక్కడ తగలబెట్టుకోవాల్సిన అవసరం ఏమిటనేది అంతుబట్టడంలేదు. ఇది కాకుండా కాలేజీలో విద్యార్థుల మధ్య ఏదైనా వివాదం చోటుచేసుకొని అందులోకి ప్రైవేటు వ్యక్తులు రంగంలోకి దిగారా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. విద్యార్థులను ఎంత తరచి ప్రశ్నించినా వివాదం వంటి అంశాలు ఎక్కడా వెలుగులోకి రాలేదు. మరో వైపు పేర్నమిట్ట శ్రీచైతన్య కాలేజీ సమీపంలో గురువారం రాత్రి 11 నుంచి 11.30 గంటల సమయంలో ఒక కారు, నాలుగు బైకులపై ఉన్న ఏడెనిమిది మంది వ్యక్తుల మధ్య వివాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది. దాని ప్రభావం ఏమైనా ఈ అంశంలో చోటుచేసుకుందా అనే మరో అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గురువారం రాత్రి ముగ్గురు విద్యార్థులతో కలిసి రాజారెడ్డి మొదటి ఆట సినిమాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం వారిలో ఒకరితో కలిసి సెకండ్ షో సినిమాకూ వెళ్లాడు. ఆ తర్వాత బస్టాండ్‌కు వెళ్లి ఇద్దరూ విడిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడ నుంచి ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. -
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
జడ్చర్ల టౌన్: బాదేపల్లి పట్టణంలోని బీసీ మేనేజ్మెంట్ హాస్టల్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తోటి విద్యార్థినులు, మృతురాలి సోదరి అనిత తెలిపిన వివరాల ప్రకారం... ఇటిక్యాల మండలం సాసనూల్ గ్రామానికి చెందిన ఆంజనేయులు, ఈరమ్మ దంపతుల మొదటి కూతురు జి.వినీల(18) జడ్చర్ల వీఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండో ఏడాది చదువుతోంది. స్థానికంగా కోర్టు ఎదురుగా ఉన్న బీసీ మేనేజ్మెంట్ హాస్టల్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం 3గంటలకు కళాశాల నుంచి హాస్టల్‌కు వచ్చింది. సమీపంలో వినాయక నిమజ్జన వేడుకల్లో తోటి విద్యార్థినులతో కలిసి పాల్గొంది. రాత్రి 11.30గంటల సమయంలో హాస్టల్‌గదిలో పడుకుంది. కొద్దిసేపటికే వాంతికి రావడంతో వాష్ రూంకు వెళ్లింది. ఆయాసంగా ఉండటంతో వంట మనిషికి చెప్పింది. వారు బాదేపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృత్యువాత పడింది. మృతురాలికి థైరాయిడ్ సమస్య, అస్థమా ఉందని తెలిసింది. అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి ఉండవచ్చని బాదేపల్లి డాక్టర్లు తెలిపారని కులసంఘాల నాయకులు చెప్పారు. విద్యార్థిని అస్వస్థత, మృతి విషయం తెలియగానే వార్డెన్ స్వప్నారాణి అదేరాత్రి ఆస్పత్రికి చేరుకుంది. అప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం అందించటంతో వారుకూడా ఆస్పత్రికి చేరుకున్నారు. వినీల మృతదేహానికి బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇవీ సందేహాలు విద్యార్థిని మృతిపట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటం, ఇటీవలే పట్టణంలో డెంగీ కేసులు అధికంగా రావటంతో మృతిపట్ల సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వాష్‌రూంకు వెళ్లిన సమయంలో ఏదైనా కరిచి ఉంటుందా అన్న అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జడ్చర్ల సీఐ బాల్‌రాజ్‌యాదవ్ హాస్టల్‌కు చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆర్థికసాయం చేసిన మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విద్యార్థిని తల్లిదండ్రులకు రూ.25వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బీసీ వెల్ఫేర్ డీడీ విద్యాసాగర్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వినీల మృతిపట్ల ప్రభుత్వం విచారణ జరిపించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్, బీసీసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జంగయ్యమాదిగ తదితరులు డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ హాస్టల్లో వసతులు సక్రమంగా లేకపోవటం వల్లే ఘటన జరిగిందని ఆరోపించారు. -
పుస్తకం కోసం వచ్చి.. మృత్యు ఒడికి..
రాజంపేట: రాజంపేట–రాయచోటి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) స్పీడ్ బ్రేకర్ వద్ద శనివారం సాయంత్రం టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఇంటర్ విద్యార్థి యెద్దల రమేష్(17) దుర్మరణం చెందాడు. మృతుడు రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం బావికాడిపల్లె రామాపురం నడిమ అరుంధతీవాడకు చెందిన చిన్నయ్య, లక్షుమ్మ దంపతులకు రెండవ కుమారుడు. రమేష్ రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లాడు. విద్యార్ధి మృతితో రామాపురం నడిమ అరుంధతీవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గైడ్ కోసం పట్టణంలోకి వచ్చి.. రమేష్, శ్యామ్‌కుమార్‌లు సైకిల్‌పై గైడ్ కొనుగోలు చేసేందుకు ఆర్వోబీ( రాయచోటి వైపు) నుంచి పట్టణంలోకి వచ్చారు. తిరిగి మళ్లీ కళాశాల వైపు వెళ్లే సమయంలో ఆర్వోబీ ఎక్కే సమయంలో అకస్మాత్తుగా వెనుకవైపు నుంచి రాయచోటి వైపు వెళుతున్న టిప్పర్ ఢీ కొంది. సైకిల్‌పై ఉన్న శ్యామ్‌కుమార్ ఎడమవైపు పడటంతో టిప్పర్ కింద పడకుండా తప్పించుకోగలిగాడు. అయితే రమేష్ మాత్రం టిప్పర్ వెనుక టైర్ల కింద పడటంతో తల నుజ్జునుజ్జు అయింది. అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అరుంధతీవాడలో విషాద ఛాయలు... రామాపురం నడిమ అరుంధతీవాడలో ఇంటర్ విద్యార్థి రమేష్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని టిప్పర్ ఢీ కొని నేరుగా వెళ్లిపోతుండగా స్థానికులు వెంబడించారు. ఆర్వోబీ ఆవలివైపు టిప్పర్‌ను నిలిపివేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం నుంచ బయటపడిన శ్యామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నారు. -
స్నేహితుడిని కాపాడబోయి..
కొనకనమిట్ల: వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వద్దిమడుగు చెరువులో శుక్రవారం జరిగింది. వివరాలు.. మండలంలోని రేగుమానిపల్లి పంచాయతీ గుర్రాలమడుగు ఎస్సీ కాలనీకి చెందిన విడుదల విజయ్‌కుమార్ (17) మార్కాపురంలోని సాధన కాలేజీలో ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉంటున్న విజయ్‌కుమార్ తన స్నేహితులైన చందు, చిన్నీ, దేవసాయంతో కలిసి సైకిళ్లపై తమ గ్రామ సమీపంలోని వద్దిమడుగు చెరువుకు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. నలుగురు సరదాగా ఈత కొట్టే సమయంలో వారిలో చిన్నీ ప్రమాదవశాత్తు నీటిలో మునగి పోతున్నాడు. గమనించిన విజయ్‌కుమార్ తన స్నేహితుడిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో స్నేహితుడు చిన్నీ ఒడ్డుకు రాగా విజయ్‌కుమార్ నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. తోటి స్నేహితులు భయపడి గ్రామానికి వెళ్లి ‡జరిగిన విషయాన్ని బంధువులతో చెప్పారు. స్థానికులు వెళ్లి విజయ్‌కుమార్ మృతదేహాన్ని బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. చెరవులో ఇటీవల మట్టి తోలడంతో లోతు ఎక్కువగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ కుంటల్లో నీరు చేరింది. విద్యార్థి మృతి చెందటంతో గుర్రాలమడుగు ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కొడుకు కావడంతో మంచి చదువులు చదివించాలని ప్రైవేట్ కాలేజీలో చదిస్తున్నామని, ఇంతలో ఇలా జరిగిందేంది దేవుడా.. అంటూ విజయ్‌కుమార్ తల్లిదండ్రులు పెదకోటయ్య, కోటమ్మ దంపతులు భోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వీఆర్ఓ జయప్రకాశ్, సర్పంచ్ గంటా రమణారెడ్డిలు విజయ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యార్థి మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ బాలకృష్ణ ఆదేశాల మేరకు ఏఎస్ఐ మనోహర్ తన సిబ్బందితో గుర్రాలమడుగు ఎస్సీ కాలనీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మనోహర్ తెలిపారు. -
ప్రాణాలు తీసిన కోతులు
-
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ఓ ఇంటర్ విద్యార్థి కళాశాల హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఖమ్మం జిల్లా వేమ్సూరు మండలం బీరపల్లికి చెందిన నర్సిరెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి నిజాంపేటలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తన గదిలోని ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కెమిస్ట్రీ లెక్టరర్ విపరీతంగా కొట్టడంతో మనస్థాపం చెందిన విద్యార్థి క్యాంపస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. యశ్వంత్ కుటుంబీకులకు కనీస సమాచారం ఇవ్వకుండా హడావుడిగా ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులు రాకముందే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కళాశాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మృతుని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతిచెందాడని వారు ఆరోపిస్తున్నారు. -
విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి
మార్కాపురం : పట్టణంలోని ఓ కళాశాలలో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. స్థానికంగా ఉన్న కళాశాలలో మండలంలోని గోగులదిన్నె గ్రామానికి చెందిన నూనె మల్లేశ్వరి (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతోంది. మధ్యాహ్నం భోజనం చేసి చేతులు శుభ్రం చేసుకునేందుకు కళాశాలలోని బాత్రూమ్కు వెళ్లింది. అక్కడ బురద ఉండటంతో కాలు జారింది. కింద పడిపోతానేమోనన్న భయంతో పక్కనే ఉన్న విద్యుత్ తీగను పట్టుకోగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తిరుపతమ్మ, చిన్న సుబ్బారెడ్డిలు కుమార్తె మృతదేహాన్ని చూసి విలపించారు. సహచర విద్యార్థినులు కంటతడి పెట్టారు. సీఐ పి.కరుణాకర్, రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి తల్లిదండ్రులతో మాట్లాడారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ఆశల దీపం ఆరిపోయింది..!
బూర్జ: ఆ విద్యార్థి బూర్జ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మండలానికే ప్రథముడిగా నిలిచాడు.. తమ పిల్లడు బాగానే చదువుతున్నాడన్న ఆ కుటుంబం ఆనందం ఎంతో కాలం నిలువలేదు.. టైఫాయిడ్ పుణ్యమా అని వారి ఆశల దీపం ఆరిపోయింది.. దీంతో తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు.. వివరాలిలా ఉన్నాయి... మండలంలోని తోటవాడ గ్రామానికి చెందిన కోనాడ కృష్ణ (17) శుక్రవారం అర్థరాత్రి టైఫాయిడ్ జ్వరంతో శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కోనాడ జయమ్మ, త్రినాథరావు బోరున విలపిస్తున్నారు. మా ఆశల దీపం ఆరిపోయిందని వారు కన్నీరు మున్నీరయ్యారు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కృష్ణకు స్థానికంగా వైద్యసేవలందక ప్రైవేటు వైద్యం పొందలేక తమ కొడుకును చేతులారా చంపేసుకున్నామని వారు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి పరిస్థితి విషమించడంతో తప్పనిసరి పరిస్థితిలో ఈనెల 9న శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కోనాడ జయమ్మ, త్రినాథరావులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రాముడు,లక్ష్మణ అనే ఇద్దరు కవ లలు మూగవారు కావడంతో మరో కుమారుడు కృష్ణపై వారు ఆశలు పెట్టుకున్నారు. తమతోపాటు మూగపిల్లలకు కూడా ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. కోనాడ కృష్ణ మృతి చెందిన విషయం తెలుసుకుని ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు ఆ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. పారిశుద్ధ్య లోపమే విద్యార్థిని బలితీసుకుంది ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ కాలనీ వాసులు బూర్జ: గ్రామంలోని పారిశుద్ధ్య లోపమే అభం శుభం తెలియని విద్యార్థి కోనాడ కృష్ణను బలి తీసుకుందని తోటవాడ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు శనివారం పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరరావు, ఏఎన్ఎం అరుణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 12 నుంచి నెల రోజులుగా గ్రామంలో ప్రతి ఇంటిలో జ్వరాల బారిన పడి బాధపడుతున్నా పంచాయతీ అధికారులు గాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఒక్క బోరు కూడా లేకపోవడంతో బావినీరే తాగుతున్నామని, ఆ నీరు కలుషితమైందని వైద్య సిబ్బంది పరీక్షలో నిర్థారణ అయినప్పటికీ బావి నీరు తాగవద్దని తమకు తెలియజేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారన్నారు. కాలనీకి వెళ్లే రోడ్డుపై పంట కుప్పలు, మలమూత్ర విసర్జనతో నిండి దుర్గంధం అలముకుంటోందని ఆవేదన చెందారు. పెంటకుప్పలను తొలగించాలని ఇటీవల గ్రామాన్ని సందర్శించిన జేసీ ఆదేశించినప్పటికీ ఆఆదేశాలు బేఖాతర్ చేశారని విమర్శించారు. ఆ కుటుంబానికి ఆధారమైన యువకుడు మరణించడంతో ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని వారు అధికారులను నిలదీశారు. ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, తహశీల్దార్ బాబ్జీరావు, వైఎస్ఆర్ సీపీ నాయకుడు గుమ్మిడి రాంబాబు అక్కడకు చేరుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే గ్రామంలో వైద్య సేవలందించాలని ఎంపీపీ సూర్యారావు డాక్టర్ ప్రనన్నకుమార్కు ఆదేశించారు. పెంటకుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. దీంతో దళితులు శాంతించారు.