
విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి
మార్కాపురం : పట్టణంలోని ఓ కళాశాలలో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. స్థానికంగా ఉన్న కళాశాలలో మండలంలోని గోగులదిన్నె గ్రామానికి చెందిన నూనె మల్లేశ్వరి (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతోంది. మధ్యాహ్నం భోజనం చేసి చేతులు శుభ్రం చేసుకునేందుకు కళాశాలలోని బాత్‌రూమ్‌కు వెళ్లింది. అక్కడ బురద ఉండటంతో కాలు జారింది. కింద పడిపోతానేమోనన్న భయంతో పక్కనే ఉన్న విద్యుత్ తీగను పట్టుకోగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తిరుపతమ్మ, చిన్న సుబ్బారెడ్డిలు కుమార్తె మృతదేహాన్ని చూసి విలపించారు. సహచర విద్యార్థినులు కంటతడి పెట్టారు. సీఐ పి.కరుణాకర్, రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి తల్లిదండ్రులతో మాట్లాడారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.