ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ఓ ఇంటర్ విద్యార్థి కళాశాల హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఖమ్మం జిల్లా వేమ్సూరు మండలం బీరపల్లికి చెందిన నర్సిరెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి నిజాంపేటలోని ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
శుక్రవారం సాయంత్రం తన గదిలోని ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కెమిస్ట్రీ లెక్టరర్ విపరీతంగా కొట్టడంతో మనస్థాపం చెందిన విద్యార్థి క్యాంపస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. యశ్వంత్ కుటుంబీకులకు కనీస సమాచారం ఇవ్వకుండా హడావుడిగా ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులు రాకముందే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కళాశాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మృతుని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతిచెందాడని వారు ఆరోపిస్తున్నారు.