విద్యార్థులు ఈతకు వెళ్లిన చెరువు ఇదే..,విజయ్‌కుమార్ మృతదేహం
కొనకనమిట్ల: వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వద్దిమడుగు చెరువులో శుక్రవారం జరిగింది. వివరాలు.. మండలంలోని రేగుమానిపల్లి పంచాయతీ గుర్రాలమడుగు ఎస్సీ కాలనీకి చెందిన విడుదల విజయ్‌కుమార్ (17) మార్కాపురంలోని సాధన కాలేజీలో ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉంటున్న విజయ్‌కుమార్ తన స్నేహితులైన చందు, చిన్నీ, దేవసాయంతో కలిసి సైకిళ్లపై తమ గ్రామ సమీపంలోని వద్దిమడుగు చెరువుకు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. నలుగురు సరదాగా ఈత కొట్టే సమయంలో వారిలో చిన్నీ ప్రమాదవశాత్తు నీటిలో మునగి పోతున్నాడు. గమనించిన విజయ్‌కుమార్ తన స్నేహితుడిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో స్నేహితుడు చిన్నీ ఒడ్డుకు రాగా విజయ్‌కుమార్ నీటిలో మునిగిపోయి మృతి చెందాడు.
తోటి స్నేహితులు భయపడి గ్రామానికి వెళ్లి ‡జరిగిన విషయాన్ని బంధువులతో చెప్పారు. స్థానికులు వెళ్లి విజయ్‌కుమార్ మృతదేహాన్ని బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. చెరవులో ఇటీవల మట్టి తోలడంతో లోతు ఎక్కువగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ కుంటల్లో నీరు చేరింది. విద్యార్థి మృతి చెందటంతో గుర్రాలమడుగు ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కొడుకు కావడంతో మంచి చదువులు చదివించాలని ప్రైవేట్ కాలేజీలో చదిస్తున్నామని, ఇంతలో ఇలా జరిగిందేంది దేవుడా.. అంటూ విజయ్‌కుమార్ తల్లిదండ్రులు పెదకోటయ్య, కోటమ్మ దంపతులు భోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వీఆర్‌ఓ జయప్రకాశ్, సర్పంచ్ గంటా రమణారెడ్డిలు విజయ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యార్థి మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ బాలకృష్ణ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ మనోహర్ తన సిబ్బందితో గుర్రాలమడుగు ఎస్సీ కాలనీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మనోహర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment